DailyDose

BSNL స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తుల వెల్లువ-వాణిజ్యం-11/10

Over 50000 Employees Apply For VRS In BSNL-Telugu Business News Roundup Today-11/10-BSNL స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తుల వెల్లువ-వాణిజ్యం-11/10

* తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పథకంతో దాదాపు సగానికి పైగా ఉద్యోగులు సంస్థ నుంచి వెళ్లిపోనున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కార్యాకలాపాలను కొనసాగించేందుకు కావాల్సిన మానవ వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఆదేశించింది. ముఖ్యంగా రోజు వారీ కార్యకలాపాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్స్ఛేంజ్‌ల నిర్వహణ యథావిధిగా కొనసాగేలా చూడాలని సూచించింది. ఇందుకోసం వివిధ అవకాశాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిశీలిస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 57వేలమంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరోపక్క ఎంటీఎన్‌ఎల్‌లో అయితే ఈ సంఖ్య ఏకంగా 60వేలు దాటిపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే దాదాపు లక్షమంది వీఆర్‌ఎస్‌కు అర్హులు. కాగా, 77వేలమంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ ద్వారా పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో 1.50లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగులను సగానికి సగం తగ్గించుకోవాలన్నది బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యూహం. తాజా పథకం జనవరి 31, 2020 వరకూ అమలులో ఉండనున్న దృష్ట్యా సంస్థ నుంచి స్వచ్ఛందంగా మరింత మంది వెళ్లిపోయే అవకాశం ఉంది. ‘‘ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. డేటాను సేకరించడం ప్రారంభించాం. ఏ ఎస్‌ఎస్‌ఏ, ఏ యూనిట్‌.. ఎంతమంది వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నారు? తదితర వివరాలను సేకరిస్తున్నాం. దాదాపు80వేల మంది వీఆర్‌ఎస్‌ తీసుకుంటారని అనుకుంటున్నాం. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. మొత్తం ఉద్యోగుల్లో సగంమంది ఖాళీ అవుతారు. పని వాతావరణం పూర్తిగా మారిపోతుంది’’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, ఎండీ, పుర్వార్‌ తెలిపారు. 2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ శాశ్వత, రెగ్యులర్‌ ఉద్యోగులు.. డిప్యుటేషన్‌పై వేరే సంస్థలకు వెళ్లినవారు కూడా అర్హులే. సర్వీస్‌ పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల చొప్పున, ఇంకా ఉన్న పదవీ కాలానికి సంబంధించి ఏడాదికి 25 రోజుల చొప్పున ఎక్స్‌గ్రేషియా లెక్కించి, చెల్లిస్తారు.