DailyDose

నేటి పది ప్రధాన వార్తలు 12/04

Breaking News Roundup Of The Day In Telugu-TNILIVE

1.చిదంబరానికి బెయిల్‌ మంజూరు
ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతకు భారీ ఊరట లభించింది. ఇదే విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. సాక్ష్యాల్ని ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడొద్దని ఆదేశించింది.
2. పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఓకే
మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పొడగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
3. సుందర్‌ పిచాయ్‌కి ప్రమోషన్‌..!
ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) సుందర్‌ పిచాయ్‌ మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కి కూడా ఆయనే సీఈవోగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న సంస్థ సహవ్యవస్థాపకులు లారీ పేజ్‌ నుంచి ఆయన ఈ బాధ్యతలు అందుకోనుండటం విశేషం. మరో సహవ్యవస్థాపకుడైన సెర్గి బ్రిన్‌ కూడా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
4. తోటి జవాన్లపై కాల్పులు.. ఆరుగురి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) దళం జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెహమాన్‌ ఖాన్‌ అనే జవాన్‌ తన సర్వీసు తుపాకీతో తోటి జవాన్లపైకి కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
5. సుడాన్‌ అగ్నిప్రమాదంలో భారతీయుల మృతి
సూడాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. దేశ రాజధాని ఖార్తూమ్‌లోని పారిశ్రామిక వాడలో ఓ కర్మాగారంలో ఎల్‌పీజీ ట్యాంకర్‌ పేలడంతో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.
6. బీఎస్-6 మహీంద్రా ఎక్స్‌యూవీ 300 విడుదల
మహీంద్రా అండ్‌ మహీంద్రా తొలిసారి బీఎస్‌6 ఇంజిన్‌ వాహనాన్ని విడుదల చేసింది. సబ్‌ కాంప్టాక్ట్‌ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 300లో బీఎస్‌-6 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. మహీంద్రా ఎక్స్‌యూవీ బీఎస్‌6 ధర రూ.8.30లక్షల నుంచి మొదలై రూ.11.84 లక్షల మధ్య ఉంటుంది. బీఎస్‌ 4 వెర్షన్‌తో పోలిస్తే దీని ధర రూ.20,000 వరకు పెరిగింది.
7. నాసా కాదు.. విక్రమ్‌ జాడ గుర్తించింది మేమే
చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్‌-2లోని -విక్రమ్‌’ ల్యాండర్‌ను ఎట్టకేలకు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం వెల్లడించింది. అయితే నాసా ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధినేత కె. శివన్‌ తోసిపుచ్చారు. విక్రమ్ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని, దాని జాడను తాము ఎప్పుడో గుర్తించామని అన్నారు.
8. చిమ్మచీకట్లో లక్ష్యాన్ని ఛేదించిన పృథ్వి-2
దేశీయంగా అభివృద్ధి చేసిన అణుసామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణిని డీఆర్‌డీవో రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ కాంప్లెక్స్‌-3 నుంచి మంగళవారం సాయంత్రం 7:48 సమయంలో ఈ ప్రయోగం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ రాత్రి వేళ ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిసింది.
9. ఇటీవలే ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి
20 రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సనత్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణ.. దాసరి కార్తీక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్న సాయంత్రం రామారావునగర్‌లోని ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
10. అదరగొట్టిన సీఎస్‌బీ బ్యాంక్‌ లిస్టింగ్‌..!
కేథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌(సీఎస్‌బీ) నేడు మార్కెట్లలో భారీ లాభాలతో లిస్ట్‌ అయింది. ఒకానొక దశలో జారీచేసిన ధరకంటే దాదాపు 57 శాతం పెరిగి రూ.307కు చేరుకొంది. ఈ షేరు ఇష్యూ ధర రూ.195 కావడం విశేషం. ఈ షేరు 41శాతం లాభంతో రూ.275 వద్ద లిస్టైంది. ఈ ఐపీవోను నవంబర్‌ 22న ప్రారంభించి 28వ తేదీన ముగించారు. దాదాపు 87 రెట్లు అధికంగా ఇది సబ్‌స్క్రైబ్‌ అయింది.