DailyDose

కేసీఆర్‌కు జగన్ హ్యాట్సాఫ్-తాజావార్తలు-12/09

AP CM YS Jagan Appreciates TG CM KCR In Assembly-Telugu breaking News-12/09-కేసీఆర్‌కు జగన్ హ్యాట్సాఫ్-తాజావార్తలు-12/09

* రాష్ట్రంలో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం’ పేరిట కొత్త పాలనశాఖ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల అంశంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది.

* హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దిశ ద్విచక్రవాహనాన్ని పంక్చర్‌ చేసిన నలుగురు నిందితులు ఆమెను కిరాతకంగా హతమార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ పోలీసు అధికారులకు చట్టసభ వేదికగా జగన్‌ హ్యాట్సాఫ్ చెప్పారు.

* ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలను మాఫీ చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2019 మార్చి వరకు ఎడ్యుకేషన్‌ లోన్‌లు రూ. 67,685.59 కోట్ల నుంచి రూ. 75,450.68కోట్లకు పెరిగాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

* రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్వేత పత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నుంచి బకాయిల తెలంగాణగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. కేసీఆర్‌ చేతిలో సంపన్న రాష్ట్రం పెడితే ఆయన అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ విధానాల వల్లనే రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* 2020 టోక్యో ఒలింపిక్స్‌, 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ సహా మరే ప్రపంచపోటీల్లో పాల్గొనకుండా రష్యాపై వేటుపడింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనను ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. డోపింగ్‌ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇవ్వడమే ఇందుకు కారణం.

* ఐక్యరాజ్యసమితి సోమవారం విడుదల చేసిన 2019 మానవాభివృద్ధి సూచీలో భారత్‌ కాస్త మెరుగుపడి ఒక స్థానం పైకి ఎగబాకింది. 2018 సంవత్సరంలో భారత్‌ 0.647 మానవాభివృద్ధి విలువతో 130వ ర్యాంకులో ఉండగా.. ప్రస్తుతం ఒక మెట్టు పైకెక్కి 189 దేశాలకు గానూ 129వ స్థానంలో నిలిచింది.

* ఉల్లిధరలపై తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరా తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటాయని.. అకాల వర్షాల కారణంగా పంట చేతికి రాక ఇబ్బందులు ఎదురవుతుంటే ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మోపిదేవి మీడియాతో మాట్లాడారు. ఉల్లి ధరల విషయంలో తొలిసారిగా స్పందించి రాయితీపై విక్రయిస్తున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు.

* ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో గాయపడిన ఎస్సై, కానిస్టేబుల్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం విచారించింది. గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌లను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు ప్రశ్నించారు. వివిధ అంశాలపై వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

* డిసెంబర్‌ 11 నుంచి చైనాలో జరిగే బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ 2019లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు అతికష్టం మీద చోటు దక్కించుకుంది. చైనా క్రీడాకారిణులు చెన్‌ యుఫీ, హీ బింగ్జియో, జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిలతో కలిసి గ్రూప్‌ ఏలో స్థానం సంపాదించింది. బుధవారం తొలి మ్యాచ్‌లో యమగుచితో తలపడనుంది.

* యమహా సరికొత్త మోటార్‌ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన వైజెడ్‌ఎఫ్‌ ఆర్‌15 వీ3.0ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.45లక్షలుగా నిర్ణయించింది. బీఎస్‌4 వెర్షన్‌తో పోల్చుకొంటే సరికొత్త బైకు రూ.2,000 ధర ఎక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యమహా డీలర్ల వద్ద ఇది అందుబాటులో ఉంటుంది.

* కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో భాజపా 12 చోట్ల జయభేరీ మోగించింది. ఇక కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాలకే పరిమితమవగా.. జేడీఎస్‌ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

* చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ నుంచి ఏసీ వాహనాల్లో గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. ఎన్‌కౌంటర్‌పై దాఖలైన రెండు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఘటన జరిగిన సాయంత్రం ప్రజా సంఘాలు లేఖ రాస్తూ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరాయి.

* దేశ ప్రజలు భాజపాను ఏ స్థాయిలో విశ్వసిస్తున్నారో నేటి కర్ణాటక ఫలితాలతో తేలిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత భాజపాతోనే సాధ్యమని ప్రజలు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారన్నారు. తమ పార్టీకి భారీ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భాజపాకు దక్షిణాదిన స్థానం లేదని విమర్శించిన వారికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.

* కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మొదలైంది. సీఎల్పీ నేతగా ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. కర్ణాటకలో 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

* మ్యాగ్‌స్ట్రైప్‌తో ఉన్న డెబిట్‌ కార్డులను డిసెంబర్‌ 31 తర్వాత ఎస్బీఐ బ్లాక్‌ చేయనుంది. వాటి స్థానంలో కొత్త ఈఎంవీ చిప్‌ అండ్‌ పిన్‌ బేస్డ్‌ డెబిట్‌ కార్డులను తీసుకోవాలని సూచించింది. ఈ నెల 31లోపు మ్యాగ్‌స్ట్రైప్‌కార్డులను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం మ్యాగ్‌స్ట్రైప్ కార్డు ఉన్న ఖాతాదారులు కొత్త తరహా కార్డుల కోసం తమ హోంబ్రాంచిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్‌గా మారాలని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. దిశ ఘటన తర్వాత తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే దేశమంతా ఈ అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేస్తారు? మనకు ఎలా భద్రత కల్పిస్తారని మహిళలంతా ఎదురు చూస్తున్నారన్నారు.

* షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన నిందితులు ఈ నెల 6న చటాన్‌పల్లి వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఇప్పటికే రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డికి అప్పగించగా.. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

* పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఉల్లికోసం క్యూలో నిలబడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతకు ఇది నిరద్శనమన్నారు. సచివాలయం సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 30, 40 రోజుల నుంచి సమస్య ఉన్నా సీఎం జగన్‌ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని ఏం చేశారో చెప్పాలని రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

* దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఈ డిసెంబర్‌ 10 నుంచి అమల్లోకి రానుంది. ఎస్‌బీఐ అనుసంధానిత ఎంసీఎల్‌ఆర్‌కు(మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌) అనుసంధానించిన కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. తాజా తగ్గింపుతో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ 8.00శాతం నుంచి 7.90శాతానికి తగ్గింది.

* అమ్మకాల ఒత్తిడి.. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, వడ్డీరేట్లపై ఆర్‌బీఐ నిర్ణయాలు తదితర కారణాలతో దేశీయ మార్కెట్లు సోమవారం లాభనష్టాల్లో ఊగిసలాడాయి. తీవ్ర ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ స్వల్పంగా 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.09గా కొనసాగుతోంది.