WorldWonders

ఆగ్రా పేరు మార్చేందుకు యోగి పావులు

Yogi Government Moving Coins To Change The Name Of Agra

అలహాబాద్, ఫైజాబాద్, చరిత్రాత్మక ముఘల్ సరాయ్ నగరాల పేర్లను మార్చిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రా పేరును కూడా మార్చే యోచనలో ఉంది. ఆగ్రాకు కొత్త పేరును సూచించాల్సిందిగా కోరుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డాక్టర్ భీంరావు అంబేడ్కర్ యూనివర్సిటీకి లేఖ కూడా రాసింది. ఆగ్రాకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లను లోతుగా పరిశీలించవలసిందిగా కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమకు లేఖ రాసినట్లు అంబేడ్కర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ నిర్ధారించారు.అయితే ఆగ్రా పేరు మార్పుకు సంబంధించిన వదంతులపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. ఆగ్రా నగరానికి మరే ఇతర పేరైనా ఉండేదా అన్న విషయమై చారిత్రక ఆధారాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో కోరిందని ఆయన చెప్పారు. దీనిపై పరిశోధన ప్రారంభించామని, త్వరలో లేఖకు జవాబు ఇస్తామని ఆయన చెప్పారు. ఒకప్పుడు ఆగ్రాకు ఆ ప్రాంతాన్ని పాలించిన అగ్రసేన్ మహారాజు పేరిట అగ్రవన్ అనే పేరుండేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆగ్రవన్ పేరు ఆగ్రాగా ఎలా మారిందో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చింది. తాజాగా గత ఆగస్టులో వారణాసి సమీపంలోని ముఘల్‌సరాయ్ జంక్షన్‌ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ(డిడియు) స్టేషన్‌గా మార్చింది. 2015 ఢిల్లీలోని ఔరంగాజేబ్ రోడ్ పేరును ఎపిజె అబ్దుల్ కలామ్ రోడ్డుగా మార్చడం గమనార్హం.