Agriculture

ఆధార్ ఉంటేనే రైతులకు ప్రధాని నిధులు

Link Between Aadhar And Bank Accounts Is Mandatory For PM Funds To Indian Farmers-ఆధార్ ఉంటేనే రైతులకు ప్రధాని నిధులు

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన నిధులు కావాలంటే బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆంగ్లపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఒక కథనంలో వెల్లడించింది. కాకపోతే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
ఇప్పటి వరకు ఈ పథకానికి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించలేదు. నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం రూ.10 వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి డిమాండ్‌కు ఊతమివ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ చర్య తీసుకుంటోంది.
‘‘ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ ఖాతాలకే నాలుగో విడత ‘కిసాన్‌ సమ్మాన్‌’ సొమ్ము లభిస్తుంది. ఈ సారి దాదాపు రూ.10వేల కోట్లను ఒకేరోజు అందజేసే అవకాశాలు ఉన్నాయి.’ అని ఒక వ్యవసాయ శాఖ అధికారి వెల్లడించినట్లు ఆంగ్లపత్రిక పేర్కొంది.
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 మొత్తాన్ని చెల్లిస్తుంది. దీనిని మొత్తం 4 వాయిదాల్లో రైతులకు అందజేస్తుంది. 2019-2020 మార్చిలోపు ఈ వాయిదాలను రైతులకు బదిలీ చేయాల్సి ఉంది.