DailyDose

కొత్త రేషన్ కార్డులకు సర్వే తప్పనిసరి-తాజావార్తలు-12/10

Survey Participation Is Mandatory For New Ration Cards-Telugu Breaking News-12/10

* ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడీవేడిగా కొనసాగాయి. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తర్వాత రూ.88వేల కోట్ల రుణాలను రూ.24వేల కోట్లకు కుదించారని ఆర్థిక మంత్రి బుగ్గన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేసి చూపించామని తెదేపా అధినేత చంద్రబాబు బదులిచ్చారు. ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. వైకాపాను నమ్మి ప్రజలు మోసపోయారని ఆక్షేపించారు.

* పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోటును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ నోటును ఉపసంహరించుకోనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

* నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-48 కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిరంతరాయంగా 23 గంటల పాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం 3.40గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-48 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 11 ఉపగ్రహాలను ఈ వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌ అత్యాచార నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో దిల్లీ న్యాయస్థానం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం దిల్లీ న్యాయస్థానంలో తమ వాదనలు ముగించింది. దీంతో దిల్లీ న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. డిసెంబర్‌ 16న తీర్పును వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి ధర్మేష్‌ శర్మ వెల్లడించారు.

* పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ఎంపీలు కేంద్రాన్ని కోరారు. పోలవరంపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చలో భాగంగా ఈమేరకు అభ్యర్థించారు. పోలవరం నిర్మాణంపై కేంద్రం బాధ్యత తీసుకోవాలని కేవీపీ కోరారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు పోలవరం నిర్మాణంపై ప్రశ్నలు లేవనెత్తారు.

* రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ నిందితుల పాపాలకు ఎన్‌కౌంటర్‌లు పరిష్కారం కాదు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దిశ హత్య జరిగింది. పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశ ఘటనపై న్యాయవిచారణ జరపాలి’’ అని జీవన్‌ రెడ్డి అన్నారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్‌, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సందర్శించారు. కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద గోదావరి జలాల ఎత్తిపోత జరిగే విధానం, ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ తక్కువ సమయంలో అద్భుత నిర్మాణం చేశారని ప్రాజెక్టు ఇంజినీర్లను అభినందించారు.

* పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ మరో కొత్తప్రతిపాదనతో ముందుకు వచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకూ పౌరసత్వం కల్పించాలని కోరారు. ‘‘ శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చి గత 35ఏళ్లుగా భారత్‌లో నివాసముంటున్న లక్ష మంది తమిళులకూ పౌరసత్వం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిగణించాలని కోరుతున్నాను’’ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.

* సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఎన్నికయ్యారు. సుగంధ ద్రవ్యాల బోర్డులో రాజ్యసభ నుంచి ఒకరు, లోక్‌సభ నుంచి ఇద్దరు ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ నుంచి జీవీఎల్‌ ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఉంటారు.

* కొత్తగా రేషన్‌ కార్డు పొందకోరు లబ్ధిదారులు విధిగా గ్రామ/వార్డు వాలంటీర్లకు తమ వివరాలు తెలియజేసి సర్వే చేయించుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంక్షేమ పథకాలన్నింటికీ ప్రత్యేక గుర్తింపు కార్డుల జారీకి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలోని 11.33 లక్షల రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెల నిత్యవసర సరకులు పంపిణీ చేస్తున్నామని, ఈ రేషన్‌ కార్డు కుటుంబాలను సర్వే చేసి నూతనంగా రైస్‌ కార్డుల జారీకి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 83.29 శాతం సర్వే పూర్తైందని, మిగిలిన 16.71 శాతం రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేని లబ్ధిపొందుతున్న కుటుంబాలు పట్టణంలో మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం, మండలంలో సంబంధిత తహసీల్దారు కార్యాలయాలకెళ్లి సంబంధిత వార్డు కార్యదర్శి/గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించి తమ వివరాలను సర్వే వారికి తెలియజేయాలని చెప్పారు. సర్వే పూర్తయిన వారికి జనవరి నెలలో కొత్తగా రైస్‌ కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ కార్డులు నిత్యవసర సరకులను కొనుగోలుకు మాత్రమే వినియోగించాలని, ఇతర సంక్షేమ పథకాలకు వర్తించదన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరకు 10పైసలు పెంచారు. అయితే మొదటి రెండు స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు లేదు. సిటీ, ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపులేదు. ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 20 పైసలు పెంచారు.

* మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చిన G5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పించింది. మెట్రోలో షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ను మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌తో ఇంటర్నెట్‌ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది.

* కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో తెలిపారు. అధికరణ 370 రద్దు తర్వాత నిర్బంధంలోకి తీసుకున్న వారి విడుదల అంశాన్ని స్థానిక పాలనా యంత్రాంగమే చూసుకుంటుందని వివరించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. వారిని ఒక్కరోజు కూడా అదనంగా నిర్బంధంలో ఉంచబోమని.. స్థానిక యంత్రాంగం ఆదేశించిన వెంటనే విడుదల చేస్తామని తెలిపారు.

* దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా తెరాస ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

* పొరుగు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే దిశగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా శివసేన ఓటెయ్యడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లుపై ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘ఈ బిల్లుకు ఎవరైనా మద్దతిచ్చారంటే దానర్థం.. దేశ పునాదిపై దాడి చేసి నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లే’ అని దుయ్యబట్టారు.

* ఏపీ శాసనసభ నిర్వహణ తీరును తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాట్లాడించటం శాసనసభ చరిత్రలో దుర్దినమని నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ బయట తెదేపా నేతలు టీడీఎల్పీ ఉపనేత బుచ్చయ్య చౌదరి, పార్టీ సీనియర్‌ నేత చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ వంశీని ప్రత్యేక సభ్యునిగా ఎలా గుర్తిస్తారు? అని వారు ప్రశ్నించారు.

* ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల బాటలో ఇప్పుడు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా పయనిస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌తాజాగా ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను అత్యధికంగా 20 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు వివిధ కాలవ్యవధి రుణాలపై వివిధ రకాలుగా ఉండనుంది. నెలవారీ రుణాలపై 20బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.65శాతం వడ్డీరేటుకు రానుంది.. ఇక మూడునెలలు.. ఆరునెలల ఎంసీఎల్‌ఆర్‌లు 7.80శాతం, 8.10శాతంగా ఉన్నాయి.

* పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న శివసేన.. సోమవారం లోక్‌సభలో ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ నేత చేసిన ట్వీట్‌తో మళ్లీ యూటర్న్‌ తీసుకుంది. రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వబోమని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా స్పష్టం చేశారు.

* పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్)చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. బిల్లుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ధృవీకరించగినవి కావని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ) గానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) గానీ.. ఈ రెండింటిలో ఏదీ కూడా భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించవని పేర్కొన్నారు.

* దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ బేర్‌మంది. విదేశీ మదుపర్లు పెట్టబడులకు మొగ్గుచూపినప్పటికీ.. దిగ్గజ షేర్లలో అమ్మకాలతో దేశీయ మార్కెట్లు విలవిల్లాడాయి. భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 247 పాయింట్లు పతనమై 40,240 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 81 పాయింట్లు నష్టపోయి 11,857 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.92గా కొనసాగుతోంది.