DailyDose

ఆర్టీసీ సమ్మె యథాతథం-తాజావార్తలు-11/23

RTC Strike Will Continue Says Aswaththama Reddy-Telugu Breaking News-11/23-ఆర్టీసీ సమ్మె యథాతథం-తాజావార్తలు-11/23

* ఆర్టీసీ భవితవ్యంపై జరగనున్న సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఐకాస నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

* మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అజిత్‌ పవార్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ కుట్రలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో వారి పేర్లు త్వరలోనే శివసేన అధికార పత్రిక సామ్నా వేదికగా బయటపెడతామని అన్నారు. తాము ఎన్సీపీ నేత ధనుంజయ ముండేతో సంప్రదింపులు చేస్తున్నామని.. అజిత్‌ మళ్లీ వెనకడుగు వేసే అవకాశం ఉందని వెల్లడించారు.

* మహారాష్ట్రలో భాజపా అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై ఎన్సీపీ, శివసేన సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తొలుత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామన్నారు. అజిత్‌ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయమేననీ.. ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్నారు. నిజమైన ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు ఎప్పుడూ భాజపాతో చేతులు కలపరని శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు.

* మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ముంబయిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఎట్టకేలకు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అజిత్‌ పవార్‌ సహకారంతో మహారాష్ట్రలో భాజపా సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది. మోదీ ఉంటే అన్నీ సాధ్యమే’ అని వెల్లడించారు.

* ముంబయిలో జరుగుతున్న పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్సీపీ చీలిక వర్గం (అజిత్ పవార్‌)తో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. ఫడణవీస్‌ సీఎంగా, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం.. వంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే, అజిత్‌ పవార్‌ వైపు వెళ్లిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తిరిగి ఎన్సీపీ గూటికే చేరారు. అజిత్‌ పవార్‌ తమకు ఫోన్‌ చేసి రాజ్‌భవన్‌కు రమ్మంటేనే వెళ్లామనీ.. అంతకుమించి తమకేమీ తెలియదని వారు అంటున్నారు.

* కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రక్షణ ఉత్పత్తి విధానం అమలుతో 2025 నాటికి 26 బిలియన్ డాలర్ల (రూ.1.85లక్షల కోట్లు) విలువైన రక్షణ ఉత్పత్తులు, సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. వీటిలో దాదాపు 10 బిలియన్‌ డాలర్లు (రూ.70వేల కోట్లు) 20 నుంచి 30 లక్షల మంది ఉపాధి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నామన్నారు. రక్షణ వ్యవస్థ, సాంకేతికత అభివృద్ధిలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

* మహారాష్ట్ర రాజకీయాల్లో రాత్రికి రాత్రే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో కాంగ్రెస్‌, శివసేన, ఎన్సీపీ నేతలు ఈ పరిణామాల నుంచి ఇంకా తెరుకోలేదు. ఈ క్రమంలో కొందరు నాయకులు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌, ఉప ముఖ్యమంత్రిగా తన సోదరుడు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేయడం గురించి వాట్సాప్‌ వేదికగా స్పందించారు. ఆమె తన వాట్సాప్‌ స్టేటస్‌లో ‘పార్టీ, కుటుంబంలో చీలిక’ అంటూ పేర్కొనడం గమనార్హం.

* టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో (హెచ్‌సీఏ) అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘంలో అవినీతి కట్టడి చేయాలని తెలంగాణ పారిశ్రామిక, పట్టణాభివృద్ధి మంత్రి కల్వకుంట్ల తారక రామారావ్‌కు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. క్రికెట్‌ పాలకులలో చాలామందిపై ఏసీబీ కేసులు నడుస్తోంటే రాష్ట్రంలో క్రికెట్‌ ఎలా ఎదుగుతుందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.

* సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ‘సేవ్‌ ఆర్టీసీ’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో కార్మికులు నిర్వహించిన ‘సేవ్‌ ఆర్టీసీ’ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం డిపో నుంచి ర్యాలీగా బస్టాండ్‌కు చేరుకున్న కార్మికులు, వివిధ పార్టీల నేతలు ఒక్కసారిగా బస్టాండ్‌లోకి చొచ్చుకెళ్లారు. కొందరు నిరసన కారులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి టైర్లలో గాలి తీశారు. తాత్కాలిక సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

* గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ వంతెనపై మరో విషాదం చోటుచేసుకుంది. ఆ వంతెనపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఫడణవీస్‌ను గవర్నర్‌ అహ్వానించడంపై మూడు పార్టీలు అభ్యంతరం తెలిపాయి. తమకు 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్‌లో వెల్లడించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

* తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం విడుదల చేసిన పొలిటికల్‌ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేర్చినందుకు హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సహాయమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 2న విడుదల చేసిన మ్యాప్‌లో అమరావతి లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందారని లేఖలో ప్రస్తావించారు.

* శాసనసభాపక్ష నేతగా అజిత్‌ పవార్‌ను తొలగిస్తూ ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో దిలీప్‌ వాల్సే పాటిల్‌ను ఎన్నుకుంది. ముంబయిలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా భాజపాతో జట్టుకట్టి డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన్ను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది.

* బయో డైవర్సిటీ ఘటనపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ, రక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చీఫ్‌ ఇంజినీర్ల సూచన మేరకు తాత్కాలికంగా ఫ్లైఓవర్‌ మూసివేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.

* మహారాష్ట్రలో అనూహ్యంగా దేవేంద్ర ఫడణవీస్‌ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి జరిగిన రాజకీయ పరిణామాలపై శివసేన చర్చించింది. ఈ మేరకు ముంబయిలో శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తమ పార్టీ కల నెరవేరబోతోందని ఎమ్మెల్యేలతో అన్నారు. శివసేనే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘మన నది-మన నుడి’ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా పలువురు మద్దతు తెలుపుతున్నారు. శనివారం ప్రశాసన్‌ నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌తో ఏపీ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘మన నది- మన నుడి’ ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

* భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న చారిత్రక డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 174/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 136(194), అజింక్య రహానె 51(69) రాణించడంతో 9 వికెట్లు కోల్పోయి 347 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

* వైకాపా నేతలెవరూ పార్టీ మారే ఆలోచన చేయడం లేదని ఆపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భాజపా ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యలను ఖండించారు. సుజనాచౌదరే వైకాపాలోకి వచ్చే అవకాశముందని జోస్యం చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఎంపీలంతా టచ్‌లోనే ఉంటారని వ్యాఖ్యానించారు.

* భారత్‌లో డే/నైట్‌ టెస్టును సాధ్యం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌, ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఎట్టకేలకు టీమిండియా ముందడుగు వేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్‌, బంగ్లా తొలిసారి గులాబి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐసీసీ 2015లో డే/నైట్‌ టెస్టులను ఆమోదించగా టాప్‌ టెస్టు దేశాల్లో 8 ఇప్పటికే వీటిని ఆడేశాయి. భారత్‌, బంగ్లా ఇన్నాళ్లకు ఆడుతున్నాయి.