WorldWonders

పోక్సో నిందితులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదు

Indian President Ramnath Kovind Speaks On POKSO Rapist Plea Deal-పోక్సో నిందితులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదు

పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడిన దోషుల క్షమాభిక్ష పిటిషన్ల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన రాజస్థాన్‌లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. పోక్సో చట్టం కింద అత్యాచార కేసుల్లో ఉరి శిక్షపడిన దోషులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదు. అలాంటి పిటిషన్లపై పార్లమెంట్‌ పునః సమీక్షించాలి’’ అని కోవింద్‌ అన్నారు. లైంగిక దాడులు, వేధింపుల బారి నుంచి బాలబాలికల్ని రక్షించేందుకు పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళా భద్రత గురించి ఎన్నో చేశామని, ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాష్ట్రపతి అన్నారు. పిల్లల్లో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రిపైనా ఉందని చెప్పారు. సమాజంలో సమానత్వం, సామరస్యత.. మహిళా సాధికారతతోనే సాధ్యమని ఆయన అన్నారు. నిర్భయ కేసులో ఉరి శిక్షపడ్డ నిందితుల్లో ఒకరైన వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్న వేళ రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.