WorldWonders

15ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్ సాయంతో కలిసింది

vijayawada girl meets parents after 15 years via facebook help-15ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్ సాయంతో కలిసింది

నాలుగున్నరేళ్ల వయసులో కుటుంబానికి దూరమైంది. కన్నవారికి, సొంత ఇంటికి దూరంగా 15 ఏళ్లు పెరిగింది. చిన్నతనంలోనే తప్పిపోవడంతో తనకున్న కొద్దిపాటి జ్ఞాపకాలతో కుటుంబసభ్యులెవరో తెలుసుకోగలిగింది. దీనికి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వేదిక కావడం గమనార్హం. ఓ వీడియో కాల్‌ ఆమెను.. సొంతవారికి చేరువ చేసింది. కన్నతల్లిని కలుసుకోబోతున్నానన్న సంతోషం ఓవైపు.. ఇన్నేళ్లు తనను కంటికిరెప్పలా కాపాడి, పెంచి పెద్దచేసిన తల్లిని వదిలి వెళ్లాలంటే కలిగే బాధ మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ పడమటలంకలో వెలుగుచూసిన ఈ సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విజయవాడ పడమటలంక వసంత సదన్‌ అపార్ట్‌మెంట్‌లో వంశీధర్‌ కుటుంబం నివాసం ఉంటోంది. వంశీ ఇంట్లో పనిచేస్తున్న జయరాణి పడమటలంకలో ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆమె స్వస్థలం. 15 ఏళ్ల క్రితం జయరాణి హైదరాబాద్‌లో పనికి వెళ్లిన సమయంలో ఓ ఇంటి వద్ద భవానీ కనిపించింది. భవానీ గురించి చుట్టుపక్కల వారిని వివరాలు అడిగినప్పటికీ ఎవరూ ఏమీ చెప్పలేదు. చిన్నారిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో జయరాణి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన జయరాణి 15 ఏళ్లుగా ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

జయరాణి పనిచేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో మొదటిసారి యజమాని వంశీ, అతని భార్య కృష్ణకుమారికి పరిచయం చేసింది. భవానీది చిన్నవయసు కావడంతో ఆమె గురించి వివరాలను వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని.. తనకు గుర్తు ఉన్నంతవరకు కుటుంబసభ్యుల వివరాలను చెప్పింది. భవానీ చెప్పిన వివరాలను వంశీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో భవానీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూసిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కుటుంబం ఫేస్‌బుక్ ద్వారా వంశీకి వీడియోకాల్‌ చేశారు. వీడియోకాల్‌ చేసిన వ్యక్తిని తన సోదరుడిగా భవానీ గుర్తుపట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా వీడియోకాల్‌ ద్వారా భవానీతో మాట్లాడారు. త్వరలోనే కన్నతల్లిదండ్రులను కలుస్తానని భవానీ ఆనందం వ్యక్తం చేసింది. భవానీ సమాచారం తెలిసిన తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మీ, సోదరులు సంతోష్‌, గోపి విజయవాడకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామం భవానీ స్వస్థలం. భవానీ తల్లిదండ్రులు గతంలో హైదరాబాద్‌లో కూలీపనులు చేసేవారు.