Editorials

గుంటూరు జ్ఞాపకాలు – పిచికలగుంట

Guntu Pichikalgunta Stadium-Funny Memoir

గుంటూరు జ్ఞాపకాలు – పిచికలగుంట – బులుసు సాయిరాం

చెన్నై మహా నగరానికి చేపాక్ స్టేడియం ఎలాంటిదో … బెంగళూరు పట్టణానికి చిన్నస్వామి స్టేడియం ఎలాంటిదో … బంగారు తెలంగాణా ముఖ్య పట్టణమైన హైదరాబాదు నగరానికి ఎల్ . బి . స్టేడియం … గచ్చిబౌలి స్టేడియం ఎలాంటిదో … మా గుంటూరుకి ” పిచికలగుంట ” అలాంటిది .

ముంబైకి … వాంఖేడే / బ్రబోర్ని స్టేడియం ఎలాంటిదో … కోల్కతాకి ఎడెన్ గార్డెన్స్ ఎలాంటిదో …కాన్పూర్కి … గ్రీన్ పార్క్ స్టేడియం ఎలాంటిదో …ఢిల్లీకి … ఫిరోజ్ షా కోట్లా ఎలాంటిదో …మా గుంటూరుకి ” పిచికలగుంట ” అలాంటిది .

అరండల్పేట ఏడో లైన్ … రెండో అడ్డరోడ్డుతో మొదలై … రైటుకి తీస్కుని … ఎనిమిది … తొమ్మిది లైన్లను కలుపుకుని అట్నుంచీ మళ్లీ రైటుకి తీస్కుని … శ్రీనగర్ కాలనీ తోటి ముగిస్తుంది .

అంటే మా పిచికలగుంట ఎంత పెద్దదో ఒకసారి మీరే ఊహించుకోండి .

ఇంకో స్టేడియం కూడా ఉందండీ … బస్టాండ్ వెనక వైపు … కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం .

ఆ స్టేడియంలోనే నా కెంతో ఇష్టమైన … ది ఒరిజినల్ లిటిల్ మాస్టర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ … అండ్ ది జీనియస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ … గుండప్ప విశ్వనాథ్ … సిలోన్ ( ఇప్పటి శ్రీలంక ) టీమ్ మీద … విజృంభించి ట్రిపుల్ సెంచరీ చేశాడు .

సిధాత్ వెట్టిమొని … ఎ . పి . బి . టెన్నికోన్ … కలుపెరుమా … ఇలా భలే తమాషాగా ఉండేవి వాళ్ళ పేర్లు .

ఆ స్టేడియంలో ఆటలు తక్కువానూ … రాజకీయాలకి సంబంధించిన మీటింగులు … సభలు … సమావేశాలు ఎక్కువానూ .

అందుచేత ఆ స్టేడియం అంటే అప్పట్లో మా కుర్ర గ్యాంగుకి పెద్దగా ఇష్టం ఉండేది కాదు .

ఇంకో గ్రౌండ్ కూడా ఉండేదండి … పి . పి . గ్రౌండ్స్ ( పోలీస్ పెరేడ్ గ్రౌండ్ )

అక్కడ పోలీసాళ్లు ఖాకీ బెల్ బాటం నిక్కరు … షర్ట్ వేసుకుని … నెత్తి మీద ఎఱ్ఱ టోపీ పెట్టుకొని … వెదురు బొంగుల్లాగా నిటారుగా నుంచుని … లెఫ్ట్ రైట్ … లెఫ్ట్ రైట్ అనుకుంటూ మార్చ్ ఫాస్ట్ చేస్తుండేవారు …

ఒకప్పుడు మమ్మల్ని క్రికెట్ ఆడుకోనిచ్చేవారు … ఒకప్పుడు తరిమేసావారు .

