Politics

యార్లగడ్డ వెంకట్రావుకు కేడీసీసీబీ కిరీటం

NRI YSRCP MLA Candidate Yarlagadda Venkatarao Gets KDCCB

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పర్సన్ఇన్‌ఛార్జిల కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్గరముఖ ప్న్నరవాసాంధ్వరులు వైకాపా నాయకుడు యార్లగడ్డ వెంకట్రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులైతో ఆ బ్యాంకు పాలకమండలి గడువు ముగిసింది. అప్పటి నుంచి నాలుగు నెలలు ఖాళీగా ఉంది. వీరి స్థానంలో రెండు నెలల క్రితం కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ను పర్సన్‌ ఇన్‌ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం యార్లగడ్డను నియమించింది. ఆయనతో పాటు కొమ్మినేని రవిశంకర్‌, నల్లమోతు కోటిసూర్యప్రకాష్‌రావు, వేములకొండ రాంబాబు, ఎల్‌. జేత్య, జి.పెదవెంకయ్య, పడమట సుజాతలను సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు వారు బాధ్యతలను స్వీకరించనున్నారు.

***ముఖ్యమంత్రి భరోసా మేరకే..
పెనమలూరు నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు బీఎస్సీ పూర్తి చేశారు. అమెరికాలో ఐటీ సంబంధిత కంపెనీలు స్థాపించారు. అతని భార్య జ్ఞానేశ్వరీ, కుమార్తె శ్రీసహస్ర, కుమారుడు సహర్ష్‌. యార్లగడ్డ 2017లో వైకాపాలో చేరారు. అదే ఏడాది వైకాపా గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. అప్పట్నుంచీ గన్నవరం కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అతను వైకాపా తరఫున అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి తెదేపా నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల సమయంలో వారి మధ్య వాట్సాప్‌ సందేశాల యుద్ధం జరిగింది. దీనిపై ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాకు దగ్గరయ్యారు. దీనిపై యార్లగడ్డ తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయనను మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సమయంలో అతని రాజకీయ భవిష్యత్తుకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు ఈ పదవి కేటాయించారని యార్లగడ్డ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తనపై ఉన్న నమ్మకంతోనే ఈ పదవి అప్పగించారన్నారు. చాలా సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

*** జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ కార్యవర్గం
కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ ఛైర్మన్‌గా ఉప్పాల రాంప్రసాద్‌, సభ్యులుగా కిలరావం శ్రీనివాసరావు, చందన ఉమామహేశ్వరరావు, బండి జానకి రామయ్య, మొక్కపాటి శ్రీనివాసరావు, రేమాల సుబ్బారావు, గింజుపల్లి రవికుమార్‌లను నియమించారు.