WorldWonders

12 ఏళ్ల కిందటి శవానికి ఇప్పుడు పంచనామా

12 Years Old Dead Body To Be Post Mortemed For Evidence-Telugu World Wonders

దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయేషామీరా హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయేషా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం తెనాలి చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహిస్తారు. కేసును సీబీఐకి అప్పగించినందున ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు. 2007 డిసెంబరు 27న విజయవాడ ఇబ్రహీపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మొదటి నుంచి పలు మలుపులు తీసుకుంది. నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు విద్యార్థి, సామాజిక సంఘాలు ఆందోళనలు, మరోవైపు రాజకీయ ఒత్తిడిల మధ్య పోలీసులు శాస్త్రీయ పరిశోధన విస్మరించారనే అపవాదు ఉంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షంషాద్‌బేగం, ఇక్భాల్‌భాషాలకు ఆయేషా మొదటి సంతానం. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిమ్రా కళాశాలలో బిఫార్మసీ చదువుతూ స్థానికంగా ఉన్న ప్రైవేటు వసతి గృహంలో ఉండేది. 2007డిసెంబరు 27 ఉదయం ఆమె రక్తపు మడుగులో మరణించి ఉండటాన్ని గుర్తించారు. డిసెంబరు 26 రాత్రి ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్థరించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు ఆందోళనలు చేశాయి. సంఘటన జరిగిన తర్వాత అకస్మాత్తుగా సత్యంబాబు తెరమీదకు వచ్చారు. సరిగ్గా 2008 ఆగస్టు 17న సత్యంబాబును ఒక కేసులో అరెస్టు చేశారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబు గతంలో అదేతరహా నేరాలు చేశారని ఆయేషా హత్య తానే చేశానని అంగీకరించారని అరెస్టు చేశారు. పోలీసులే సత్యంబాబుతో నేరం అంగీకరింపజేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సత్యంబాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ 2010 సెప్టెంబరులో తీర్పు చెప్పింది. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కేసు మళ్లీ మొదటికి రావడంతో ఆయేషా హత్యకేసును సీబీఐకి అప్పగించారు. ఇప్పటికైనా ఆయేషా హత్యకేసులో అసలు దోషులను సీబీఐ గుర్తిస్తుందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.