Food

కొవ్వు కరిగించే రాగులు

Ragulu Jowar Helps In Reducing Fat-Telugu food and diet news

ఇటీవల ఆరోగ్యం కోసం రాగులను ఆహారంగా తీసుకోవడం పెరిగింది. రాగిముద్ద అని పిలిచే రాగిసంకటి ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో ఓ ట్రెండీ ఫుడ్‌. రాగులను పిండి రూపంలో తీసుకోవడం ద్వారా దీంతో రాగిరొట్టెలు, రాగి అంబలి ఇలా అనేక రూపాల్లో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తీసుకుంటున్నాం. కొందరు రాగి దోసెలూ, ఇడ్లీలు, లడ్డూలంటూ చాలా ఐటమ్సే తయారు చేస్తున్నారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి కావడంతో వీటితో రకరకాల పదార్థాలు వంటలు చేసుకోవడం ఇటీవల బాగా పెరిగింది. రాగుల్లో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌) చాలా ఎక్కువ. ఆ తర్వాత ప్రోటీన్లు, ఆ తదిపరి స్థానంలో పీచు పదార్థాలు ఉన్నాయి. ఇక రాగిపిండిలో ఉండే కొవ్వు శాతం చాలా చాలా తక్కువ. రాగులకు ఉన్న ఆదరణ వల్ల ఇప్పుడు రాగిపిండి మార్కెట్‌లో రెడీమేడ్‌గా లభిస్తోంది.
**వంద గ్రాముల రాగి పిండిలో…
వంద గ్రాముల రాగి పిండితో 336 క్యాలరీలు లభ్యమవుతాయి. రాగుల్లో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. రాగిపిండిలో క్యాల్షియం చాలా ఎక్కువ. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి చాలా మేలు చేస్తుంది. ఐరన్‌ కూడా కొంతమేరకు ఉంటుంది. రాగిపిండిలో మన శరీరానికి బాగా అవసరమైన ఎన్నోరకాల అమైనో ఆసిడ్స్‌ (ఎసెన్షియల్‌ అమైనో యాసిడ్స్‌) పుష్కలంగా లభ్యమవుతాయి.
*వ్యాలైన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్‌ వంటి అత్యావశ్యక అమైనో ఆసిడ్స్‌ అన్నవి మన ఆరోగ్య నిర్వహణ కోసం చాలా అవసరం. రాగుల్లో పీచుపదార్థాలు బాగా ఎక్కువే. దీంతోపాటు రాగిపిండి గ్లూటెన్‌ ఫ్రీ కావడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. తేలిగ్గా ఒంటికి పడుతుంది. (గ్లూటెన్‌ అంటే… పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోసినప్పుడు పొడి పిండి కాస్తా… పిండిముద్దగా మారుతుంది కదా. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్‌ అనే ప్రోటీన్‌ తోడ్పడుతుంది.
*కొందరి ఒంటికి ఈ గ్లూటెన్‌ సరిపడదు. దాంతో వాళ్లకు గ్లూటెన్‌ ఉన్న పిండితో చేసిన వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్‌ ఇన్‌టాలరెన్స్‌’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే… ఆయా పిండులతో గ్లూటెన్‌ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్‌ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్‌ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. కొన్ని రకాల పిండిలలో స్వాభావికంగానే గ్లూటెన్‌ ఉండదు).
**ఆరోగ్యానికి ప్రయోజనాలెన్నో…
రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆసిడ్‌ వల్ల వెంటనే ఆకలి తీరినట్లు ఉంటుంది. మనం రోజూ తినే తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచుపదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే. ఈ పీచుపదార్థాల వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో రాగిపిండితో చేసిన పదార్థాలు తినేవారు బరువు పెరగకపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారం.
*ఇక ఇందులోని పీచుపదార్థాల కారణంగా రాగిపిండితో చేసిన వంటకాలు మెల్లగానూ, తేలిగ్గానూ జీర్ణమవుతాయి. ఇందులో క్యాల్షియమ్‌తో పాటు విటమిన్‌ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇది బాగా తోడ్పడుతుంది. అందుకే ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు బాగా, వేగంగా ఎత్తు పెరుగుతారు. ఇక యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్య నిర్వహణకూ రాగులు సమర్థంగా పనిచేస్తాయి. రాగిపిండి తినేవాళ్లలో ఎముకలు బలంగా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్‌ అయ్యే రిస్క్‌ చాలా తక్కువ.
**డయాబెటిస్‌ నియంత్రణ…
రాగులలో పాలీఫినాల్‌తో పాటు పీచు పదార్థాలు (డయటరీ ఫైబర్‌) ఉండటం వల్ల డయాబెటిస్‌తో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులను నివారిస్తాయి. ఇందులోని పీచు వల్ల రాగులతో చేసిన వంటలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరగడం అన్నది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇందులో ఉండే లెసిథిన్, మిథియోనైన్‌ వంటి అమైనో ఆసిడ్‌లు కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తాయి. అంతేకాదు… కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులనూ అవి తొలగిస్తాయి. అందుకే కాలేయంలో కొవ్వు పేరుకుంటున్నవారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
**రక్తహీనత నివారించే రాగులు
రాగులలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలను తీసుకుంటూ ఐరన్‌ శరీరంలోకి ఇంకడానికి దోహదపడే విటమిన్‌ ‘సి’ ఉండే పండ్లు ఎక్కువగా తింటే రక్తహీనత (అనీమియా) సమస్య వేగంగా తగ్గుతుంది.
**ఒత్తిడినీ తగ్గిస్తాయి…
తృణధాన్యాల్లో వేరే వాటికి లేని ఒక మంచి గుణం రాగులకు ఉంది. రాగులు ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తాయి. అందుకే యాంగై్జటీ, డిప్రెషన్, మైగ్రేన్‌తో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్‌ నిద్ర వచ్చేలా చేసి నిద్రలేమి (ఇన్‌సామ్నియా) సమస్యను స్వాభావికంగా తగ్గిస్తుంది. మన ఒంటికి చాలా అవసరమైన ఎన్నెనోన అమైనో ఆసిడ్స్‌ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు థ్రియోనైన్, వ్యాలైన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్‌ వంటివి మన కణజాలాన్ని అనుక్షణం రిపేర్‌ చేస్తూ, శరీర జీవక్రియలకూ, ఎముకల ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడతాయి.
*అంతేకాదు మన ఎముకలను రిపేర్‌ ప్రక్రియలోనూ ఈ అమైనోయాసిడ్స్‌ పాలుపంచుకుంటాయి. చాలా ఇతర తృణధాన్యాలలో సామాన్యంగా లభ్యం కాని మిథియోనైన్‌ ఇందులో ఉంటుంది. ఇది శరీరం నుంచి కొవ్వులను తొలగించడానికి, విషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున రాగులతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికి రుచి.