Kids

పసుపు-సున్నం: తెలుగు చిన్నారుల కథ

Turmeric And Caustic Lime Friendship-Telugu Kids Moral Stories

ఒకసారి ఒక పసుపుముద్దకు తన రంగంటే అసహ్యం వేసింది. “ఏంటి, ఈ రంగు? ఎప్పుడూ పచ్చగానేనా? తను ఎంచక్కా వేరే రంగుకు మారిపోతే ఎంతబాగుండును?” అనుకున్నదది. కానీ అలాంటి అవకాశమే కనబడలేదు. మంచి రంగులు ఏవి కనబడ్డా వాటిని తెచ్చి తనపైన పూసుకునేదది. అయితే అవన్నీ రాలిపోయేవి, కారిపోయేవి తప్ప – నిలిచేవి కావు.

అప్పుడు అది దేవుని దగ్గరకు బయల్దేరింది – తన రంగు మార్చమని వేడుకునేందుకు.
వెళ్తూంటే, దారిలో దానికో సున్నపుముద్ద ఎదురైంది. “ఏంటమ్మా పసుపూ, ఎటు? బయలుదేరావు?” అన్నది సున్నం, పసుపు హడావిడిని చూసి.
“దేవుడి దగ్గరికి వెళ్తున్నానమ్మా, నా రంగు మార్చేయమని అడిగేందుకు. నాకు ఈ రంగు నచ్చలేదు” అన్నది పసుపు.

“అవునా, అయితే నేనూ వస్తాను నీ వెంట. నాకూ ఈ రంగు నచ్చలేదు. మార్చమని అడుగుతాను నేనున్నూ!” అని సున్నం పసుపు వెంట బయలుదేరింది.

మధ్యదారిలో చాలా చోట్ల అవి రెండూ ఒకదానికొకటి సాయం చేసుకున్నాయి. కొన్నిచోట్ల సున్నం పసుపుచేయి పట్టుకొని పైకిలాగింది. కొన్ని చోట్ల పసుపు సున్నాన్ని కాపాడింది. రెండూ‌గమనించలేదు – రెండింటి చేతులూ ఎర్రగా మెరవటం‌మొదలెట్టాయి.
అయితే అవి రెండూ ఇంకా దేవుడి దగ్గరికి చేరకనే పెద్ద వాన మొదలైంది! తలదాచుకునే చోటులేదు – పసుపుముద్ద ఆ వానకు తట్టుకోలేక పగిలిపోతున్నది. తోటిదాన్ని కాపాడదామని, సున్నం తన చొక్కాలోనే పసుపును దాచుకొని కాపాడింది. బయటికి వచ్చిన తర్వాత చూస్తే, పసుపు, సున్నం రెండూ‌ఎర్రబారాయి పూర్తీగా!

ఒక్కసారి అవిరెండూ ఒకరిముఖాన్నొకటి చూసుకుని, సంతోషంగా నవ్వాయి. ఆపైన, ఏదో అర్థమైనట్లు, వెనక్కి తిరిగి ఇంటిదారి పట్టాయి – తమ రంగులు మారే మార్గం చూపిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ.