Agriculture

ఇప్పటివరకు 31 TMCలు ఎత్తిపోసిన కాళేశ్వరం

So Far Kaleswaram Has Delivered 31TMC Of Water

రాష్ర్టానికి జీవనాధారమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుత ఫలితాలనిస్తున్నది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీస్థాయిలో గోదావరి జలాలను ఎత్తిపోసింది. కాళేశ్వరం ప్రారంభోత్సవం నాటినుంచి ఆదివారం సాయంత్రం వరకు లక్ష్మీ పంపుహౌస్ అంటే లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్ నుంచి 21 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయానికి ఇప్పటివరకు 31 టీఎంసీలను ఎత్తిపోసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల పరవళ్లు కొనసాగుతున్నాయి. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి వరద నిలిచిపోవడంతో గత కొన్నిరోజులుగా ప్రాజెక్టులోని లింక్-1, లింక్-2లో భాగంగా నిర్మించిన పంపుహౌస్‌ల నుంచి జలాల ఎత్తిపోత నిరంతరాయంగా సాగుతున్నది. వచ్చే ఏడాది మార్చి దాకా దీనిని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో ఆ దిశగా ఇంజినీర్లు సన్నాహాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్.. ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత మొదట లింక్-1లో భాగంగా లక్ష్మీబరాజ్ నుంచి పార్వతి బరాజ్ ఆపై ఎల్లంపల్లి జలాశయానికి జలాల్ని తరలించారు. నదిలో వరద ప్రవాహానికి అనుగుణంగా ఎగువ నుంచి ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో ఉండటంతో లింక్-1ను నిలిపివేసి.. ఆపై ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించారు. సాంకేతిక ప్రొటోకాల్‌లో భాగంగా ఇంజినీర్లు శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని ఖాళీచేయాల్సి రావడంతో ఆ నీటిని ఎల్‌ఎండీకి పరుగులు పెట్టించారు. కొన్నిరోజుల కిందట ఎల్లంపల్లికి వరద పూర్తిగా నిలిచిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అసలుపని మొదలైంది. ప్రాణహిత నుంచి వస్తున్న ప్రవాహానికి అనుగుణంగా లక్ష్మీబరాజ్ ఫోర్‌షోర్ నుంచి లక్ష్మీ పంపుహౌస్ ద్వారా జలాల ఎత్తిపోత మొదలుపెట్టారు. అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి కూడా జలాల తరలింపును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి (కన్నెపల్లి) పంప్‌హౌస్‌లో ఆదివారం ఇంజినీర్లు నాలుగు మోటర్లను నడిపించారు. 4, 6, 8, 10వ నంబర్ మోటర్ల ద్వారా సరస్వతి (అన్నారం) బరాజ్‌కు 8,480 క్యూసెక్కుల నీటిని తరలించారు. సరస్వతి బరాజ్‌లో ప్రస్తుతం 7.39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.