క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ … అన్నట్టుగా
క్షణక్షణముల్ మా గుంటూరు పోలీసు చిత్తముల్ …

అప్పుడప్పుడు మా డబ్బుల్తో గోలీ సోడాలు ( పది పైసలు దగ్గర్నుంచీ నాకు తెలుసు . ఆ పది పైసలకే కొంతమంది … నీళ్ళు పది పైసలేమిటి … అరాచకం కాపోతెనూ … అని మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పి … తిట్లు శాపనార్థాలు పెట్టేవాళ్ళు ) ఇప్పించి వాళ్ళ గొంతు తడుపుతుండేవాళ్ళం … మా ఆటకి అంతరాయం కలగకుండా ఉండేందుకు …

ఒకప్పుడు అది కూడా వర్కౌట్ అయ్యేది కాదు .
మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు ( పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో రావు గోపాలరావు ) గారి లాగా మా డబ్బుల్తో సోడా తాగి … మాముందే
బ్రేవ్మని తేన్చి … కాసేపలా అటూ ఇటూ తిరిగొచ్చి …. గ్రౌండ్లోంచి మమ్మల్నే బయటకి తరిమేసేవారు .

బ్యాక్ టు పిచికలగుంట …

ఏవండీ మా పిచికలగుంట ఎంత ఫేమస్సంటే … మీరు నగరం నలుమూలల్లో ఎక్కడున్నాసరే … అరేయ్ పిచికల గుంటెక్కడ్రా … అని అడిగారను కోండి … బొడ్డూడని వెధవైన సరే … టక్కున చెప్పేస్తాడు .

ఒకేళ … ఫర్ సపోజ్ … అలా గనక ఎవరైనా
చెప్పలేక పోయారనుకోండి … వాడి మొఖం మీద … ఐఎస్ఐ … మార్కేసినట్టు … అరేయ్ ఈడు
గుంటూరోడు కాద్రోయ్ … అని యూనానిమస్గా
డిక్లేర్ చేసేసేవాళ్ళం .

అసలు నన్నడిగితే … ఇండియాలోనే కాదండీ … ఈ ప్రపంచంలో ఉన్న స్టేడియమ్లన్నిటికంటే కూడా మా
” పిచికిలగుంట ” చాలా గ్రేటండీ .

ఇలా బల్ల గుద్ది మరీ చెప్పడానికి నా దగ్గిర ఒకటో రెండో కాదండి … బలమైన కారణాలు చాలానే ఉన్నాయి .

చెప్తా వినండి …

నెంబర్ వన్ … నేను పైన కొన్ని స్టేడియం పేర్లు చెప్పాను కదండీ … ఆ గ్రౌండ్లో … ఒకసారి ఒకే ఒక్క మ్యాచ్ ఆడచ్చండీ … ఆ మ్యాచ్ పూర్తయితేనే గానీ రెండో మ్యాచ్ ఆడలేరు … ఎంత పెద్దోళ్లయినా … ఎంత గొప్పోళ్లయినా .

మా పిచికలగుంటలో అలక్కాదండి .

ఒకేసారి మూడ్నాలుగు … ఫుల్లు టీమున్న మ్యాచీలు … ఎంచక్కా ఆడుకొచ్చండి … ఇంకో
టీమోళ్లని డిస్టర్బ్ చెయ్యకుండా .

ఇలా ఇంకెక్కడన్నా కుదురుతుందా చెప్పండి … ?

నెంబర్ 2 … ఒక్క క్రికెట్ మ్యాచ్లే కాదండి … క్రికెట్టంటే ఇష్టం లేనోళ్ళు … ఒక బ్యాచ్ ఉందిలేండి … వాళ్లేం చేసేవారంటే … రెండు పెద్ద లావు పాటి కర్రలు అటేపొకటి … ఇటేపొకటి పాతేసి … ఆ రెండు కర్రలకి వల కట్టి వాలీ బాల్ ఆడేవారు .

నెంబర్ 3 … కర్ర బిళ్ళ ఆడే బ్యాచిలు కొన్ని .

నెంబర్ 4 … ఏడు పెంకులాట ఆడే బ్యాచీలు కొన్ని .

నెంబర్ 5 … పిచ్చి బంతి ఆడే బ్యాచీలు కొన్ని .

నెంబర్ 6 … గోళీలాట లాడుకునే పిల్ల బ్యాచీలు కొన్ని .

నెంబర్ 7 … మరి ఈ ఆట్లన్ని చూడటానికి … ఆడేవాళ్ళని ఎంకరేజ్ చెయ్యటానికి వచ్చే మా అరండల్పేట క్రీడాభమానులు … ప్రశాంతంగా కూచుని తిలకించేందుకు … పిచికలగుంట చుట్టూతా ఎత్తుగా ఇసక దిబ్బలు ఉండేవి . వాటి మీద కూచుని
తిలకిస్తుండేవారు .

పిచికల గుంట చుట్టుపక్కల కాపురముంటున్న వాళ్ళు డాబాల మీద కుర్చీలేసుకుని కూచుని … గాలికోసం విసినికర్రలతో విసురుకుంటూ ఫ్రీగా మ్యాచీలు చూసేవారు … ఆరారగా కాఫీలో … టీలో … మంచినీళ్లో సేవిస్తూ .

నెంబర్ 8 … మా పిచికలగుంటలో సాయంత్రం పూట బోళ్ళంత వ్యాపారం జరిగేది .

గోలీసోడాలు .. పిడత కందిపప్పు … తేగలు … జీళ్లు … మావిడితాండ్ర … జామకాయలు … బఠాణీలు … వేరుశనక్కాయలు … పీచు మిఠాయి … మిరపకాయ్ బజ్జీలు … పుణుగులు … ఇంకా చాలా చాలా …

నెంబర్ 9 … సాయంకాలం … ప్లే గ్రౌండ్గా … కుర్రకారుని ఆదరించి అక్కున చేర్చుకునే పిచికలగుంట … తెల్లవారు ఝామున నాలుగు నాలుగున్నర నుంచీ సుమారు ఏడు ఏడున్నర గంటల వరకూ … అరండల్పేటలో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాకింగ్ స్ట్రిప్గా మారిపోయేది .

నెంబర్ 10 … పిచికిలగుంట మూల మీద … ఏడో లైన్ మూలగా ఒక చిన్న తటాకము ఉండేది .

అది దోభీ ఘాట్గా వాడుకునేవారు మా పేట్లోని దోభీలు .

మా కొండయ్య కూడా అక్కడే బట్టలుతికి … ఇంటికి పట్టుకుపోయి శుభ్రంగా ఇస్త్రీ చేసి … నాలుగో లైన్లో … గీతా కేఫ్ పక్కన ఒక చిన్న కొట్టు అద్దెకి తీస్కుని … బాబీ డ్రైక్లీనింగ్ ( రాజ్కపూర్ సినిమా బాబీ రిలీజు అయి పెద్ద హిట్టు అయిన తరువాత ప్రతివాడు ఇదే పేరు పెట్టేవోడు అప్పట్లో ) అని పేరెట్టి … షోకేస్లో హాంగర్కి తగిలించి … మూడు నాలుగు రోజులు పోయిన తరువాత … డ్రై క్లీనింగ్ చేసినట్టు బిల్డప్పిచ్చి … పట్టుకొచ్చేవాడు .

అందరికీ ఈ విషయం తెలిసినా ఎవరూ ఏమీ అనేవారు కారు . అందరికీ నెలసరి ఖాతాలుండడం ఒక కారణమైతే … మరొక కారణం … మనుషులు అప్పట్లో అంత కామ్ప్లికేటెడ్గా ఉండేవారు కారు .

పనివాళ్ళు … చాకలాళ్లు … నమ్మకంగా ఏళ్ల తరబడి పనిచేసేవారు … ఎపుడైనా అవసరం పడితే ఇంటికి కాపలాగా కూడా ఉండేవారు .

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పెద్దవాళ్ళు చూసీ చూడనట్లు ఉండేవారు .

నాకు తెలిసి మా పిచికలగుంట ఏనాడూ రాజకీయ నాయకులకు … రాజకీయ సభలకి … సమావేశాలకి
ఆశ్రయం ఇవ్వలేదు .

ప్రస్తుత పరిస్తితి నాకు తెలీదు .

ఇప్పుడు చెప్పండి …

మా పిచికలగుంట లాంటి మల్టీ పర్పస్ స్టేడియం గానీ … గ్రౌండ్గానీ … మీరు ఎక్కడైనా … ఎప్పుడైనా చూశారా … ?

మళ్ళీ ఇంకో ” గుక ” తో త్వరలోనే మీ ముందుంటా .

అంతవరకూ శలవు …