Food

రోజుకు గుప్పెడు నువ్వులు…జీవితమంతా నవ్వులు

Sesame Seeds Gives Good Dietary Fiber-Telugu Food And Diet News

భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే నిజానికి నువ్వుల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలో నిత్యం ఒక గుప్పెడు నువ్వులను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* నిత్యం గుప్పెడు (30 గ్రాములు) నువ్వులను తింటే వాటితో మనకు 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటాయి.

* నువ్వులను నిత్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నువ్వులు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే వీటివల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.

* హైబీపీ సమస్య ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే మంచిది. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.

* నువ్వుల నూనెను రాసుకుంటే ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయన్న సంగతి తెలిసిందే. అయితే నువ్వులను తిన్నా నొప్పులను తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఇక నువ్వులను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్లు బి1, బి3, బి6లు అందుతాయి.

* నువ్వులను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే ప్రయోజనం కలుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నువ్వులను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

* నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే సెలీనియం, కాపర్, జింక్‌లు థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వారిలో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. దీంతోపాటు హార్మోన్లు కూడా సమతుల్యంగా పనిచేస్తాయి.

నువ్వులను వేయించి తీసుకోవచ్చు. లేదా అల్పాహారం, భోజనంలోనూ, బెల్లంతో చేసిన లడ్డూల రూపంలో, పెరుగు, సలాడ్లు, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా నువ్వులతో మనకు పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.