Devotional

అసలేమిటీ ఈ రామజన్మభూమి-అయోధ్య వివాదం?

The full story and history of Ayodhya Rama Janmabhoomi Masjid Litigation-అసలేమిటీ ఈ రామజన్మభూమి-అయోధ్య వివాదం?

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై తుది తీర్పు నేడే వెలువడనుంది.

సుప్రీం తీర్పుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

ఈ ధర్మాసనంలో జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ అశోక్​ భూషణ్, జస్టిస్​ ఎస్​ఏ నజీర్​లు ఉన్నారు.

రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసుపై 40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన ధర్మాసనం అక్టోబర్​ 16న తీర్పును రిజర్వ్​ చేసింది.

సహజంగా శనివారం కోర్టుకు సెలవు దినం. అయినప్పటికీ.. నేడే తుది తీర్పును ఇవ్వాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం.

తుది తీర్పుపై అధికారిక నోటిఫికేషన్​ వెలువడే ముందు భారత ప్రధాన న్యాయముూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నతాధికారులతో భేటీఅయ్యారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.

అయోధ్య కేసుపై తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో సుమారు 4వేల మంది పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్​ విధించారు. ఈనెల 11 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

అయోధ్యలో భద్రత పర్యవేక్షణకోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల కోసం అయోధ్య, లఖ్​నవూలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు.

దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరించారు. కర్ణాటక, జమ్ము, మధ్యప్రదేశ్​లోని కీలక ప్రాంతాల్లో 144 సెక్షన్​తో పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును ప్రజలంతా గౌరవించాలని వివిధ మతాలకు చెందిన పెద్దలు, పూజారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శాంతియుత, సామరస్య వాతావరణం నెలకొనేలా చేయటం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా సందేశం అందించారు.

‘అయోధ్య కేసులో సుప్రీం తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఓటమి కాదు.

ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలి.

దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నా.

న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక-సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి.

గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి.

కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్​ దేశం అంతా కలిసిమెలసి నిలబడాలి’ అని పిలుపునిచ్చారు.

బాబ్రీ మసీదు స్థలంలో గతంలో రామ మందిరం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారన్నది హిందువుల వాదన.

అలాంటిదేమీ లేదని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి.

దీంతో ఆ స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్​ దావాలపై అలహాబాద్​ హైకోర్టు 2010 సెప్టెంబర్​ 30న కీలక తీర్పు వెలువరించింది.

వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది.

అలహాబాద్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటిషన్లు దాఖలు కాగా 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్​ 16 వరకూ రోజువారీ విచారణ చేపట్టింది. తుది తీర్పును రిజర్వ్​ చేసింది.

హిందూ పక్షాల వాదనలు

మొఘల్‌ చక్రవర్తులు రచించిన ‘ఐనీ అక్బరీ’, ‘తుజుక్‌ ఎ జహంగిరీ’లోనూ అయోధ్య నగర ప్రస్తావన ఉంది. ఈస్టిండియా కంపెనీ సహా అనేక మంది పాశ్చాత్య అధికారులు వేర్వేరు రికార్డుల్లో దీన్ని నమోదు చేశారు.

బాబ్రీ మసీదుపై ఇస్లామిక్‌ రచనలు కొన్ని… పవిత్ర ఖురాన్‌, హదిత్‌కు విరుద్ధంగా ఉన్నాయి.

రాముడి జన్మస్థానం అయోధ్యేనన్న విశ్వాసం శతాబ్దాలుగా ఉన్నట్లు అనేక ఆధారాలు చెబుతున్నాయి. జన్మస్థానంలో పూజలు చేసే హిందువుల ఆచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

వివాద ప్రాంతంలో ఒక ఆలయం ఉండేదని, అది ధ్వంసమైందని పురావస్తు శాఖ నివేదిక కూడా చెబుతోంది.

మసీదును ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. అయితే రామజన్మ భూమి ఒక్కటే ఉంది.

ముస్లిం పక్షాల వాదనలు

మసీదుకు బాబర్‌ నిధులు ఇచ్చినట్లు, దాన్ని ఆ తర్వాత నవాబులూ కొనసాగించినట్లు బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా గుర్తించింది.

1885లో దాఖలైన దావాలో సమర్పించిన అనేక పత్రాలు ఈ మసీదు ఉనికిని ధ్రువపరుస్తున్నాయి. ఆ స్థలం ముస్లింల అధీనంలోనే ఉండేది. 1949 డిసెంబరు 22, 23 తేదీల వరకూ అక్కడ ఈద్‌ ప్రార్థనలు జరిగాయి.

రామ జన్మభూమిలో దేవుడి ప్రతిమ ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవు. అక్కడ ఆలయం ఉండేదని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా, అసంపూర్తిగా ఉంది. అది వ్యాఖ్యానమే. శాస్త్రీయ ఆధారం కానేకాదు.

1989 వరకూ హిందువులు ఆ వివాదాస్పద స్థలంపై హక్కులు కోరలేదు. ఆ ప్రదేశాన్ని మాకు అప్పగించాలని మేం మొదట దావా వేశాం. ఆ తర్వాతే హిందువులు పిటిషన్‌ వేశారు.

వివాదాస్పద ప్రాంతంలోని ‘రామ్‌ ఛబుత్ర’, ‘సీతా రసోయి’ హిందువుల అధీనంలో ఉన్నంత మాత్రాన వారికి స్థల యాజమాన్య హక్కులు దక్కవు. ప్రార్థనా హక్కులు మాత్రమే లభిస్తాయి.

1992 డిసెంబరులో కూల్చివేతకు గురికావడానికి ముందున్న రీతిలో బాబ్రీ మసీదును పునరుద్ధరించాలి.

అయోధ్య తీర్పు ఈరోజు వెలువడనున్న నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది.

రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు.

ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది.

అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు.

అత్యంత సున్నిత ప్రాంతాలుగా పరిగణించే గజియాబాద్, సహరన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో వదంతులు సృష్టించేవారిపై నిఘాపెట్టారు.

ప్రయాణికులు ఇటువంటి వదంతులు విన్నవెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.