DailyDose

నేటి పది ప్రధాన వార్తలు–12/02

Today's Top 10 Breaking News In Telugu-News Roundup Of The Day

1. ‘దిశ’ నిందితులను వెంటనే శిక్షించాల్సిందే!
హైదరాబాద్‌లో యువ వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతంపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలంటూ ఎంపీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ ఘటనపై చర్చ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో జీరో అవర్‌లో స్పీకర్‌ ఓం బిర్లా చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
2. ఫడణవీస్‌ డ్రామా ఆడారట..!
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడణవీస్‌ తన ప్రభుత్వానికి మెజార్టీ లేదని అంగీకరించి 80గంటల్లోగా రాజీనామా చేశారు. అయితే మెజార్టీ లేదన్న విషయం పార్టీకి ముందే తెలుసట. అయినా ఒక పని కోసం ఫడణవీస్‌తో డ్రామా ఆడించారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే.
3. ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య: పువ్వాడ
ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య కోసం బోధనా రుసుములు అందించనున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం నగరంలోని ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కార్మికులతో కలిసి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అజయ్‌ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్మికులకు డిపోల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామని వెల్లడించారు.
4. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును పరిశీలిస్తాం: సీఎం ఠాక్రే
బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును తాము పునఃపరిశీలిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తామని అందులో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని కోసం రైతులు, గిరిజన ప్రాంత ప్రజల భూములను బలవంతంగా తీసుకోవడంతో వారి దగ్గర నుంచి పూర్తి వ్యతిరేకత వస్తోందని ఆయన తెలిపారు.
5. కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసిన ఎన్‌ఎస్‌ఈ
జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) సోమవారం కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ట్రేడింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసింది. ఇది అన్ని విభాగాలకు వర్తిస్తుంది. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు బీఎస్‌ఈ, మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా ఈ బ్రోకరేజి సంస్థల లైసెన్స్‌ను రద్దు చేశాయి.
6. వాళ్లని బహిరంగంగా ఉరితీయాలి: జయాబచ్చన్‌
దిశ హత్య ఘటన రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ ఘటనను సభ్యులు తీవ్రంగా ఖండించారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. ‘ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న వారిని ఎటువంటి క్షమాభిక్ష లేకుండా బహిరంగంగా ఉరి తీయాలి. దీనికి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలంటూ ప్రజలు నిలదీయాల్సిన సమయం ఇదే. నిర్భయకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు’ అని ఆమె అన్నారు.
7. ‘ప్రియాంక చోప్రా కాంగ్రెస్‌లో చేరారా..?’
దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ దిల్లీ విభాగం అధ్యక్షుడు సుభాష్ చోప్రా కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో సురేంద్ర కుమార్ అనే కాంగ్రెస్ నేత నినాదాలు చేశారు. తొలుత ఆయన సోనియా గాంధీ పేరు పలకగానే కార్యకర్తలు ‘జిందాబాద్…’ అంటూ నినాదాలు చేశారు. తరువాత ఆయన రాహుల్ గాంధీ అన్నప్పుడు కూడా కార్యకర్తలు ‘జిందాబాద్..’ అన్నారు. తరువాత ఆయన ప్రియాంక గాంధీ అనాల్సింది పోయి పొరపాటున ‘ప్రియాంకా చోప్రా’ అనేశారు. అయితే ఆయన ఏమన్నారో అంతగా వినని జనం ఊపులో ‘జిందాబాద్‌..’ కొట్టేశారు. తరవాత ఆయన తప్పుగా పలికారని తెలుసుకొని అంతా నవ్వుకున్నారు.
8. గాంధీ మాటలను గుర్తు చేసిన వార్నర్‌ సతీమణి
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (డేనైట్‌) ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌వార్నర్‌(335*) ట్రిపుల్‌ శతకం సాధించడంపై ఆయన సతీమణి కాండిస్‌ వార్నర్‌ ట్విటర్‌లో స్పందించారు. ఈ సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేసుకున్నారు. ‘శారీరక సామర్థ్యంతో బలం చేకూరదు. దృఢ సంకల్పంతోనే అది సిద్ధిస్తుంది’ అనే కోట్‌ను వార్నర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘నీ గురించి ఇతరులు ఏం నమ్ముతున్నారని కాదు, నీపై నువ్వు ఏ నమ్మకంతో ఉన్నావన్నదే ముఖ్యం’ అని కాండిస్‌ ట్వీట్‌ చేశారు.
9. అటవీశాఖ అధికారుల మృతదేహల గుర్తింపు
ప్రాణహిత నదిలో గల్లంతైన అటవీశాఖ అధికారుల మృతదేహాలను జాలర్లు గుర్తించారు. నదిలో చేపల వేటసాగిస్తున్న మత్స్యకారుల వలలకు ఇవాళ ఉదయం అధికారుల మృతదేహాలు చిక్కాయి. తలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నిదిలో ఆదివారం నాటు పడవ బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఈ పడవలో ప్రయాణిస్తున్న నలుగురు అటవీ సిబ్బందిలో ఇద్దరు గల్లంతయ్యారు. బీట్‌ అధికారి సద్దాం హుస్సేన్‌, కత్తెరయ్య, లింగయ్య, అర్జయ్య అతి కష్టం మీద నదిలోని చిన్న చెట్లను ఆధారం తీసుకొని ప్రాణాలతో బయట పడ్డారు. పక్కపక్కనే కూచున్న బీట్‌ అధికారులు సురేష్‌, బాలకృష్ణ నీటిలో కొట్టుకుపోయి గల్లంత య్యారు.
10. ఆ విషయంలో జగన్.. చంద్రబాబును మించిపోయాడు: తులసిరెడ్డి
రాష్ట్రంలో ఆత్మహత్యల పాలన ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల్లో జగన్ రూ.28 వేల కోట్ల అప్పుచేశారని తెలిపారు. అప్పులు చేయడంలో జగన్.. చంద్రబాబును మించిపోయాడని విమర్శించారు. రాష్ట్రం రావణ కాష్టమైందని.. రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు కాస్తా గులకరాళ్లుగా మారిపోయాయని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.