Agriculture

డ్రాగన్ ఫ్రూట్ సాగులో దూసుకెళ్తున్న కృష్ణా జిల్లా మహిళా రైతు

డ్రాగన్ ఫ్రూట్ సాగులో దూసుకెళ్తున్న కృష్ణా జిల్లా మహిళా రైతు-Telugu Agricultural News-Anne Padmavati From Krishna District Farms Dragon Fruit

యాభై ఏళ్ల వయసులో హలం పట్టుకుని పొలం పనులకు కదిలిందామె. డ్రాగన్‌ ఫ్రూట్‌ని పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పంటతోపాటు స్వదేశీ ఫలాలను… సహజసిద్ధంగా పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అరుదైన పంటను పండిస్తోన్న రైతుల్లో ఒకరు కృష్ణా జిల్లాకు చెందిన అన్నె పద్మావతి. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న రైతు. మావారు… వ్యాపారం చేసేవారు. మాకు ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 2006లో మావారు చనిపోయారు. మాకున్న కాస్త పొలాన్ని పండ్ల మొక్కలు సాగు చేయడానికి ఇజ్రాయెల్‌ దేశ వ్యాపారులకు లీజుకు ఇవ్వాలనుకున్నాం. ఆ పొలంలో వాళ్లు దానిమ్మ పండించాలనుకున్నారు. దానికి వాతావరణం, పరిస్థితులు అనుకూలించలేదు. మిగతా ప్రాంతాల్లో వారు సాగు చేసిన పంట సత్ఫలితాలను ఇవ్వలేదని తెలిసింది. దాంతో నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. పొలాన్ని ఖాళీగా వదిలేయకుండా నేనే వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అందరిలా కాకుండా ఏదైనా ప్రత్యేకమైన పంట వేద్దామనుకున్నా. ఏడెనిమిదేళ్ల కిందట ఓసారి డ్రాగన్‌ఫ్రూట్‌ తిన్నా. దాని రుచి నచ్చి, పండించాలనుకున్నా. ఇంట్లోవాళ్లు మాత్రం ‘విశ్రాంతి తీసుకునే వయసులో ఇవన్నీ ఎందుకు… నువ్వు వ్యవసాయం చేయడం అవసరమా… నష్టాలొచ్చి అందరూ మానేస్తున్న దానిలోకి అడుగుపెట్టడం మంచిదికాదేమో…’ అంటూ నన్ను ఆపే ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా… నాలో వ్యవసాయం చేయాలనే పట్టుదల రోజురోజుకీ పెరిగింది. అలా కిందటేడాది దీని సాగుమొదలుపెట్టా.

పెట్టుబడి ఒకేసారి… డ్రాగన్‌ ఫ్రూట్‌కు సంబంధించిన వివరాలన్నీ సేకరించా. ఆ పంటను విదేశాల్లో ఎలా పండిస్తున్నారో తెలుసుకున్నా. ఇజ్రాయెల్‌కి వెళ్లి అక్కడి రైతులు పండించే విధానం, ఉపయోగించే పరికరాలు, పండిన పంటను నిల్వచేసే పద్ధతి, మార్కెటింగ్‌… ఇలా అన్నీ తెలుసుకున్నా. స్నేహితుల సాయంతో డ్రాగన్‌ఫ్రూట్‌ మొక్కల్ని వియత్నాం నుంచి తెప్పించుకున్నా. ఎకరానికి ఆరు లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి మాకున్న ఎనిమిదెకరాల పొలంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల సాగును ప్రారంభించా. ఇది పెద్దమొత్తమైనా ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. వీటిని ఒకసారి నాటితే ఇరవై ఐదేళ్లపాటు కాపు వస్తుంది. రుచితోపాటు లాభాన్నిచ్చే ఈ పండ్ల మొక్కను ఎంచుకోవడానికి కారణం ఇదే. ఎడారిమొక్క కాబట్టి నీరు ఎక్కువగా అందించాల్సిన అవసరం లేదు. వరదలొచ్చినా తట్టుకుని నిలబడుతుంది. వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. ఎరువులు, పురుగుల మందుల అవసరం లేకుండానే దీన్ని సహజంగానే పండిస్తున్నా. ఈ పండు చెట్టు మీదే పండుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్కల మధ్య బొప్పాయి, జామ, సీతాఫలం పండ్ల మొక్కలు, ఆకుకూరలను అంతర పంటలుగా సాగు చేస్తున్నా. నాటిన ఎనిమిది నెలలకే డ్రాగన్‌ ఫ్రూట్‌ క్వింటాలు దాకా దిగుబడి వచ్చింది. దాన్ని స్థానిక మార్కెట్లకు అమ్ముతున్నా. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతు భరోసా, రైతు సమావేశాల్లో అందరికి వివరిస్తున్నా. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మొక్కలను సాగు చేసే వారు తక్కువ. పైగా మహిళలు అంతగా ఉండరు. నేను దీన్ని పండిస్తున్నందుకు ఆనందంగా ఉంది.