Business

ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొస్తే రోటీ ఇస్తాడు

Haryana Hisar Govt Gives Free Roti And Curry If You Bring Plastic Bottles-Roti For Plastic In Haryana Hisar

దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై పోరాటం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పెద్ద పోరాటమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణ రాష్ట్రంలోని హిసార్‌ జిల్లా కూడా ప్లాస్టిక్‌ మహమ్మారిని నియంత్రించేందుకు వినూత్నమైన కార్యక్రమాన్ని తలపెట్టింది. 20 ప్లాస్టిక్‌ బాటిళ్లు తీసుకొస్తే తినుబండారాలను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హిసార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ స్థానికంగా ఉన్న రెండు దాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి జనతా భోజనాలయ, హౌండా రామ్‌ దాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్టిక్‌ రహిత వాతావరణమే కాకుండా అన్నార్తులను ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతోందని సదరు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. దీనిపై సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రామ్‌జీలాల్‌ మాట్లాడుతూ..‘చెత్త ఏరుకునే వారి ఆకలిని తీర్చడంతో పాటు ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న ప్లాస్టిక్‌ను ఒక చోటుకు చేర్చి వాటిని మళ్లీ ఉపయోగిస్తున్నాం. రోడ్లు వేయడం వంటి పనులకు వాడుతున్నాం. 20 ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లను తీసుకొచ్చిన వారికి దాల్‌, రోటీతో పాటు ఏదైనా సలాడ్‌ ఇస్తున్నాం. దీని వల్ల వారి ఆకలి తీరుతుంది. ప్లాస్టిక్‌ కంట్రోల్‌లో ఉంటుంది’ అని చెప్పారు. వీరు అనుసరిస్తున్న వినూత్న పద్ధతికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.