Health

బరువు పెరిగితే చావు దగ్గరవుతుందట

Obesity Will Cause Death Sooner-Telugu Health News

ఒంటి బరువు పెరుగుతున్న కొద్దీ జరిగే అనర్థాల గురించి అందరికీ తెలిసిందే. పెరిగే బరువు కారణంగా రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్‌ వంటివి వచ్చే అవకాశాలు పెరిగి అది గుండెపోటుకూ, పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందన్న విషయాలు మనం తరచూ చదువుతూనే ఉంటాం. ఇటీవల నిర్వహించిన మరికొన్ని అధ్యయనాల్లోనూ ఆ అనర్థాల గురించి మళ్లీ మళ్లీ తెలిసివచ్చింది. ఓ వ్యక్తి తాను ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు పెరుగుతుంటే… అది మృత్యువును మరింత త్వరగా రమ్మని ఆహ్వానించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్‌’ మెడికల్‌ జర్నల్‌లోని విషయాలు చెబుతున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్న తొమ్మిది వేల ఐదొందల మంది వ్యక్తులతో పాటు పాటు మామూలు బరువే ఉన్న మూడు లక్షల మందికి పై చిలుకు సాధారణ వ్యక్తులపై దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాలను నిర్వహించారు. ఈ అధ్యయనాలన్నీ మూకుమ్మడిగా వెల్లడించిన విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ అధ్యయనాల్లో తేలింది. బరువే మరణాలకు నేరుగా కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు.