DailyDose

ప్రభుత్వానికి నేనంటే భయం:పవన్-తాజావార్తలు-12/08

Pawan Kalyan Says AP Govt Is Scared Of His Trip-Telugu breaking News-12/08

* మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి దురాగతాలను అరికట్టడం సాధ్యమని చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌, ఉన్నావ్‌లో మహిళలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇక్కడి సింబియాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడారు.

* దిశ హత్యకేసు, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ‘దిశ’ తండ్రి, సోదరి ఎన్‌హెచ్‌ఆర్‌సీబృందం ఎదుట హాజరయ్యారు. శంషాబాద్‌లోని దిశ నివాసానికి వచ్చిన పోలీసులు.. ప్రత్యేక ఎస్కార్ట్‌ వాహనంలో వారిని రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి తీసుకెళ్లారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం అరగంటపాటు దిశ తండ్రి, సోదరిని విచారించి వివరాలు సేకరించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఘటన జరిగినరోజు, ఆ తర్వాతి రోజు పరిణామాలపై ఆరా తీశారు.

* సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా తాము భావించడం లేదని చెప్పారు. గుంటూరులోని కొరిటిపాడులో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మద్య నిషేధంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని.. జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలు కుదుటపడుతున్నాయని చెప్పారు.

* సీపీఐ జాతీయ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడారు.‘‘ రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించాం. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకొచ్చారు. మోదీ, అమిత్‌ షా… జమ్ముకశ్మీర్‌ పరిస్థితులను పూర్తిగా అవగతం చేసుకోలేదు. ఎన్‌ఆర్‌సీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ప్రధాని మోదీ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు తీసుకురావాలని చూస్తున్నారు’’ అని చెప్పారు.

* రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు పథకాలు అమలు చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఈనెల 12న కాకినాడలో దీక్ష చేస్తానని.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా చేయిదాటతాయో చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పవన్‌ మాట్లాడారు. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. అరుపులు, కేకలతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పవన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసైనికులకు క్రమశిక్షణ లేకే ఓడిపోయానని ఆయన వ్యాఖ్యానించారు.

* హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ విషయమై చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని సలహాలు కోరుతూ రాష్ట్రాలకు లేఖ రాసిన తర్వాత రోజే అమిత్‌షా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా హత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాల్సిన విషయాన్ని అమిత్‌షా నొక్కిచెప్పారు.

* దేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే విషయంలో సూచనలిస్తూ ఓ పత్రికలో వ్యాసం రాసిన ఆయన.. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)పై విమర్శలు గుప్పించారు. అధికారాలన్నీ పీఎంవోలోనే కేంద్రీకృతమయ్యాయని విమర్శించారు. మంత్రుల చేతిలో అధికారం లేకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.

* వైకాపా ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడును తింటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆయన.. మండపేట నియోజవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం రైతులతో మాట్లాడారు. గతంలో నేతలంతా ఓట్ల కోసం పాదయాత్రలు చేశారని, కానీ రైతుల కన్నీరు తుడిచేందుకు ఇప్పుడు పాదయాత్రల అవసరముందని పవన్‌ అన్నారు. ‘జిల్లాలో నా పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వం భయపడింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.80 కోట్లను ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసింది’ అని పవన్‌ అన్నారు.

* చటాన్‌పల్లి వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’ తల్లిదండ్రులకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి పిలుపొచ్చింది. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని కోరింది. కేసు విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి తీసుకెళ్లేందుకు పోలీసులు శంషాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. దిశ దశదిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని తొలుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని.. ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు.

* తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కోసం తిప్పలు తప్పడం లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఒంగోలు రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో మరింత రద్దీ అధికమైందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

* దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు చాకచక్యం ప్రదర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై భవనంలోకి వెళ్లి 11 మంది ప్రాణాలు రక్షించారు. దిల్లీ అగ్నిమాపక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్‌ శుక్లా ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంతో సాహసం ప్రదర్శించి అందరికన్నా ముందు అనాజ్‌ మండీ భవనంలోకి ప్రవేశించారు. అనంతరం మంటల్లో చిక్కుకున్న 11 మందిని ప్రమాదం నుంచి బయట పడేసి, ప్రాణాలు కాపాడగలిగారు. ఈ క్రమంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

* దేశరాజధాని దిల్లీలోని అనాజ్‌మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 43 మంది వరకు దుర్మరణం చెందారు. దిల్లీ చరిత్రలో ఉపహార్‌ సినిమా అగ్ని ప్రమాదం తర్వాత ఇదే అతి పెద్దది. ఈ ఘటనలో దాదాపు వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేజ్రీవాల్‌ రూ.10లక్షలు పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు కేంద్రం నుంచి పీఎం సహాయనిధి కింద రూ.2లక్షలు పరిహారాన్ని అందించనున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

* ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వాహనాల ఉత్పత్తిని పెంచింది. నవంబర్‌లో 4.33 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. డిమాండ్‌లేమి కారణంగా గత తొమ్మిది నెలలుగా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చిన ఆ కంపెనీ.. తొలిసారి ఉత్పత్తిని పెంచడం గమనార్హం. నవంబర్‌ నెలలో మొత్తం 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో ఆ కంపెనీ 1,35,946 యూనిట్లను ఉత్పత్తి చేసింది.

* వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులపై కన్నేశారు. పొట్టిఫార్మాట్‌లో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ సిక్సర్‌ దూరంలో మాత్రమే నిలిచాడు. హిట్‌మ్యాన్‌ మరో సిక్సర్ బాదితే టీ20ల్లో 400 సిక్సర్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ (534), పాక్‌ మాజీ ఆటగాడు షాహీద్‌ అఫ్రీది (476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్‌ 399 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

* పోలెండ్‌లోని ఓ వాస్తుశాస్త్ర మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి ‘శొంఠిపొడి నగరం’ సందర్శకులను నోరూరిస్తోంది. ఐరోపాకు చెందిన వంద మందికి పైగా భవన నిర్మాణవేత్తలు దీనిని రూపొందించారు. ఇందులో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఆర్ట్‌ గ్యాలరీలు, రైల్వే ట్రాక్‌లను ఆర్కిటెక్ట్‌లు ఏర్పాటు చేశారు. లండన్‌ పార్లమెంటు భవనానికి కూడా ఈ కళాఖండంలో స్థానం కల్పించారు.

* దిల్లీలోని అనాజ్‌మండి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై విపక్షాలు ఆప్‌ ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించాయి. ఈ ప్రమాదానికి దిల్లీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశాయి. సంఘటనా స్థలిని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీతో కలిసి పరిశీలించిన భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ మాట్లాడుతూ.. వీధిలో విద్యుత్‌ తీగలు వేలాడడంపై పదే పదే ఫిర్యాదులు అందినా కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు.