Devotional

నిజమైన సుఖం అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది?

What is the real meaning of happiness in Hindu tradition?

ప్రపంచంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఎవరూ కష్టాలు కావాలని కోరుకోరు. చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అదే జీవితపరమావధి అని అపోహలో పడి జీవిస్తున్నారు. నిజానికి, శాంతిలేనిదే సుఖం లభించదు. లేనిపోని అనవసరపు ఆలోచనలు, విషయ లంపటాలపై ఆసక్తి… ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది.దృశ్య పదార్థాలతో, విషయ భోగాలతో లభించే సుఖం నిజమైన సుఖం కానేరదని గీతాచార్యులు చెబుతున్నారు. అది ప్రతిబింబ సుఖం, క్షణిక సుఖం, దుఃఖమిశ్రిత సుఖం. ఇది కాదు మనిషికి కావలసింది. అవిచ్ఛిన్న, పరిపూర్ణ నిరతిశయ సుఖం. అది కావాలంటే చిత్తంలో శాంతి ఏర్పడాలి.నశ్యర, అంటే నాశనమయ్యే ప్రాపంచిక పదార్థాల గురించి చింతించినందువల్ల శాంతి లభించదు. శాశ్వతమైన ఆత్మ గురించి, దైవం గురించి చింతించడం వల్ల, ధ్యానించడం వల్ల చిత్తంలో శాంతి నెలకొంటుంది. మనోనైర్మల్య స్థితితోనే ఆత్మచింతన, వివేకం ఉదయిస్తాయి. చిత్తం విషయాలవైపు పరుగులు తీయక, దృశ్య వాసనలు లేనప్పుడే బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉండి, మనస్సంయమనం కలిగితే బుద్ధి పరిశుద్ధమవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే దుఃఖరాహిత్యం, ఆనంద ప్రాప్తి కలుగుతాయి.పూర్వకాలంలో నగరానికి ద్వారాలుండేవి. ఆ నగరంలో రాజు ఉండేవాడు. ద్వారాలు సురక్షితంగా ఉన్నప్పుడే రాజు సుఖంగా ఉండగలడు. గీతాచార్యులు మానవ శరీరాన్ని పురంతో పోల్చాడు. ఆ పురానికి తొమ్మిది ద్వారాలున్నాయి. అవి కంటి ద్వారాలు 2, చెవి ద్వారాలు 2, ముక్కు ద్వారాలు 2, నోటి ద్వారం 1, మూత్రద్వారం 1, మల ద్వారం 1. స్పర్శ ద్వారం శరీరమంతటా వ్యాపించి ఉంటుంది.ఆత్మలో నిలకడ కలగాలంటే శబ్దాది విషయాల నుంచి మనసు మరలాలి. బాహ్యవిషయాల పట్ల ఆసక్తిలేని మనసు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వం పొంది అక్షయ సుఖం పొందుతుంది. అక్షయ సుఖమంటే ఎప్పటికీ నిలిచేది. అటువంటి సుఖం తన ఆత్మలోనే ఉందని గ్రహించక విషయాదులందు లభించే సుఖం కోసం మనిషి అర్రులుచాస్తాడు. కాని ఇది అశాశ్వతమైనది. పైగా దుఃఖభూయిష్ఠమైనది. అది ప్రతిబింబ సుఖం. బింబభూతమైన సుఖం ఆత్మయందే నిక్షిప్తమై ఉంది. ఆత్మ సుఖమే వస్తువులయందు ప్రతిబింబించి విషయ సుఖంగా వ్యక్తమవుతుంది. ఆత్మ సుఖం అనుభవించాలంటే విషయ సుఖాన్ని త్యాగం చేయడం తప్పనిసరి!విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం నిజమైన సుఖంకాదు. పైకి కాస్త సుఖంగా తోచినా లోపల అపారదుఃఖం నిండిఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు దీన్ని ‘దుఃఖయోని’ అన్నారు. విజ్ఞులు దాన్ని కోరుకోరు. విషయాలను అనుభవించేవాడు అందులో నిబిడీకృతమై ఉన్న దుఃఖాన్నీ అనుభవించడానికి సంసిద్ధమై ఉండాలి. దృశ్య సౌఖ్యంలో రెండు దోషాలున్నాయి. పైకి సుఖంగా కనిపించినా లోపల దుఃఖం దాగిఉంటుంది. ఆద్యంతాలు అందువల్ల క్షణికాలై వర్తించడం, అంటే- దుఃఖ జనకత్వం, క్షణికత్వం అను రెండు ప్రబల దోషాలు విషయభోగాలతో ఉన్నాయి. కాని, ఆత్మసుఖం అలా కాదు. దీనితో దుఃఖం ఇసుమంతైనా ఉండదు. అతిచిన్న సుఖమది. శాశ్వతమైనది.సుఖాన్ని కోరుకునేవారు ముందుగా తనలోఉన్న ముఖ్యమైన శత్రువులైన కామక్రోధాలను జయించాలి. అరిషడ్వర్గాల్లో కామక్రోధాలు ముఖ్యమైనవి. అజ్ఞానాంధకారంతో కొట్టుమిట్టాడుతున్నవారు దీన్ని కొట్టిపారేసి ఎండమావిలో నీటికోసం వెదుకుతుంటారు. దుఃఖంలోకి దించే పైకి కనిపించే సుఖాలనే నిజమని నమ్మి వాటికొరకు పరితపించడం విచారకరం. ఆత్మసుఖాన్ని కోరేవారు తమ శక్తినంతటినీ అంతర్ముఖంగా మళ్లించి ధన్యులవుతారు!
