Health

రోజుకు మూడుసార్లు పళ్లు తోమండి

Brushing Thrice A Day Helps Avoid Heart Diseases

నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన విషయం విదితమే. అందుకనే వైద్యులు నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు. అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్‌కు చెందిన 40 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,61, 286 మందిపై అక్కడి సైంటిస్టులు 10.5 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆ సమయంలో వారి ఎత్తు, బరువు, వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, దంతాలు, నోటి ఆరోగ్యం తదితర వివరాలను సేకరించారు. ఈ క్రమంలో అన్ని వివరాలను విశ్లేషించి చివరకు సైంటిస్టులు తేల్చిందేమిటంటే.. నిత్యం 3 అంతకన్నా ఎక్కువ సార్లు బ్రష్ చేసుకునేవారికి హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు 12 శాతం వరకు తగ్గుతాయని, అలాగే ఆట్రియల్ ఫైబ్రిలేషన్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు 10 శాతం వరకు తక్కువగా ఉంటాని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరూ తమ దంతాలు, నోటి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సదరు సైంటిస్టులు సూచిస్తున్నారు.