Movies

నూజివీడు-విస్సన్నపేట మధ్య ఫిలిమ్‌సిటీ

Andhra Pradesh Film City To Be Set Up Between Nuzvid Vissannapeta

ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ఘాటింగులు జరుపుకునే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో స్టూడియోలు నిర్మించాలని, అందుకు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వపరంగా సహకరించాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంలోనే కొందరు తెలుగు సినిమా పెద్దలు ఏపీ ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తే, ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు, స్టూడియోలు, ఇతర విభాగాల నిర్మాణాలకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకుంటే అనుమతులు ఇవ్వగలమని సూచించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఈ మేరకు సినీ పెద్దలు స్థలాన్వేషణ కోసం నూజివీడు విసన్నపేట మధ్య ప్రాంతాన్ని ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత నవంబరు నెలలో కొందరు సినీ ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించగా, ఈ నెలలో మరికొందరు పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఇక్కడ పర్యటించి వెళ్ళారు. రాజధాని నగరం చేరువగా ఉండటం, కేవలం 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో బాటు ఇక్కడ దట్టంగా ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్, చుట్టూ ఉన్న కొండలు, కొండల మధ్య చిన్నచిన్న తండాలు, కూతవేటు దూరంలో మచిలీపట్నం బీచ్ చిత్ర నిర్మాణానికి అనువైన లొకేషన్లు గా వారు సంతృప్తి వ్యక్తం చేశారట. పైగా ఇక్కడ భూముల ధరలు తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఈ ప్రాంతానికే మొగ్గు చూపించినట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు పరిశ్రమ పెద్దలు స్థానిక రైతులతో లావాదేవీలు జరిపినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా – టాలీవుడ్ దిగ్గజాలైన అక్కినేని కుటుంబం, నందమూరి కుటుంబం, మెగాస్టార్ కుటుంబం ఇప్పటికే ఇక్కడి భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ సినీ హీరో ఈ ప్రాంతంలో స్వంతంగా స్టూడియో నిర్మించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారనీ, అందుకోసం వెయ్యి ఎకరాలకు సేకరించాలని ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ పెద్దల కోరిక మేరకు ఇక్కడి ప్రాంతాన్ని ఫిల్మ్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పెద్దలు నూతన ప్రాయంగా సమ్మతి తెలిపినట్లు తెలిసింది. ట్రాన్స్ పోర్ట్ టేషన్ కు అనువుగా ఈ ప్రాంతాన్ని విజయవాడ, మచిలీపట్నం లతో కలుపుతూ ఉన్న రహదారులను వంద అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిసింది. మంచి నీటి వసతి కల్పన కోసం కృష్ణా జిల్లాలను ఇక్కడికి నేరుగా రప్పించేందుకు వీలుగా ప్రత్యేక పైప్ లైన్లు వేస్తూ, హైకెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణాలను నూతన ప్రాయంగా సమ్మతి తెలిపారని తెలియవచ్చింది. గత ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసిన ఓ సినీ ప్రముఖుడు టాలీవుడ్ ప్రముఖులతో ఈ విషయమై విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున భూములను సమీకరిస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై మరికొద్ది నెలలలో పూర్తి స్పష్టత వస్తుందని భావించవచ్చు.పైగా ఈనాడు పత్రిక,ప్రియా ఫుడ్స్ అధినేత రామోజీరావుకు ఈ ప్రాంతంలో వందల ఎకరాలు భూములు ఉన్నాయి.