WorldWonders

సునామీ అవగాహన దినోత్సవం

World Tsunami Awareness Day 2019

హిందూ మహాసముద్రంతో అనుబంధంగా ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన హైదరాబాద్ నుంచే వెళ్తుంటాయని మీకు తెలుసా? సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక.. సముద్రపు అలల ఎత్తు.. వేగం.. వాటి తీవ్రత ఏమేర ఉంటుందో నిమిషాల్లో భారత్తో పాటు ఆయా దేశాలకు చేరవేసే ‘విజ్ఞాన వాహిని’ భాగ్యనగర సొంతమనే విషయం తెలుసా? ఔను ఇది నిజం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది. ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి. నేడు ‘ప్రపంచ సునామీ అవేర్నెస్ డే’ సందర్భంగా ఇంకాయిస్ అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం.
*మత్స్యకారులకు ఉపయోగకర సేవల కోసం 1999లో ప్రగతినగర్ సమీపంలో పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి వారికి చేరవేసే కేంద్రంగా మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఓషియన్ స్టేట్ పోర్కాస్ట్ సేవలను ప్రారంభించింది. సముద్ర భాగంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందించే సేవలకు అంకురార్పణ చేసింది. 2004లో వచ్చిన సునామీతో వార్నింగ్ సెంటర్గా ఇది అవతరించింది.
**మృత్యు సునామీ..
2004లో వచ్చిన సునామీతో సుమారు 2,40,000 మంది వరకు అసువులు బాశారు. మరో 48,000 మంది కనిపించకుండాపోయిన విషయం విదితమే. దాదాపు 14 దేశాలపై సునామీ ప్రభావం కనిపించింది. ఆ సమయంలోనే సునామీ అనే పదం అందరికీ పరిచయమైంది. అప్పటివరకు సునామీపై ముందస్తు సమాచారం అందించే కేంద్రం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహా సముద్ర సమాచార సేవలు అందుతుండడంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005 నుంచి 2007 వరకు ఆపరేషన్ ప్రక్రియ కొనసాగింది. 2007లో పూర్తి స్థాయిలో ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టం కేంద్రంగా అవతరించింది.
**సునామీఅవేర్నెస్ డే వచ్చిందిలా..
జపాన్కు చెందిన గోహి అనే రైతు 1985లో సముద్రం వెనక్కి వెళ్లడాన్ని గుర్తించాడు. శబ్ద తరంగాల్లో మార్పును గమనించాడు. దీంతో సునామీ రాబోతుందని గుర్తించాడు. తమ ఊరిలో ప్రతిఒక్కరికీ ఈ సమాచారం చెప్పే సమయం లేదు. దీంతో ఆయనకు ఓ ఐడియా వచ్చింది. తన పంట పొలాన్ని తగులబెట్టేశాడు. జనాలు ఏం జరుగుతుందోనని అక్కడికి చేరుకున్నారు. అందరూ ఎత్తు ప్రాంతానికి వెళ్లంది అని సైగలతో చెప్పాడు. ఆ సమయంలో వచ్చిన సునామీ నుంచి 400 మందిని గోహి కాపాడాడు. ఇలా ఆయన ప్రేరణతో వరల్డ్ సునామీ అవేర్నెస్ డే వచ్చింది.
**ఇంకాయిస్ సమాచారం..
సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్కు చేరుతుంది. ఆ తర్వాత భూకంపం ప్రభావంతో సునామీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టి సారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కి.మీ దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు.
**గుర్తిస్తారు ఇలా..
సముద్రంలో భూకంపాలు, ల్యాండ్స్లైడ్స్ (అగ్ని పర్వతాలు బద్దలవ్వడం), ల్యాండ్ స్లైడ్స్ (కొండ చరియలు విరిగిపడడం), మెటీరాయిడ్ వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ, కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీర ప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. భూమి కంపించడం ద్వారా కూడా సునామీ వచ్చే అవకాశాన్ని అంచనా వేయవచ్చు.
**విస్తృత అవగాహన..
సునామీ, సముద్ర విపత్తులపై ఇంకాయిస్ విస్తృతమైన అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సునామీ మాక్ డ్రిల్స్ను నిర్వహిస్తున్నారు. సునామీ వచ్చేసమయంలో సంకేతాలు ఏవిధంగా ఉంటాయి, ప్రకృతిపరంగా జరిగే మార్పులు, ప్రమాదం నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.
**నిమిషాల వ్యవధిలోనే..
ఆయా ఆధునిక పరికరాల ద్వారా సునామీ రాకను గుర్తించడమే కాకుండా తీరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది, ఎంత ఎత్తులో కెరటాలు వస్తాయి, దాని తీవ్రత ఏమేర ఉంటుందో ఇంకాయిస్ అంచనా వేస్తుంది. అలా సేకరించిన సమాచారాన్ని జిల్లా స్థాయిలో ఉండే డిస్ట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, రాష్ట్ర స్థాయిలో ఉండే ఎస్ఈఓసీ (స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్), జాతీయ స్థాయిలో ఉండే ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ), ఎంహెచ్ఏ (మినిస్ట్రీ ఆఫ్ హోం సైన్సెస్)లకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడు స్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తుంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది.