DailyDose

ఆరాంకోకు ఒకటిన్నర రెట్లు అధికంగా బిడ్లు-వాణిజ్యం-11/30

Aaramco Gets Bids For 1.7Time More Than Expected-Telugu Business News Roundup-11/30

* సౌదీ అరేబియాకు చెందిన చమురు ఉత్పత్తి దిగ్గజం ఆరామ్‌కో ఐపీవోకు మంచి స్పందన లభించింది. అంచనాల కంటే 1.7రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఈ కంపెనీలో 1.5 శాతం వాటాలను విక్రయించి 25.6 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని సౌదీ ప్రభుత్వం భావించింది. ఈ వాటాల కోసం 44.3బిలియన్‌ డాలర్ల(రూ.3.1లక్షల కోట్లు) మేరకు బిడ్లు వచ్చాయి. ఐపీవోకు ముందు కంపెనీ విలువను 1.6 బిలియన్‌ డాలర్ల నుంచి 1.7 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. 0.5శాతం షేర్లను రిటైల్‌ మదుపరులకు, దేశీయ సంస్థలకు, క్యూఎఫ్‌ఐలకు కేటాయించనున్నారు. అక్కడి 3.4కోట్ల జనాభాలో 49లక్షల మంది ఈ ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి బిడ్ల విలువ 12.6 బిలియన్‌ డాలర్లు. ఇప్పటి వరకు సంస్థాగత మధుపరులు 31.7 విలువైన బిడ్లను దాఖలు చేశారు. వీరికి డిసెంబర్‌ 4 వరకు గడువు ఉంది. వాస్తవానికి సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ ఐపీవో నుంచి 100 బిలియన్‌ డాలర్లను సమీకరించి దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను మార్చలని భావించారు. కానీ, చమురు ధరలు పడిపోవడంతో మార్కెట్లో పెట్టుబడిదారులు అంత ఆసక్తిగా లేరని అధికారులు పేర్కొనడంతో ఐపీవో సైజును తగ్గించారు. ఈ ఐపీవో నుంచి వచ్చిన సొమ్ముతో ఒక నిధిని ఏర్పాటు చేసి చమురేతర రంగాల్లో పెట్టుబడి పెట్టనున్నారు. దీనివల్ల సౌదీలో పెరుగుతున్న జనాభాకు ఉపాధి లభించడంతో పాటు, ఆర్థిక ఒడిదొడుకులు బారిన దేశం పడకుండా చూడాలనే లక్ష్యం.

* దివాలాలో ఉన్న రుచిసోయా సంస్థను కొనుగోలు చేసేందుకు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు మార్గం సుగమమైంది. పతంజలి ఇప్పటికే ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రుణం పొందింది. సెప్టెంబర్‌లో రుచి సోయాను దివాలా ప్రక్రియలో భాగంగా పతంజలి కొనుగోలు చేయడానికి వీలుగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్ల రుణాన్ని ఎస్‌బీఐ నుంచి, రూ.700 కోట్ల రుణాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి, రూ.600 కోట్ల రుణాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి, రూ.400 కోట్ల రుణాన్ని సిండికేట్‌ బ్యాంక్‌ నుంచి, రూ.300 కోట్ల రుణాన్ని అలహాబాద్‌ బ్యాంక్‌ నుంచి పొందింది. ‘‘మేం ఇప్పటికే రుచిసోయా కొనుగోలుకు అవసరమైన రుణాన్ని సిద్ధం చేసుకొన్నాం. స్టేట్‌బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రుణం పొందాం’’ అని పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణన్‌ తెలిపారు. దివాలా ప్రణాళిక ప్రకారం పతంజలి గ్రూపు రూ.204.75 కోట్లను రుచిసోయాలో పెట్టుబడిగా, రుణాల చెల్లింపునకు రూ.3,233.36 కోట్లు వెచ్చిస్తుంది. ఈ నిధులను పతంజలి కన్సార్టియమైన అధిగ్రహణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత దానిని రుచిసోయా సంస్థలో కలిపివేస్తారు.

* బంగారం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 15 నుంచి బంగారు ఆభరణాలు, బంగారంతో రూపొందించిన కళాఖండాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. హాల్‌మార్క్‌ తప్పనిసరి చేస్తూ వినియోగదారుల వ్యవహారాల విభాగం 2020 జనవరి 15న ఓ నోటిఫికేషన్‌ విడుదల చేయనుందని తెలిపారు. సరిగ్గా దీని అమలు కోసం ఏడాది గడువు ఇస్తున్నామన్నారు. ఈ లోగా వర్తకులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను పూర్తి చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన బంగారం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

* తనను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు 2009 నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్‌లు, స్టాక్‌లు వాపస్‌ తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఈవో చందాకొచ్చర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ మకరంద్‌ కార్నిక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్‌2వ తేదీన వాదనలు విననుంది. దీంతో మాజీ సీఈవో, ఐసీఐసీఐ బ్యాంకుకు మధ్య న్యాయపోరాటం తలెత్తినట్లైంది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగింది. దీంతో బ్యాంక్‌ బోర్డు తాత్కాలికంగా కొచ్చర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. కానీ, ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడంతో జూన్‌6న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్‌ శ్రీకృష్ణను దీనిపై దర్యాప్తు చేయడానికి నియమించింది. ఆ తర్వాత ఆమెను తొలగిస్తున్నట్లు బ్యాంక్‌ ప్రకటించింది. దీంతోపాటు ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇతర మొత్తాలను నిలిపివేయడంతోపాటు ఏప్రిల్‌ 2009 నుంచి 2018 మార్చి వరకు చెల్లించిన బోనస్‌లను వాపస్‌ చేయాలని కోరింది.