Sports

రష్యాపై డోపింగ్ దెబ్బ. నాలుగేళ్లు ఆల్ బంద్.

Russia Banned For Four Years From Participating In Olympics And International Games

అనుకున్నదే జరిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌, 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ సహా మరే ప్రపంచపోటీల్లో పాల్గొనకుండా రష్యాపై వేటుపడింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనను ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. డోపింగ్‌ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇవ్వడమే ఇందుకు కారణం.

‘ప్రతిపాదనల పూర్తి జాబితాకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది’ అని వాడా అధికార ప్రతినిధి జేమ్స్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ తెలిపారు. ‘రష్యా డోపింగ్‌ నిరోధ సంఘంపై నాలుగేళ్ల నిషేధాన్ని వాడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మూకుమ్మడిగా ఆమోదించింది’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రూలింగ్‌ ప్రకారం రష్యా క్రీడాకారులు తటస్థులుగా ఉంటేనే ఒలింపిక్స్‌కు అనుమతిస్తారు. ఐతే ప్రభుత్వ ప్రోత్సాహక డోపింగ్‌ వ్యవస్థలో భాగస్వాములు కాలేదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. 2011-15 కాలంలో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందని మెక్‌లారెన్‌ స్వతంత్ర నివేదిక 2016లో బయటపెట్టింది.