Health

మెనోపాజ్ దశలో శృంగారం సురక్షితమేనా?

Sex And Menopause-The Actual Story-Telugu Health News

నాకు యాభై అయిదేళ్లు. కొంతకాలంగా కలయిక విషయంలో ఆసక్తి ఉండటంలేదు. ఎప్పుడైనా ఒకసారి ప్రయత్నించినా విపరీతమైన నొప్పితో బాధపడుతున్నా. దాంతో నాకు, మా వారికి గొడవలు జరుగుతున్నాయి. నేనూ, మానసికంగా కుంగిపోతున్నా. పరిష్కారం ఉందా? -ఓ సోదరి

మీది మెనోపాజ్‌ దశ. అంటే నెలసరి దాదాపుగా ఆగిపోతుంది. ఈ వయసులో కలయిక పరంగా కొంతవరకు ఆసక్తి తగ్గడం మామూలే. ఈ దశలో మొదట జరిగే మార్పు హార్మోన్ల విడుదల ఆగిపోవడం. దానికితోడు జననాంగాల భాగం పొడిబారుతుంది. అక్కడి కణజాలం పల్చగా మారుతుంది. వీటన్నింటితోనే కలయిక సమయంలో నొప్పి బాధిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇవన్నీ శారీరకంగా ఎదురయ్యే సమస్యలు. ఇక, మన భారతీయుల్లో ఉండే కొన్నిరకాల అపోహలూ ఈ సమస్యను పెంచుతాయి. ఒక వయసు వచ్చాక భార్యాభర్తలు కలయికకు దూరంగా ఉండాలనుకుంటారు కానీ అది వాస్తవం కాదు. ఈ వయసులో బాధ్యతలన్నీ తీరిపోయి, జీవితం మళ్లీ కొత్తగా మొదలవుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి మలివయసులో కలయిక పొరపాటు కానే కాదు. ఓసారి వైద్యుల్ని సంప్రదించండి. పరీక్షలు చేసి అవసరం అనుకుంటే జననాంగాల కణజాలాన్ని మందంగా మార్చేందుకు లేజర్‌ చికిత్స చేస్తారు. లైంగికవాంఛలు పెంచే మందులూ ఉంటాయి. పరిస్థితిని బట్టి హార్మోన్లనూ మాత్రల రూపంలో సూచిస్తారు. ముందు వైద్యులకు సమస్యను వివరించండి.