ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ గురించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంగా తెలియజేశారు. ‘దాదాపు రూ.50,000 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో 100 శాతం వాటాను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100శాతం వాటా విక్రయానికి ఎయిరిండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం(ఏఐఎస్‌ఏఎం) కూడా అంగీకరించింది’అని ఆయన తెలిపారు. 2018-19 సంవత్సరంలో ఎయిరిండియా నష్టం రూ.8,556.35కోట్లుగా ఉంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అప్పుల బారిన పడ్డ సంస్థను కాపాడేందుకు ఐదేళ్లు సమయం ఇవ్వాలన్న పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫారసును విస్మరించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిపాదిత అమ్మకం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియాను 100శాతం ప్రైవేటుపరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందనే విషయాన్ని మంత్రి హర్‌దీప్ గత ఆగస్టులోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎయిరిండియా 100శాతం ప్రైవేటీకరణ

Related tags :