WorldWonders

పాతబస్తీ కుర్రాళ్ల అతి తెలివి-సిమ్‌కార్డుల ఘరానా మోసం

Hyderabad Old City Youth Manipulating International Calls As Local Calls

పాతబస్తీ ఇస్మాయిల్‌నగర్‌లో అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చే కేంద్రం గుట్టు రట్టు చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో బుధవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితోపాటు సిమ్‌కార్డుల సరఫరా చేసే మధ్యవర్తి పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు రిమాండుకు తరలించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడి మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ భార్య రెష్మాసుల్తానా, కామారెడ్డి జిల్లా పల్కంపేటలో కిరాణాషాపు నిర్వహిస్తున్న సోదరులు మహ్మద్‌ వాహెద్‌పాషా అలియాస్‌ అక్బర్‌, మహ్మద్‌ అహ్మద్‌ పాషా, సిమ్‌కార్డుల పంపిణీదారు మహ్మద్‌ అబ్దుల్‌ నవీద్‌(33) ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌, సిమ్‌కార్డులు సమకూర్చడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన జాఫర్‌ పరారీలో ఉన్నారని చాంద్రాయణగుట్ట డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ వర్మ తెలిపారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే మరికొందరి పాత్ర బయటపడే అవకాశం ఉంది. కేసు వివరాలను చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్‌, డీఐ కె.ఎన్‌.ప్రసాద్‌ వర్మ, ఎస్సై ఎం.కొండలరావులతో కలిసి ఫలక్‌నుమా డివిజన్‌ ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ వెల్లడించారు. నిందితుల నుంచి 300 సిమ్‌కార్డులు, 20 సిమ్‌ బాక్సులు, వైఫై రూటర్లు, యూపీఎస్‌, ఇతర సామగ్రి, చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ తెలిపారు.

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలోని బండ్లగూడ ఇస్మాయిల్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చే కేంద్రానికి అవసరమైన సిమ్‌కార్డులు కామారెడ్డి జిల్లా పల్కంపేటలోని ఓ కిరాణా దుకాణం నుంచి పెద్దఎత్తున సరఫరా అయినట్లు చాంద్రాయణగుట్ట పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని ఇస్మాయిల్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్య రెష్మాసుల్తానాతో కలిసి ఉంటున్నాడు. గతంలో అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చే అనుభవం ఉండడంతో అదే వ్యవస్థను తన ఇంటిలో ఏర్పాటు చేసుకున్నాడు. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా నుంచి సంపాదించాడు. ఈ అక్రమ వ్యవహారంలో సిమ్‌కార్డులు కీలకం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ మెదక్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నవీద్‌ను మూడేళ్ల క్రితం సంప్రదించాడు. అప్పట్లో నవీద్‌ రిలయన్స్‌ సిమ్‌కార్డులు అమ్మేవాడు. డబ్బు ఆశకు నవీద్‌ కొన్ని సిమ్‌లను ఇమ్రాన్‌కు విక్రయించాడు.

ఉద్యోగం వదిలేసిన తరువాత నవీద్‌ సిమ్‌కార్డులు ఇవ్వడం మానేశాడు. సిమ్‌కార్డుల అవసరం ఉండడంతో మళ్లీ ఇమ్రాన్‌ఖాన్‌ తనకు పరిచయం ఉన్న హైదరాబాద్‌ పాతనగర నివాసి (ఇతని చిరునామా ఇంకా పోలీసులకు తెలియలేదు) జాఫర్‌ను ఏడాదిన్నర క్రితం కలిశాడు. జాఫర్‌ పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా మళ్లీ నవీద్‌ను కలిసి సిమ్‌కార్డులు కావాలని అడిగాడు. డబ్బు లభిస్తుందనే ఆశతో నవీద్‌ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తాను ఉద్యోగం చేసిన సమయంలో పరిచయం ఉన్న సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ను సంప్రదించి సిమ్‌కార్డులు కావాలని చెప్పాడు. వారి ద్వారా కామారెడ్డి జిల్లా పల్కంపేటలో కిరాణా షాపు నిర్వహిస్తున్న మహ్మద్‌ వాహెద్‌పాషా అలియాస్‌ అక్బర్‌, మహ్మద్‌ అహ్మద్‌పాషా సోదరులను కలిశాడు. పాషా సోదరుల నుంచి నెలకు కొంత మొత్తంలో సిమ్‌కార్డులు సేకరించే నవీద్‌ పాతనగరానికి చెందిన జాఫర్‌ ద్వారా ఇమ్రాన్‌కు చేరవేసేవాడు.

కామారెడ్డి జిల్లా పల్కంపేటలో కిరాణా షాపుతోపాటు వివిధ నెట్‌వర్క్‌లకు చెందిన నూతన సిమ్‌కార్డులను విక్రయించే సోదరులు మహ్మద్‌ వాహెద్‌ పాషా, మహ్మద్‌ అహ్మద్‌ పాషా సిమ్‌కార్డుల అక్రమ వ్యాపారంలో భాగస్వాములయ్యారు. నెట్‌వర్క్‌ కంపెనీలు సిమ్‌కార్డుల అమ్మకంపై ఇచ్చే టార్గెట్‌ను చేరుకోలేక, ఆశించిన మొత్తంలో అమ్ముడు పోకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నవీద్‌ వీరిని కలిసి పెద్దమొత్తంలో సిమ్‌కార్డులు కావాలని చెప్పగానే అంగీకరించారు. సిమ్‌కార్డుల కోసం వచ్చే వినియోగదారుల నుంచి ధ్రువపత్రాలు తీసుకుని ఓటీపీ సహకారంతో సిమ్‌కార్డులు అందజేసేవారు. అవే ధ్రువపత్రాలను వినియోగించి వారి పేరు మీదే అక్రమంగా సిమ్‌కార్డులు తీసుకుని పోగుచేసేవారు. ఈ తరహాలో నెలకు 50 నుంచి 100 వరకు సిమ్‌కార్డులు సిద్ధం చేసి ఇవ్వగా.. నవీద్‌ అటునుంచి జాఫర్‌ ద్వారా పాతబస్తీలోని ఇమ్రాన్‌ఖాన్‌కు చేరేవి. ఈ తరహాలో 200లకు పైగా ఐడియా నెట్‌వర్క్‌ సిమ్‌కార్డులు సోదరుల నుంచి ఇమ్రాన్‌కు చేరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కాల్‌రూటింగ్‌ అక్రమ దందా చేస్తూ 2018 అక్టోబరులో రాజేంద్రనగర్‌ పోలీసులకు పట్టుబడి జైలు కెళ్లిన ఇమ్రాన్‌ఖాన్‌ తీరు మారలేదు. జైలు నుంచి వచ్చిన తరువాత అక్రమ డబ్బు సంపాదనే ధ్యేయంగా పాతబస్తీ ఇస్మాయిల్‌నగర్‌లో కాల్‌రూటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశాడు.

కొత్త సిమ్‌కార్డులు తీసుకోవడానికి డీలర్లను ఆశ్రయించే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫలక్‌నుమా డివిజన్‌ ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ సూచించారు. సిమ్‌ డీలర్లు ఒకటికి మించి ఓటీపీలను సృష్టించి అదనంగా సిమ్‌కార్డులను పొందే అవకాశం ఉందన్నారు. ధ్రువపత్రాలు ఇచ్చే సమయంలో ఓటీపీ జెనరేట్‌ అయ్యే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఏసీపీ సూచించారు.