DailyDose

కర్ణాటకలో ప్రారంభమైన ఉప ఎన్నికల పోరు-రాజకీయ-12/05

Karnataka Politics Catch Fire-Telugu Political News-12/05

* కర్ణాటకలో 15 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వారిపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా రెండు నియోజకవర్గాలకు సంబంధించి కోర్టులో కేసులున్నాయి. పోలింగ్‌ సందర్భంగా కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్ల సందడి మొదలైంది. చలి తీవ్రత కాస్తా ఎక్కువగా ఉన్నా ఆరంభంలోనే ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.
* చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’
గురువారం తుళ్లూరులో రాజధాని రైతులు, కూలీలు ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కామెంట్స్- ప్రస్తుతం రాజధాని వున్న పరిస్థితికి అయిదేళ్ల కిందట జరిగిన పరిణామాలే కారణం. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ దుస్థితి. 2014 లో రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. హైదరాబాద్ నగరంను ఇది మన రాజధాని అని అందరం కలిసి అభివృద్ది చేసుకున్నాం. నాడు వున్న ప్రత్యేక పరిస్థితి, కారణాల వల్ల విభజన జరిగింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. విభజన అనంతరం ఎపి వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంగా మారింది. చిన్న, మద్యతరహా పరిశ్రమలు, సర్వీస్‌ సెక్టర్‌ కూడా హైదరాబాద్ లో వుండిపోయింది. వివిధ విద్యారంగ సంస్థలు, కేంద్రానికి చెందిన ముప్పైకి పైగా సంస్థలు అక్కడే వుండిపోయాయి.
*తేదేపాకు దూరంగా భాజపా సీపీఎం
గతంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామని మరోసారి అందుకు సిద్దంగా లేమని భాజపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు చంద్రబాబు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈసమావేశానికి భాజపా సీపీఎం తో పాటు మిగిలిన అన్ని పార్టీలు రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అయితే భాజపా సీపీఎం నేతలు ఈ సమావేశానికి హాజరుకాకుండా చంద్రబాబుకు ఝులాక్ ఇచ్చారు. ఈక్రమంలో భాజపా నాయకులూ మాట్లాడుతో భాజపాతో కలవడం కోసమే చంద్రబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారని అభిప్రాయపడ్డారు. తెదేపాకి తోక పార్టీగా ఉండటం తమకు ఇష్టం లేదని సొంతంగా ఉద్యమాలు చేస్తామని పేర్కొంటున్నారు.
* ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అదే: చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు గతంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. సెల్ఫ్‌ పైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థతి ఉండరాదనే ఉద్దేశంతోనే పెట్టుబడులు రాబట్టామని తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కారాదని, భావితరాల భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండాలనేదే తేదేపా తపన అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
* రైతుల తలరాత మారడం లేదు: పవన్‌
‘ జనసేన ఆత్మీయ యాత్ర’లో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇవాళ మదనపల్లె టమాటా మార్కెట్‌ను సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఈ సందర్భంగా పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
‘ గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. రైతన్నకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా రైతల గురించి పట్టించుకోలేదు. ఆంగ్లమాధ్యమం కాదు కావాల్సింది.. రైతుల సమస్యలను పట్టించుకోండి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. ఇసుక లేక పనులు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు’ అని పవన్‌ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
* మద్యపాన నిషేధం కోరుతూ దీక్ష చేస్తా: అరుణ
తెలంగాణ రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. శంషాబాద్‌లో ‘దిశ’ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చిస్తున్నా.. సీఎం మాత్రం స్పందించలేదని ఆమె అన్నారు. మద్యం వల్లే రాష్ట్రంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని చెబుతూ.. మద్యం, మాదకద్రవ్యాలను నియంత్రించాలని రిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించే సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. దీనిపై ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద ‘ మహిళా సంకల్ప దీక్ష’ పేరుతో రెండ్రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు.
