DailyDose

ఐటీపై టాస్క్ ఫోర్స్ నివేదిక అందింది-వాణిజ్యం-12/03

Income Tax Task Force Report Is Out-Telugu Business News-12/03

* ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించేందుకు నియమించిన టాక్స్‌ ఫోర్స్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ థాకూర్‌ చెప్పారు. రాజ్యసభలో మంగళవారం శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ టాస్క్‌ ఫోర్స్‌ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించి దేశంలో నెలకొన్న ఆర్థికావసరాలకు అనుగుణంగా కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం 2017లోనే ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం వాస్తవమేనని మంత్రి తెలిపారు.
* ఆటోమొబైల్‌ సేల్స్‌ తగ్గుముఖం పడుతూ ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ కార్ల మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు మారుతి సుజుకి ప్రకటించింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో కార్ల ధరలను పెంచడం అనివార్యమైందని వివరణ ఇచ్చిన కంపెనీ ఏ వాహనాలపై ధరలను పెంచుతుందనే వివరాలు వెల్లడించలేదు. పలు ముడిపదార్ధాల ధరలు పెరగడంతో గత ఏడాదిగా తమ వాహనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కార్ల ధరలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మారుతి సుజుకి సెబీకి సమాచారం అందించింది.
*నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్న బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యాఖ్యలను బయోకాన్ కంపెనీ చీఫ్ కిరణ్ మంజుదార్ షా మరోసారి సమర్ధించారు.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు లాభపడి 40852 వద్ద ప్రారంభమైంది.
నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 12068 వద్ద ప్రారంభమైంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో టెలికం కంపెనీల స్థూల ఆదాయం రూ. 54,218 కోట్లుగా ఉంది.
*ఇక మీదట రైతులు ఇష్టారాజ్యంగా పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలులేదు. చిన్నదైనా, పెద్దదైనా పౌల్ట్రీ ఫారం పెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
*భారతీయ రైల్వే ఆదాయ-వ్యయ (ఆపరేటింగ్) నిష్పత్తి గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. రైల్వే ఎంత సమర్థంగా నడుస్తోందీ, దాని ఆర్థిక పరిస్థితి ఎంత ఆరోగ్యదాయకంగా ఉందీ సూచించే ఈ నిష్పత్తి 2017-18లో 98.44 శాతంగా నమోదైందని ‘కాగ్’ నివేదిక వెల్లడించింది.
*డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు క్రెడిట్ కార్డు చెల్లింపులపై చార్జీలను రద్దు చేస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రకటించింది. ప్రీమియం రెన్యూవల్, కొత్త ప్రీమియం, లోన్ చెల్లింపులు, రుణంపై వడ్డీ చెల్లింపులు వంటి లావాదేవీలను క్రెడిట్ కార్డు ద్వారా చేస్తే ఎటువంటి చార్జీలు విధించబోమని స్పష్టం చేసింది. వినియోగదారులు ఆన్లైన్ లావాదేవీలు చేయాలనుకుంటే ‘మై ఎల్ఐసీ’ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
*‘బెస్ట్ ప్రైస్’ సభ్యుల కోసం వాల్మార్ట్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టాయి. బీ2బీ క్యాష్ అండ్ క్యారీ స్టోర్లయిన ‘బెస్ట్ ప్రైస్’ ఖాతాదారుల కోసం ఈ కార్డు ను విడుదల చేశారు. హైదరాబాద్లోని శివరాంపల్లి బెస్ట్ప్రైస్ స్టోర్లో ఈ కార్డును వాల్మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ పేమెంట్స్ బిజినెస్ అధిపతి పరాగ్ రావు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 బెస్ట్ ప్రైస్ స్టోర్లలో కూడా దీన్ని ఇదే రోజు ప్రవేశపెట్టారు. హోల్సేల్ కొనుగోలుదారులు తమ చెల్లింపులను ఈ కో బ్రాండెడ్ కార్డు ద్వారా చేయొచ్చు. బెస్ట్ ప్రైస్ సేవ్ స్మార్ట్, సేవ్ మాక్స్ పేరుతో ఈ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
*చట్టప్రకారమే చందా కొచ్చర్ను బ్యాంక్ సీఈఓ, ఎండీ పదవుల నుంచి తొలగించినట్టు ఐసీఐసీఐ బ్యాంక్.. బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ముందే రిటైర్మెంట్ తీసుకుంటానన్న తన విజ్ఞప్తిని ఆమోదించాక కూడా బ్యాంక్ తనను తొలగించడాన్ని కొచ్చర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆర్బీఐ ఆమోదం లేకుండా బ్యాంక్ తనను తొలగించడం చట్టవిరుద్ధమని కొచ్చర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.