DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-11/20

Telugu News Roundup-Nov 20 2019

1.యానిమేషన్‌, గేమింగ్‌కు చిరునామాగా తెలంగాణ: కేటీఆర్‌గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతిపెద్ద ఈవెంట్‌కు హైదరాబాద్‌ వేదికైంది. హెచ్ఐసీసీలో ‘ఇండియా జాయ్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నటి నమ్రత, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచస్థాయి స్టూడియోలు హైదరాబాద్‌ నగరంలో ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ చక్కని వేదికగా మారింది. వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, యానిమేషన్‌ రంగంలో కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతోంది. యానిమేషన్ వచ్చిన తర్వాత మూవీ మేకింగ్ మరో స్థాయికి చేరింది’’ అని అన్నారు.
2. రామానాయుడు స్టూడియోలో ఐటీ తనిఖీలు
నగరంలోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో ఈ ఉదయం ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. స్టూడియోతోపాటు నిర్మాత సురేశ్‌బాబు నివాసంలో, కార్యాలయంలో ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. సురేశ్‌ ప్రొడక్షన్‌ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల కాలానికి చెందిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
3. చిదంబరం బెయిల్‌పై ఈడీకి నోటీసులు
ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. చిదంబరం బెయిల్‌ దరఖాస్తుపై స్పందన తెలియజేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 26కు వాయిదా వేసింది. ఐఎన్ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.
4. ప్రధాని మోదీని పవార్‌ కలిస్తే తప్పేంటి?
నేషనలిస్ట్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల భేటీ జరగనున్న నేపథ్యంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలు కలిస్తే ఎలా పడితే అలా ఊహించేస్తారా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాన మంత్రి దేశమొత్తానికీ చెందిన వ్యక్తి. మహారాష్ట్రలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పవార్‌జీ, ఉద్ధవ్‌జీ ఇద్దరూ రైతుల గురించే ఆలోచిస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు భేటీ అయితే కిచిడీ వండేస్తారా? ప్రధాన మంత్రిని పార్లమెంటు లోపలా, బయటా ఎక్కడైనా కలవచ్చు’ అని చెప్పారు.
5. ఇందిరాగాంధీ పుట్టిన ఇంటికి ట్యాక్స్‌ నోటీసులు
ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ‘ఆనంద్‌భవన్‌’కు ఇంటిపన్ను నోటీసులు అందాయి. రూ.4.35 కోట్ల మేరకు పన్ను బకాయి ఉన్నారన్నది ఈ నోటీసుల సారాంశం. ఈ ఇంటిని నివాసం లేని భవనాల కేటగిరిలో చేర్చారు. 2013 నుంచి ‘ఆనంద భవన్‌’కు పన్ను కట్టలేదని అధికారులు వివరించారు. ఈ భవనం ఇందిరా గాంధీ కుటుంబానికి చెందినది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్‌లాల్‌ నెహ్రూ ట్రస్ట్‌ దీని బాగోగులు చూసుకుంటోంది.
6. సెన్సెక్స్‌.. కొత్త శిఖరాల్లో
టెలికాం, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు రికార్డు స్థాయి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఉన్న సెన్సెక్స్‌ ఒక దశలో 347 పాయింట్ల లాభంతో 40,816 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు నిఫ్టీ కూడా 12వేల మార్క్‌ దాటి ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 11.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 268 పాయిట్ల లాభంతో 40,737 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 12,014 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.69గా ట్రేడ్ అవుతోంది.
7. రిఫ్రిజిరేటడ్‌ కంటైనర్‌లో 25 మంది..
కొద్ది రోజుల క్రితం బ్రిటన్‌లో ఓ రిఫ్రిజిరేటేడ్‌ కంటెనర్‌ ట్రక్కులో 39 మృతదేహలు బయటపడిన ఘటన మరువక ముందే అటువంటిదే మరోకటి నెదర్లాండ్‌లో వెలుగు చూసింది. అక్కడి అత్యవసర విభాగం అధికారుల కథనం ప్రకారం.. నెదర్లాండ్‌ నుంచి బ్రిటన్‌కు వెళ్తున్న ఒక నౌకలో రిఫ్రిజిరేటేడ్‌ కంటెనైర్‌లో 25 మంది అక్రమ వలసదారులను అధికారులు గుర్తించారు. ఫెలిక్స్టోవ్‌కు బయల్దేరిన కార్గో నౌకను రోటర్‌డ్యామ్‌ సమీపంలోని వ్లార్డింగెన్‌ ఓడరేవుకు తీసుకుని వచ్చారు. కంటైనర్‌లో గుర్తించిన వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
8. జపాన్‌ ప్రధాని అరుదైన ఘనత
జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అరుదైన ఘనత సాధించారు. ఆ దేశాన్ని సుదీర్ఘకాలం నుంచి పాలిస్తున్న నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రధానిగా అబే 2,886 రోజులు పూర్తిచేసుకున్నారు. బుధవారం ఆయనకు 2,887వ రోజు. గతంలో టారో కస్తురా సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా నిలవగా.. ఆ రికార్డును అబే నేటితో అధిగమించారు. టారో కస్తురా 1901 నుంచి 1913 మధ్య మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించారు. షింజో అబే 2006లో తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
9. ఇంగ్లీష్ మీడియంపై రాజకీయాలు తగవు: మంత్రి అవంతి
అక్షరాస్యతలో ఏపీని నెంబర్ వన్ చేస్తామని.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
విద్యకు, ఉపాధికి అధిక ప్రాధాన్యతను ఇస్తామని.. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అవసరమని స్పష్టం చేశారు. వారు ఇంగ్లీష్ నేర్చుకుంటే మరింత ఉన్నతంగా రాణిస్తారన్నారు. ఇంగ్లీష్ మీడియంను మంచి ఉద్దేశంతో ప్రవేశ పెడుతున్నామని..దీనిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పేదవాడు అమెరికా వెళ్లాలంటే ఇంగ్లీష్ అవసరమన్నారు. ఐటీ ఉద్యోగాలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని.. అందుకే పేదలను దృష్టిలో పెట్టుకొని జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని అవంతి స్పష్టం చేశారు.
10. గూగుల్‌ పోటీలో వాయుసేన
వీడియోగేమ్‌భారత వాయుసేనకు చెందిన వీడియోగేమ్‌ ‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌: ఏ కట్‌ ఎబౌ’ ప్రతిష్ఠాత్మక గూగుల్‌ ఉత్తమ గేమ్స్‌ పోటీకి ఎంపికైంది. 2019 సంవత్సరానికి గానూ ‘బెస్ట్‌ గేమ్‌’ పోటీలో యూజర్స్‌ ఛాయిస్‌ గేమ్‌ కేటగిరీలో ఐఏఎఫ్‌ వీడియో గేమ్‌ను గూగుల్‌ ఎంపికచేసింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో భారత వాయుసేన వెల్లడించింది. ఐఏఎఫ్‌ మొబైల్‌ వీడియో గేమ్‌కు ఓట్‌ వేయాలని కోరింది.