Health

కాలుష్యంతో కంటి వ్యాధులు

Pollution Attacks On Eyes Causing Glaucoma And Other Diseases

వాతావరణంలోని కాలుష్యం కారణంగా గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువ అని యూనివర్సిటీ ఆఫ్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు కోట్లమంది గ్లకోమా కారణంగా అంధత్వం బారిన పడుతున్నారు. కంటి నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేసే ఆప్టిక్‌ నాడి దెబ్బతినడంతో కంటిలో ఒత్తిడి పెరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధే గ్లకోమా. సాధారణంగా గ్లకోమాకి పెద్దవయసు లేదా జన్యువులే కారణం అని ఇంతవరకూ భావిస్తూ వచ్చారు. మొట్టమొదటగా కంట్లో ఒత్తిడి పెరగడంతోబాటు మరో కారణాన్ని గుర్తించారు. కంటిపరీక్షల్లో భాగంగా లక్షన్నర మంది రెటీనా స్కాన్‌లను పరిశీలించినప్పుడు- గ్లకోమాకి గురయిన వాళ్లలో ఎక్కువమంది కాలుష్య ప్రదేశాల్లో నివసిస్తున్నట్లు తేలిందట. ఈ కాలుష్యంవల్ల కంట్లో ఒత్తిడి పెరగడం లేదు కానీ రక్తనాళాలు కుంచించుకుపోవడంతో గ్లకోమాకి దారితీస్తుండవచ్చు లేదా హానికర రసాయనాలేవయినా నేరుగా కంట్లోకి వెళ్లడంతో నాడీవ్యవస్థ దెబ్బతిని కూడా ఈ సమస్య తలెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా వాతావరణ కాలుష్య కారణంగా గుండె, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నట్లే ఆ జాబితాలోకి గ్లకోమా కూడా చేరిందనీ ఆ కారణంతోనే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నివసించేవాళ్లలోనే 50 శాతం ఎక్కువగా గ్లకోమా కేసులు ఉంటున్నాయనీ వివరిస్తున్నారు.