* ఐడీబీఐ కేసులో సుజనా భార్యకు డీఆర్‌టీ నోటీసులు
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి భార్య వై. పద్మజకు రుణాల రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)-2 నోటీసులు జారీచేసింది. చెన్నైలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.169 కోట్లు రుణం తీసుకుని.. చెల్లించని వ్యవహారంలో ఈ నోటీసులు పంపింది. ఆమెతో పాటు సుజనా యూనివర్సల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌కు చెందిన శ్రీనివాసరాజు, ఎస్‌టీ ప్రసాద్‌, ఆయన భార్య ధనలక్ష్మి, సుజనా కేపిటల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ప్లెయిర్‌ ఎలక్ర్టికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు తన ముందు హాజరుకావాలని ఆదేశించింది.
* పార్లమెంటులో చర్చ జరిగినా.. సీఎంకు చీమ కుట్టినట్టైనా లేదు: డీకే అరుణ
మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ మంత్రి డీకే అరుణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11, 12వ తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల పాటు ‘మహిళ సంకల్ప దీక్ష’ చేయనున్నారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించకపోవటం బాధాకరమన్నారు.దిశ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరిగినా.. సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని డీకే అరుణ విమర్శించారు. దిశ కుటుంబాన్ని కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించే సమయం కూడా సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నారు. హైద్రాబాద్ నగరంలో ఎక్కడ చూసిన పబ్‌లు దర్శనమిస్తున్నాయన్నారు. డ్రగ్స్‌కు అడ్డాగా హైద్రాబాద్ మారిందని డీకే అరుణ విమర్శించారు.
* ప్రభుత్వం మద్యం అమ్మకాలను నియంత్రించాలి: మల్లు భట్టి
మద్యం సేవించి మృగాలుగా మారి అకృత్యాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలను నియంత్రించాలన్నారు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసే వీలు కల్పించాలని భట్టి డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ నుంచి రాజ్‌భవన్ వరకు క్యాండిల్ ర్యాలీ చేపడతామన్నారు. బెల్ట్ షాపుల రద్దు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. బస్ చార్జీల పెంపును ఖండిస్తున్నట్టు భట్టి తెలిపారు.
**చింతమడకకు మీరెంత ఇచ్చారు? కేంద్రం ఎంత ఇచ్చింది?
తెలంగాణకు కేంద్రం సాయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రానికి.. కేంద్ర చేసిన నిధుల సాయంపై గణాంకాలతో సహా చర్చకు రావాలని కేటీఆర్కు సవాలు విసిరారు. బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగించుకోలేని దుస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని రూ.లక్షల నిధులు వచ్చాయి? తెలంగాణ ప్రభుత్వం ఆ గ్రామానికి ఏ మేరకు నిధులు విడుదల చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘
*హోదా హామీ నిలబెట్టుకోండి: వైకాపా
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్సభ వేదికగా వైకాపా డిమాండ్ చేసింది. విభజన హామీలన్నీ నెరవేర్చాలని ఆపార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేసి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నారు. పూర్తిగా అప్పులతో నెట్టుకొస్తున్న నవ్యాంధ్ర తట్టుకుని నిలబడాలంటే వీలైనంత ఎక్కువ సాయం చేయాలని విన్నవించారు.
*జనసేనను విలీనం చేస్తే స్వాగతిస్తాం: జీవీఎల్
జనసేన పార్టీని భాజపాలో విలీనం చేస్తామంటే తాము కచ్చితంగా ఆహ్వానిస్తామని ఆపార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అందుకు తానే చొరవ తీసుకుంటానన్నారు. పార్లమెంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘పవన్ కల్యాణ్ను మాతో కలిసి పనిచేయాలని, జనసేనను భాజపాలో విలీనం చేయాలని ఎన్నికల ముందే కోరాం. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు మనసు మారి.. జనసేనను భారతీయ జనతాపార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పని సరిగా ఆహ్వానిస్తాం. పవన్ కల్యాణ్ ఈరోజు చేసిన వ్యాఖ్యల వల్ల అలా అనిపిస్తోంది. మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఆసక్తి చూపుతోంది. కానీ, కేవలం రాజకీయ కారణాలతో మా భుజాలపై నుంచి ఆరడుగుల బుల్లెట్ను సంధించాలనుకుంటే అది పొరపాటే అవుతుంది’’ అని జీవీఎల్ అన్నారు.
*జగన్ పాలనపై మిశ్రమ స్పందన: రామకృష్ణ
ప్రతిపక్ష నేత ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండ్తో వచ్చే నెలలో భద్రాచలం నుండి పోలవరం వరకు పాదయాత్ర చేపడుతున్నామన్నారు. 6 నెలల జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తోందని చెప్పారు.
*దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలును వ్యతిరేకిస్తాం-సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ మూలన విదేశీయులు ఉన్నా గుర్తించేందుకు అనేక పద్ధతులు ఉన్నాయన్నారు. అయినా కేంద్రం మొండిగా ముందుకెళ్తే ఊరుకునేది లేదన్నారు. కార్మిక సంఘాలు జనవరి 8న చేపట్టే దేశవ్యాప్త బంద్కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.
*‘భారత్ బచావో’కు రాష్ట్రం నుంచి 4 వేల మంది దిల్లీకి రాని నాయకుల పదవులు తొలగింపు: కుంతియా
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఈ నెల 14న దిల్లీలోని రామ్లీలా మైదానంలో తలపెట్టిన ‘భారత్ బచావో’ ర్యాలీ, సభకు తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా ఆదేశించారు. పార్టీ పదవుల్లో ఉండి, ర్యాలీకి రాని వారి పదవులు తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. బుధవారం ఆయన గాంధీభవన్లో ముఖ్య నాయకులతో సమావేశమై దిల్లీ సభ గురించి సమీక్షించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10 మంది నాయకులతో పాటు మొత్తం 23 విభాగాల నుంచి దాదాపు 4 వేల మంది నాయకులు దిల్లీకి తరలి రావాలని కుంతియా స్పష్టం చేశారు.
*ఆర్థిక మందగమనంపై ప్రతిపక్షాల ఆందోళన
కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ మాట్లాడుతూ అన్ని రంగాల గణాంకాలూ తిరోగమనాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ మాట్లాడుతూ ముద్రా రుణాల్లో మొండి బకాయిలు అధికంగా ఉంటున్నాయని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆర్థిక రంగం పట్టాలు తప్పిందన్న ఆరోపణలను ఖండించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.21,240 కోట్ల వ్యయానికి సభ ఆమోదం తెలిపింది.
*జనసేన అధినేతది అవకాశవాదం: సీపీఎం
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా లాంటి వారే దేశానికి కావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం రాజకీయ అవకాశవాదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిపోయి ఈ తరహా ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు.
*పవన్కల్యాణ్ క్షమాపణ చెప్పాలి
ఆడపిల్లల మానప్రాణాలంటే జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ఎంత చులకనో ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోందని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించకుండా బెత్తంతో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళలకు పవన్ క్షమాపణ చెప్పాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
*అసెంబ్లీలో తెదేపాను తిప్పికొట్టాలి
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9న ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష తెదేపా ఏ అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది? ప్రభుత్వం తరఫున వాటికి దీటుగా సమాధానం ఎలా ఇవ్వాలి? ఎవరు(మంత్రులు/ఎమ్మెల్యేలు)ఇవ్వాలనే అంశంపై అధికార వైకాపా కసరత్తు చేస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో, అసెంబ్లీలోని వైకాపా శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన వైకాపా వ్యూహ కమిటీ సమావేశాల్లో ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రులు, శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. తెదేపా లేవనెత్తే అంశాల్లో లొసుగులను పట్టుకుని గట్టిగా తిప్పికొట్టేందుకు అంశాలవారీగా ఏ ఎమ్మెల్యే అయితే సరిపోతారనే జాబితాను సిద్ధం చేశారు.