DailyDose

నేటి పది ప్రధాన వార్తలు – 11/14

Telugu Top 10 Breaking News Today-Nov 14 2019

1. ఆంగ్ల చదువులు రాకపోతే వాళ్ల పరిస్థితేంటి?: సీఎం
‘నేటి బాలలే రేపు మన సమాజ నిర్మాతలు’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 33 శాతం మంది పిల్లలు చదువురాని వారున్నారని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ‘ మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే ఎక్కడ చూసినా అంతర్జాలమే కనిపిస్తోందని, మరో 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోనుందని చెప్పారు. పదేళ్ల తర్వాత ప్రతి రంగంలోనూ రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు.
2. ఆర్టీసీ సమ్మె.. కండక్టర్‌కు గుండెపోటు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రభావం కార్మికులపై తీవ్రప్రభావం చూపిస్తోంది. సమ్మెపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని మనస్తాపంతో సిద్దిపేటకు చెందిన నాగేశ్వర్‌ (42) అనే కార్మికుడు మృతి చెంది గంటలైనా గడవక ముందే మరో కార్మికుడు ఆస్పత్రి పాలయ్యాడు. సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో కలత చెంది, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక హైదరాబాద్‌లోని మంథని డిపోకు చెందిన కండక్టర్‌ సమ్మయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరాడు.
3. ఏపీ రాజ్‌భవన్‌లో ఘనంగా బాలల దినోత్సవం
భారత మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఏపీలోని రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలల పిల్లలతో కలిసి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ జీవితం, ఆయన త్యాగాలను విద్యార్థులకు ఆయన వివరించారు. మంచి భవిష్యత్‌కు పునాది వేసేలా బాల్యం ఉండాలని విద్యార్థులకు సూచించారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని గవర్నర్ హితవు పలికారు.
4. తిరుమల శ్రీవారి సేవలో దీప్‌వీర్‌
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్‌ జంట దీపికా పదుకొణె, రణవీర్‌ సింగ్‌లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు.
5. రాహుల్‌ కాస్త జాగ్రత్తగా ఉండండి: సుప్రీం
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. రఫేల్‌ వ్యవహారంపై స్పందిస్తూ..ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రాహుల్‌ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి రాహుల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం రాహుల్‌ గాంధీని సున్నితంగా హెచ్చరించింది.
6. శబరిమల వివాదం విస్తృత బెంచ్‌కు
శబరిమల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది! అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలా? వద్దా? అనే అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. ధర్మాసనంలో మెజార్టీ సభ్యుల నిర్ణయం ఆధారంగా గురువారం తీర్పు ఇచ్చింది. ఆలయ ద్వారాలు మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న వేళ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
7. రోటీలు తయారు చేసిన ప్రిన్స్‌ ఛార్లెస్‌
రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ బుధవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లోని ఔషధీవనంలో ప్రిన్స్‌ ఛార్లెస్‌ మొక్కను నాటారు. అనంతరం గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికింది. అనంతరం అక్కడి సిక్కులతో కలిసి ముచ్చటించారు. వారితో ఫొటోలు కూడా దిగారు. ప్రసాదం తయారీశాలకు వెళ్లి రోటీలు తయారు చేశారు.
8. రష్యా ‘విక్టరీ డే సెలబ్రెషన్స్‌’కు మోదీ
వచ్చే ఏడాది జరిగే ‘విక్టరి డే సెలబ్రెషన్స్‌’కు భారత ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానించారు. బ్రెజిల్‌లోని బ్రసిలియాలో జరగుతున్న 11వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇరువురు నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇలా తరచూ సమావేశాలు జరుగుతుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయన్నారు. రెండు నెలల క్రితం మోదీ, పుతిన్‌ రష్యాలోని వ్లాదివాస్తోక్‌లో భేటీ అయ్యారు.
9. కశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌ చందర్‌ ముర్ము గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందకు కేంద్రం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. దానికి ఇక్కడి యంత్రాంగం, పౌరులంతా సహకరించాలి. జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాలను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తోంది. కావును ఎన్నికల ప్రకటనను కేంద్రమే త్వరలో ప్రకటించనుంది’ అని అన్నారు.
10. డిమాండ్లు నెరవేరే వరకూ ఊరుకోం: అనురాధ
ఇసుక కొరతతో ఎంతమంది చనిపోతున్నారో జగన్‌కు కనిపించడం లేదా? అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి‌ అనురాధ ప్రశ్నించారు. చంద్రబాబు ఇసుక దీక్షను వైసీపీ నేతలు దొంగదీక్ష అనడంపై ఆమె మండిపడ్డారు. గతంలో వైసీపీ చేసిన దీక్షలే దొంగదీక్షలు అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పార్థసారధి గోల వినలేకపోతున్నామన్నారు. మద్దూరు ఇసుక టెండర్ ఒకే ఒక్క వ్యక్తికి ఇచ్చారని.. అతను పార్థసారధి అనుచరుడని చెప్పారు. పార్థసారథికి దమ్ముంటే పెనమలూరు నియోజకవర్గంలో ధర్నా చేయాలన్నారు. ఇసుక దొంగల పేర్లు ఛార్జ్‌షీట్‌లో ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇసుక దీక్షలో మూడు డిమాండ్లు నెరవేరే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.