2. లడ్డూ ధరలు పెంచే యోచన లేదు: తితిదే ఛైర్మన్
ఇప్పట్లో శ్రీవారి లడ్డూల ధరలు పెంచే ఆలోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చెన్నైలోని తితిదే స్థానిక సలహా మండలి నూతన ఉపాధ్యక్షులు, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆదివారం చెన్నైలోని శ్రీవారి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో లడ్డూ ధరలకు సంబంధించి చర్చించిన విషయం వాస్తవమేనని, పెంచే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు. సాధారణ భక్తులు తీసుకొనే అద్దె గదుల రుసుములనూ పెంచడం లేదన్నారు.
3. మూడో కార్తీక సోమవారం.. శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
మూడో కార్తీక సోమవారం కావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి భక్తులో కిక్కిరిసింది. తెల్లవారుజామున రత్నగరిపై కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రద్దీ దృష్ట్యా రెండు గంటల నుంచి వ్రతాలు ప్రారంభించి మూడు గంటల నుంచి సర్వదర్శనాలను భక్తులకు అధికారులు కల్పించారు. మరోవైపు పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్యామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. పాదయ పుష్కరణిలో స్నానం చేసి.. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ద్రాక్షారమంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర సామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే సప్తగోదావరిలో సాన్నం చేసి.. భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని భద్రాచలంలో కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
4. శుభమస్తు
తేది : 18, నవంబర్ 2019
సంవరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(నిన్న రాత్రి 6 గం॥ 21 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 6 ని॥ వరకు)
క్షత్రం : పుష్యమి
(నిన్న రాత్రి 10 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 19 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 38 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 22 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : కర్కాటకము
5. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 18 పుష్ బటన్ టెలీఫోన్
భారత సరిహద్దు సైన్య దినోత్సవం.
1493 : క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట పొర్తొరీకో దీవిని కనుగొన్నాడు.
1901 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు వి. శాంతారాం జననం (మ.1990).
1945 : శ్రీలంక ఆరవ అధ్యక్షుడు మహీంద రాజపక్స జననం.
1962 : హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్‌ బోర్ మరణం (జ.1885).
1963 : మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
1972 : భారత జాతీయ జంతువు గా పెద్దపులి ని స్వీకరించారు.
1982 : పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు మరణం (జ.1904).
6. కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
18.11.2019 వతేది, సోమవారము ఆలయ సమాచారం శ్రీ స్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికాల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండును అనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…దేవస్థానమునకు అనుభంద ఆలయమైన శ్రీఉమమాహేశ్వర స్వామి (శివాలయము)లో పరమేశ్వరుడుకి రుద్రబిషేకము, బిల్వ అర్చన, నవగ్ర పుజా కార్యక్రమమును ఉదయము 7.30 గంటలనుండి ప్రారంభమగును అభిషేక సేవా అనంతరము శ్రీస్వామి వారి దర్శనము ఉ.10.00 గంటల నుండి మధ్యహ్న 12.00 గంటల వరకు వుండును రెండవ మహాగంట నివేదనమ.12.30 నుండి 1.00 లోపు, బాలబోగ్యం త్రికాల నైవేద్యాము సమర్పణమ 1.00 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికాల నైవేద్యాదులు సమర్పణ మహ మంగళ హారతి, పరివార దేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
ఆర్జిత సేవాల వివరములు
18.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్ : 32
18.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 6
18.11.2019 వ తేదిన శ్రీవారి నిత్యఅన్నదాన పథకము నకు భక్తులు విరాళముగా: 32,500/- సమర్పించియున్నారు
18.11.2019 వ తేదిన శ్రీవారి నిత్య అన్నదాన పథకము నందు అన్నప్రసాదము స్వీకరించిన భక్తుల సంఖ్య: 680 మంది స్వీకరించినారు
7. రాశిఫలం – 18/11/2019
తిథి:
బహుళ షష్టి మ.3.18, కలియుగం-5121 శాలివాహన శకం-1941
నక్షత్రం:
పుష్యమి రా.9.21
వర్జ్యం:
శేష వర్జ్యం: ఉ.7.32 వరకు
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఋణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండవు. మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు. ఇతరులకు అపకారం చేయకూడదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
8. పవిత్రమైన కార్తీకమాసంలో మూడవ సోమవారం కావడంతో, నేడు ప్రజలంతా సముద్రం, నదుల్లో పుణ్యస్నానాలు చేసేందుకు క్యూ కట్టారు. ఏపీలోని బీచ్ లన్నీ తెల్లవారుజామునే భక్తులతో నిండిపోయాయి. గోదావరి, కృష్ణా తీరాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి పుష్కర ఘాట్, కోటి లింగాల రేవు, బాసర, ధర్మపురి వంటి క్షేత్లాల్లో కిక్కిరిసిన భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీకాళహస్తిలోనూ వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. పంచారామాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో అర్ధరాత్రి నుంచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. సర్వదర్శనానికి 2 గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతోంది. గోదావరి రేవుల వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు తిరుపతిలోని కపిలేశ్వరుని ఆలయం వద్ద ఉండే కపిల తీర్థం కోనేటి వద్ద రద్దీ అధికంగా ఉంది. తిరుమలలోనూ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 81,872 మంది దర్శించుకున్నారని, 29,582 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లని అధికారులు తెలిపారు.
9. భక్తులతో కిటకిటలాడుతున్న నవనంది క్షేత్రాలు
కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా నవనంది పుణ్యక్షేత్రాలను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలోని ప్రథమనంది, నాగనంది, సోమనంది, శివనంది, కృష్ణానంది, మహానంది, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రతీ సోమవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు భక్తులు కాలినడకన ఈ క్షేత్రాలన్నింటినీ దర్శించుకుంటారు. మహానందిలో భక్తులు శ్రీకామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వార్లకు సామూహిక అభిషేకాలు, అర్చనలు చేశారు. బుక్కాపురంలోని అవధూత కాశిరెడ్డినాయన ఆశ్రమంలో ప్రత్యేక అభిషేకార్చనలు, అన్నపూర్ణేశ్వరికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
10. శివ నామస్మరణతో మార్మోగిన శ్రీముఖలింగం
ప్రముఖ శివ శైవక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సుమారు కిలోమీటరు మేర బారులు తీరి స్వామి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్నారు. శ్రీముఖలింగేశ్వరస్వామితో పాటు అష్ట గణపతులు, వారాహి అమ్మవారు, భీమేశ్వర, సోమేశ్వర ఆలయాలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన షామియానాలు సరిపడా లేకపోవడంతో మండే ఎండలోనే భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. పర్యవేక్షకుడు ప్రసాద్‌బాబు, ఈవో ఎన్‌.వి.రమణయ్య దగ్గరుండి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. జలుమూరు ఎస్సై వై.కృష్ణ ఆధ్వర్యంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.