Devotional

తిరుపతి ప్రసాదాలతో వ్యాపారమా?

TTD Hikes Laddu Prices-Telugu Devotional News Nov 2019

‘దర్శనం బాగా జరిగిందా! లడ్డూలు దొరికాయా!’’… తిరుమలకు వెళ్లి వచ్చిన వారిని తప్పనిసరిగా అడిగే ప్రశ్నలివి! వెంకన్న దర్శనం ఎంత ముఖ్యమో… లడ్డూ ప్రసాదమూ అంతే ముఖ్యం! ఇప్పుడు… టీటీడీ అదే లడ్డూ ప్రసాదంలో లాభ నష్టాల లెక్కలేస్తూ, భక్తులపై భారం మోపాలని భావిస్తోంది. ‘ప్రతి భక్తుడికీ ఒక లడ్డు ఉచితం’ అంటూ… రాయితీలకు పూర్తిగా మంగళం పలకాలని ప్రతిపాదిస్తోంది. లడ్డూ ధరలో రకరకాల విధానాలు ప్రవేశపెట్టి, పెంచుతూ పోయిన టీటీడీ… ఇప్పుడు అదనపు లడ్డూ కావాలంటే రూ.50 చెల్లించక తప్పదని చెబుతోంది. ఇటీవలే కొన్ని కేటగిరీల వసతి గృహాల అద్దెను భారీగా పెంచిన టీటీడీ… ఇప్పుడు లడ్డూ ధరనూ పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో బోర్డు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నడిచేదే భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలతో! సామాన్యులు ముడుపులుకట్టి హుండీల్లో వేసే చిల్లరతో మొదలు… అన్నదానం, ప్రాణదానం వంటి ట్రస్టులకు కోట్లకు కోట్లు విరాళాలు ఇచ్చే భక్తులు ఎందరో! ఇదంతా స్వామి వారిపై భక్తితో భక్తులు సమర్పించుకునే కానుకలే! టీటీడీ ‘వాణిజ్య భాష’లో చెప్పాలంటే ఇదంతా ‘లాభమే’! దీనిని పక్కనపెట్టి… ఏదాని లెక్క దానిదే అంటూ పవిత్రమైన ప్రసాదం విషయంలో మాత్రం నష్టాల పేరిట లడ్డూ ధరలు పెంచడమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
*ఎంతెంత భారం…
ప్రస్తుతం కాలిబాటన వచ్చే దివ్యదర్శన భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇస్తున్నారు. రెండు రాయితీ(రూ.10) లడ్డూలు, రూ.25 ధరతో మరో రెండు లడ్డూలు పొందవచ్చు. అంటే… దివ్యదర్శన భక్తుడికి రూ.70తో గరిష్ఠంగా ఐదు లడ్డూలు దక్కుతాయి. కొత్తగా ప్రతిపాదించిన విధానంలో ఒక లడ్డూను మాత్రం ఉచితంగా ఇస్తారు. మిగిలిన నాలుగు లడ్డూలకు రూ.200లు చెల్లించాల్సిందే. అంటే… అదనంగా రూ.130 భారం పడినట్లు. స్లాటెడ్ సర్వదర్శనం, ఉచిత దర్శనం భక్తులకు రెండు రాయితీ(రూ.10), మరో రెండు రూ.25 ధరతో జారీచేస్తున్నారు. అంటే… నాలుగు లడ్డూలు రూ.70కి పొందవచ్చు. కొత్త విధానంలో ఒక లడ్డూ ఉచితంగా వస్తుంది. మిగిలిన మూడు లడ్డూలకు రూ.150 చెల్లించాల్సిందే. ఇదే లెక్క ప్రకారం… రూ.300, వీఐపీ బ్రేక్ దర్శన భక్తులపైనా రూ.150 భారం పడనుంది.
*ఇదేమి వింత లెక్క?
భక్తులకు వివిధ రకాల ధరలతో లడ్డూలను విక్రయించడంలో గందరగోళంతోపాటు, రాయితీల వల్ల ఈ ఖాతాలో దాదాపు రూ.250 కోట్లు నష్టం వస్తోందని టీటీడీ అంచనా వేసింది. ప్రస్తుతం ముడిసరుకుల మార్కెట్ ధరల ప్రకారం ఒక లడ్డూ తయారీకి సుమారు రూ.40 ఖర్చు అవుతోందట! కానీ, అదనపు లడ్డూను రూ.50కి విక్రయించాలని భావిస్తుండటం గమనార్హం! నిజానికి… ఇప్పటికే పరిమితికి మించి అదనంగా తీసుకునే లడ్డూలకు (ఎల్పీటీ కౌంటర్) రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. వగపడిలో సిఫారసు లేఖలపై విక్రయించే లడ్డూ, వడ, పెద్ద లడ్డూ, పెద్దవడ ధరలనూ పెంచారు.
*ప్రసాదంతో వ్యాపారమా…
భక్తులు ఇచ్చే కానుకలతో పోల్చితే లడ్డూలతో వచ్చే నష్టం టీటీడీకి ఒక లెక్కలోకే రాదు. ప్రసాదాన్ని కూడా వ్యాపార ధోరణితో చూడటమే అసలు సమస్య అని భక్తులు చెబుతున్నారు. కోటా విధించవచ్చుకానీ, అసలు రాయితీ లడ్డూలనే తీసేయడం సరికాదంటున్నారు.