ScienceAndTech

6జీ వైపు దూసుకెళ్తున్న చైనా

China running towards beginning 6G experiments

వేగవంతమైన మొబైల్‌ డేటాను అందించడంలో పొరుగు దేశం చైనా దూసుకుపోతోంది. ఇటీవలే 5జీ సేవలను ప్రారంభించిన ఆ దేశం అప్పుడే 6జీపై కన్నేసింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించిందని ఆ దేశ మీడియా తెలిపింది. దీనికి సంబంధించి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవలే సమావేశమైంది. 6జీ అభివృద్ధి, పరిశోధనకు రెండు గ్రూపులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. సరికొత్త వైర్‌లెస్‌ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరగనున్నాయని తెలిపింది. దీనిపై చైనా సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రి వాంగ్‌ షీ మాట్లాడుతూ ‘‘ 6జీ ఎంతో దూరంలో ఉంది. త్వరలో దీనికి సంబంధించిన పరిశోధనలు ప్రారంభం కానున్నాయి. సాంకేతిక పరంగా ఆచరించవలసిన ప్రణాళికలు పూర్తిగా సిద్ధం కాలేదు’’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 5జీ సాంకేతికతను అందిపుచ్చుకునే పనిలో ఉండగా.. చైనా అప్పుడే 6జీ పరిశోధనలకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. ప్రస్తుతమున్న 4జీతో పోలిస్తే 5జీలో కనీసం 20 రెట్లు వేగంగా డేటా లభిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలకు 5జీ ఎంతో ఉపకరిస్తుంది.