Politics

ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో వైకాపా డిమాండ్

Mithun Reddy Demands For Special Status In Lok Sabha

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభ వేదికగా వైకాపా డిమాండ్‌ చేసింది. విభజన హామీలన్నీ నెరవేర్చాలని ఆపార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేసి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నారు. పూర్తిగా అప్పులతో నెట్టుకొస్తున్న నవ్యాంధ్ర తట్టుకుని నిలబడాలంటే వీలైనంత ఎక్కువ సాయం చేయాలని విన్నవించారు. ‘‘రాష్ట్ర విభజన ఏపీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. విభజన తర్వాత 56 శాతం జనాభా ఉంటే, 60శాతం అప్పులు వాటాగా వచ్చాయి. ఆదాయం మాత్రం 46 శాతమే ఉంది. ఒకదానికొకటి ఏమాత్రం పొంతన లేదు. రెండు ప్రధాన హామీలతో రాష్ట్రాన్ని విభజించారు. ఒకటి ప్రత్యేక హోదా, రెండోది చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని సభలోనే చెప్పారు. అయితే ఇప్పటిదాకా హోదా హామీ నెరవేర్చలేదు. సభలో చెప్పారు.. భాజపా, కాంగ్రెస్‌ మేనిఫెస్టోల్లోనూ హామీ ఇచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధానితో పాటు మంత్రులు కూడా అదేమాట చెప్పారు. ఏపీకి సాయం చేయాల్సిన సమయం ఇదే. ఆర్థికంగా తీవ్రమైన లోటు ఉంది. విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఏపీ ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతోంది. రాబడి తక్కువగా ఉంది. ఏపీని ఆదుకోవాలని ఆర్థికమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రత్యేక హోదా హామీ నిలబెట్టు కోవాలని వైకాపా తరఫున డిమాండ్‌ చేస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి తెలిపారు.