NRI-NRT

Flash: గోవాలో కనపడకుండా పోయిన అమెరికా యువతి

24 Yr Old American Girl Elizabeth Mann Goes Missing In Goa-Flash: గోవాలో కనపడకుండా పోయిన అమెరికా యువతి

అమెరికాకు చెందిన యువతి గోవాలో అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల ఎలిజిబెత్‌ మాన్‌ అనే యువతి అమెరికా నుంచి వచ్చి గోవాకు వచ్చింది. అయితే, నిన్న ఉదయం 5గంటల సమయంలో బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. హోటల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన ఆమె తల్లి అమెరికా రాయబార కార్యాలయంతో పాటు గోవాలోని అంజునా పోలీసులను సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలిజిబెత్‌ మాన్‌ అనే యువతి ఒంటరిగానే అక్టోబర్‌ 24న అమెరికా నుంచి నేరుగా గోవా చేరుకుంది. అంజునా ప్రాంతంలోని ఓ హోటల్‌లోనే బస చేసింది. గోవాలో పలు ప్రాంతాలను సైతం సందర్శించింది. అయితే, ఆమె నిన్న అమెరికాకు తిరుగుపయనం కావాల్సి ఉంది. మధ్యాహ్నం 2గంటలకు డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆమె ఉదయం 9గంటలకే ట్యాక్సీలో బయల్దేరాల్సి ఉంది. హోటల్‌ సిబ్బంది ఆ యువతి తల్లితో టచ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో హోటల్‌ సిబ్బంది ఒకరు యువతిని నిద్ర లేపేందుకు ఉదయం 8గంటల సమయంలో వెళ్లగా ఆమె గదిలో లేదు. దీంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా ఉదయం 5గంటల సమయంలో హోటల్‌ నుంచి బయటకు వెళ్లినట్టు గుర్తించి అమెరికాలోని ఆమె తల్లికి సమాచారం ఇచ్చారు. తీవ్ర ఆందోళనకు గురైన ఎలిజిబెత్‌ మాన్‌ తల్లి అమెరికా రాయబార కార్యాలయాన్ని, అంజులా పోలీసులను సంప్రదించారు. ఆమె ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. యువతి తనకు తానుగానే హోటల్‌ నుంచి వెళ్లినట్టు తాము సీసీ ఫుటేజీల్లో గుర్తించామని పోలీసులు తెలిపారు. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.