Business

జియో దెబ్బకు ఇండియా వదిలి పారిపోతున్న వోడాఫోన్

Vodafone To Quit Indian Market-Telugu Business News Today

భారత్‌కు వొడాఫోన్ గుడ్‌బై చెప్పనుందా?.. ఇక్కడ మనుగడ సాగించలేమన్న భావన ఈ బ్రిటన్ బహుళ టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజ సంస్థలో ఉన్నదా?.. వొడాఫోన్ ఇండియా సీఈవో నిక్ రీడ్ తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి మరి. భారత్‌లో మా భవిష్యత్తుపై అనుమానమేనని మంగళవారం నిక్ రీడ్ అన్నారు. అధిక పన్నులు, చార్జీల భారాన్ని ప్రభుత్వం ఆపకపోతే కొనసాగలేమని ప్రకటించారు. లైసెన్స్ ఫీజులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. గతేడాది ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా కలిసిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వొడాఫోన్-ఐడియాగా కార్యకలాపాలను సాగిస్తున్న సంగతీ విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్) ఆర్థిక ఫలితాలను రీడ్ వెల్లడించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈసారి వొడాఫోన్ ఇండియా నిర్వహణ నష్టం 692 మిలియన్ యూరోలకు పెరిగిందని, నిరుడు ఇదే వ్యవధిలో సంస్థ నష్టం 133 మిలియన్ యూరోలుగానే ఉందని గుర్తుచేశారు. అయితే విలీనం నేపథ్యంలో భారత టెలికం పరిశ్రమకు వ్యతిరేకంగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో గ్రూప్ నష్టం 1.9 బిలియన్ యూరోలకు చేరిందన్నారు. లైసెన్స్, ఇతర రెగ్యులేటరీ ఫీజుల గణనపై టెలికం ఆపరేటర్లతో ఉన్న వివాదంలో టెలికం శాఖకు అనుకూలంగా సుప్రీం తీర్పు చెప్పింది. జరిమానా, వడ్డీతో కలిపి స్పెక్ట్రం యూసేజ్ చార్జీ, లైసెన్స్ ఫీజు బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. ఫలితంగా టెలికం పరిశ్రమపై రూ.1.4 లక్షల కోట్ల భారం పడింది. వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలే ఎక్కువగా ప్రభావితమైయ్యాయి. జియో స్వల్ప మొత్తంలో చెల్లించాల్సి వస్తున్నది.

దేశీయ టెలికం పరిశ్రమ కష్టాలకు ధరల యుద్ధం కూడా ఓ కారణమేనన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తున్నది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రాకతో ధరల యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. 4జీ సేవలతో సంచలన ఎంట్రీ ఇచ్చిన జియో.. భారతీయ టెలికం రంగ ముఖచిత్రాన్నే మార్చేసిందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఉచిత సేవలతో పరిచయమైన జియో.. వినియోగదారులకు చౌక ఇంటర్నెట్‌ను అందించడంలో విజయం సాధించింది. దీంతో అప్పటిదాకా ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలు సైతం ఇంటర్నెట్ ప్యాకేజీల ధరలను తగ్గించగా, వాయిస్ కాల్స్, మెసేజ్‌లను ఫ్రీగా ఇచ్చేస్తున్నారంతా. దీనివల్ల ఆయా సంస్థల లాభాలు ఆవిరైపోగా, నష్టాల్లోకి జారుకున్నాయి. ఫలితంగా టెలికం పరిశ్రమను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో జియో వర్సెస్ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాగా పరిశ్రమ చీలిపోవడం కూడా జరిగింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కేంద్రం సాయం చేయాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ విజ్ఞప్తి చేస్తుండగా, జియో మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నది. ఆ సంస్థల వద్ద నగదుకు కొదువ లేదని, అయినా రెండు సంస్థల ఆధారంగా మొత్తం దేశీయ టెలికం పరిశ్రమే ఇబ్బందుల్లో ఉందన్న అభిప్రాయానికి రావద్దని టెలికం శాఖకు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.

భారతీయ టెలికం పరిశ్రమలో సంస్థల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 15 సంస్థల వరకు ఉంటే, ఇప్పుడు నాలుగింటికి పడిపోయింది. రుణ భారం, పెరిగిన పోటీ, రిలయన్స్ జియో రాక వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా సంస్థలు ఇతర సంస్థల్లోకి విలీనమైపోయాయని చెబుతున్నారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, హచ్, టాటా టెలీకమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (అనిల్ అంబానీ సంస్థ), ఎయిర్‌సెల్, టెలినార్, వీడియోకాన్, సిస్టెమా శ్యామ్, డొకొమో, జియో తదితర సంస్థలుండేవి. ప్రస్తుతం వీటిలో ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, జియో, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉన్నాయి. చాలావరకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థల్లోనే విలీనమైపోగా, బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఎంటీఎన్‌ఎల్ కలిసిపోతున్నది తెలిసిందే. ఇప్పుడు వొడాఫోన్ సైతం భారత్‌కు గుడ్‌బై చెబితే దేశీయ టెలికం సంస్థల సంఖ్య మరింతగా పడిపోనున్నది. దీనివల్ల ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య కూడా ఏర్పడుతుందన్న ఆందోళన మెజారిటీ నిపుణుల నుంచి కనిపిస్తున్నది.

వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ జాయింట్ వెంచర్ బ్రతకాలంటే ప్రభుత్వ సాయం అవసరమని రీడ్ అన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం చెల్లింపులు కాకుండా, తమకు ఊరట కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే దేశీయ టెలికం పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, విధానపరంగానూ మద్దతు లేదని, ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు తమకు శరాఘాతమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా, జియోకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీతో ఢీకొట్టే విధంగా రెగ్యులేటరీ విధానాలు లేకపోతే భారత్‌లో పెద్దగా పెట్టుబడులు పెట్టే యోచన కూడా లేదని రీడ్ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోతే వొడాఫోన్ మనుగడ సాగించగలదా? అన్న ప్రశ్నకు రీడ్ బదులిస్తూ భారత్‌లో చాలాకాలం నుంచే సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి అని రీడ్ అనడం గమనార్హం.