Movies

రెండూ దశాబ్దాలు పూర్తి

Shankar's Oke Okkadu Completes 20Years

అర్జున్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఒకే ఒక్కడు’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 1999 నవంబరు 9 విడుదలై ‘ఒకే ఒక్కడు’ నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అర్జున్‌ నటన, శంకర్‌ టేకింగ్‌, మనిషా కొయిరాల అందాలు, ముఖ్యంగా రెహమాన్‌ సంగీతం సినిమాను విజయ పథంలో నడిపాయి. మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది.

పురుషోత్తం(అర్జున్‌) క్యూటీవీలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. విద్యార్థులకు, బస్సు డ్రైవర్‌కు మధ్య జరిగిన ఘర్షణలను కవరేజ్‌ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడతాడు. దీంతో అతడికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఒక ఊరిలో సీఎం చౌదరి (రఘువరన్‌)కార్యక్రమాన్ని కవరేజ్‌ చేయడానికి వెళ్లి చంద్రముఖి(మనిషా కొయిరాల)ని చూసి ప్రేమిస్తాడు. సాఫీగా సాగిపోతున్న అతడి జీవితంలో అనుకోని పరిస్థితి ఎదురవుతుంది. తాను పనిచేస్తున్న టెలివిజన్‌ ఛానల్‌లో సీఎంను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. ఇదే పురుషోత్తం జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ‘ఒక్కరోజు సీఎంగా చేసి చూడు’ అని రఘువరన్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించి వన్డే సీఎంగా పనిచేయడానికి పురుషోత్తం ఒప్పుకొంటాడు. ఒక్కరోజు సీఎం అయిన పురుషోత్తం ఏం చేశాడు? సమాజంలో ఎలాంటి మార్పులు తెచ్చాడు? ఘర్షణలకు కారణమైన మాజీ సీఎంను ఎలా జైలుకు పంపాడు? తదితర ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.

జీన్స్‌(1998)తో విజయం అందుకున్న శంకర్‌.. నటుడు శివాజీ గణేశన్‌ స్ఫూర్తితో ‘ఒకే ఒక్కడు’ కథను రాసుకున్నారు. శివాజీ గణేశన్‌ ఓ సారి అమెరికా పర్యటనకు వెళ్లగా, ఆయన గౌరవార్థం ఒకే ఒక్కరోజు న్యూయార్క్‌లోని నయాగరా ఫాల్స్‌ మేయర్‌గా ప్రకటించారు. ఆ ఆలోచనతోనే రజనీకాంత్‌ కథానాయకుడిగా ఈ కథ సిద్ధం చేసుకున్నారు. అంతా పూర్తయిన తర్వాత స్టార్‌తో సినిమా చేయలేమేమోనని అనుకున్నారట. దీంతో విజయ్‌ను హీరోగా పెట్టాలనుకున్నారు. ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. ఇక కమల్‌హాసన్‌ దగ్గరకు వెళ్తే, ఆయన అప్పటికే ‘హేరామ్‌’ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇక తనతో అప్పటికే ‘జెంటిల్‌మేన్‌’ చేసిన అర్జున్‌తో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ‘ఒకే ఒక్కడు’ చిత్రానికి అర్జున్‌ హీరోగా ఎంపికయ్యారు.

ఇక కథానాయికగా మీనాను తీసుకుందామనుకుంటే అదే సమయంలో అర్జున్‌తో కలిసి మీనా ‘రిథమ్‌’ చేస్తుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అప్పటికే ‘భారతీయుడు’ చిత్రంలో పనిచేసిన మనీషా కొయిరాలను తీసుకున్నారు. ప్రతినాయకుడిగా రఘువరన్‌, కీలక పాత్రల్లో మణివణ్ణన్‌, వడివేలును చిత్ర బృందం ఎంపిక చేసింది. మరో కీలక పాత్రలో శిల్పాశెట్టిని అనుకున్నా చివరకు లైలాను తీసుకున్నారు. ఆమెకు కాల్‌షీట్స్‌ సమస్య రావడంతో ఆ పాత్రను శంకర్‌ తగ్గించేశారు. 1999 నవంబరు 7న ‘ముదావలన్‌’ పేరుతో తమిళంలో విడుదల కాగా, తెలుగులో నవంబరు 9న ‘ఒకే ఒక్కడు’ పేరుతో విడుదలైన ఘన విజయం సాధించింది.

* ‘షకలక బేబీ’ పాటలో సుస్మితసేన్‌ ఆడిపాడింది.
* హిందీలో ‘నాయక్‌’పేరుతో అనిల్‌ కపూర్‌ కథానాయకుడిగా ఈ సినిమాను రీమేక్‌ చేశారు. బెంగాలీలో మిథున్‌ చక్రవర్తితో తీశారు.
* ఏఆర్‌ రెహమాన్‌ అందించిన పాటలన్నీ శ్రోతలను విశేషంగా అలరించాయి. అటు తమిళంతో పాటు, తెలుగులోనూ అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి.
* ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కమల్‌, 100 రోజుల ఫంక్షన్‌కు కూడా ఆయన అతిథిగా రావడం విశేషం.
* ఈ సినిమా విడుదల సమయంలో తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. తమ పరిపాలనను విమర్శిస్తూ సినిమా తీశారని వివాదం చెలరేగింది.
* కరుణానిధి గొంతు గుర్తు తెచ్చేలా రఘు వరన్‌ సంభాషణలు పలకడం కూడా ఇందుకు ఓ కారణం.
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘ఒకే ఒక్కడు’ శంకర్‌ స్పెషల్‌ షో వేశారు.