Politics

ఏపీలో నూతన మద్యపాన విధానం

New Liquor Policy In Andhra-Telugu Politics

* జనవరి 1 నుండి నూతన మద్యం విధానం
* త్వరలో బార్ల లైసెన్స్ ఫీజు పెంపు
* నాటుసారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం
* స్టార్ హోటళ్లు మినహా మిగతా బార్ల సంఖ్యను 40% తగ్గించాలని నిర్ణయం
* దశలవారీ మద్యపాన నిషేధానికి అన్ని పక్షాలు సహకరించాలి:ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి

రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నూతన మద్యం విధానం అమలుపై సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ఐదు దశల్లో మద్యపాన నిషేధాన్ని పకడ్భందీగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. ప్రజాసంకల్పయాత్ర సమయంలో మద్యపానం వల్ల రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులను మహిళలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చిన సందర్భాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలుకు కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 839 బార్లు, 38 త్రీస్టార్ హోటళ్లు, 4 మైక్రో బ్రూవరీస్ షాపులు నడుస్తున్నాయని మంత్రి వెల్లడించారు. మొదటగా 50 శాతం మేర బార్ షాపుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పటికీ అధికారుల సూచన మేరకు వాటిలో తొలివిడతగా స్టార్ హోటళ్లు, బీర్ షాపులు మినహా మిగతా బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటికే 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామని, విడతల వారీగా మిగతా వాటిని కూడా తగ్గించాలని సమీక్షలో నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. బార్ల అనుమతులకు సంబంధించి లైసెన్స్ ఫీజును నిర్ణయించి దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ పద్ధతిని అవలంభించడం జరుగుతుందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.

బార్లలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అనుమతులు పొందిన బార్ల యజమానులు అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే వారి నుంచి 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అదే విధంగా నాటుసారా, కల్తీ మద్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందన్నారు. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు విధిస్తామన్నారు. నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా సంస్థలతో ప్రత్యేక పర్యవేక్షణ నిరంతరం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రం సరిహద్దుల్లో నలువైపులా చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాను అరికడతామన్నారు. అలాగే నూతన మద్యం పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ….మద్యపాన నిషేధం పై విపక్షాల వైఖరి ఏంటో తెలపాలని కోరారు. మద్యం అమ్మకాలు జరపాలా వద్దా ? మద్యనిషేధానికి అనుకూలమా, వ్యతిరేకమా తెలపాలని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.

బార్లలో మద్యం సరఫరా వేళల కుదించామని, మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ మాత్రమే జరపాలని మంత్రి వెల్లడించారు. రాత్రి 10 గంటల తర్వాత బార్లలో గంటసేపు ఆహారపదార్థాలు విక్రయాలు జరుపుకునే సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని తెలిపారు. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రకటించారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని సమీక్షలో సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసే వ్యక్తులకు బార్లు లేవా? అని నిలదీశారు. ప్రస్తుతమున్న బార్లలో ఆధిక శాతం గత ప్రభుత్వ నేతలవే అని గుర్తుచేశారు. కొందరు మతిస్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మద్యనిషేధానికి అనుకూలమైతే ఐదేళ్ల పాటు మద్యం షాపులకు అనుమతులు ఎలా ఇచ్చిందని నిలదీశారు. మద్య విధానం కఠినతరంగా అమలు చేయాలా వద్దా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇసుక, మద్యపానం, ఆంగ్ల విద్య, ధరల పెరుగుదల వంటి అంశాలను బూచిగా చూపి తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.

తమ ప్రభుత్వం దశల వారీ మధ్య నిషేదానికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యనిషేధం కోసం చేసిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యనిషేధం అమలుకు శ్రీకారం చుట్టారని ఆ ఆశయం నెరవేరాలంటే అన్ని పక్షాలు సహకరించాలని మంత్రి కోరారు.