DailyDose

అవునా? మాకు తెలియదే!-వాణిజ్యం-12/13

Infosys Claims They Are Not Aware Of New Lawsuit-Telugu Business News Roundup-12/13

* తమపై వేసిన కొత్త దావా విషయం తెలియదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఇప్పటికే కంపెనీ నిర్వాహక బృందంలోని కీలక వ్యక్తులపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా వీరిపై కేసు దాఖలు కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై రెగ్యూలేటరీలు కంపెనీని వివరణ కోరాయి. ‘‘మీడియాలో వచ్చిన కథనాలు కంపెనీ దృష్టికి వచ్చాయి. వీటిలో అదనంగా మరో దావా దాఖలు కానున్నట్లు వెల్లడించాయి. 24 అక్టోబర్‌ 2019లో వచ్చిన ఫిర్యాదులు కాకుండా ఇప్పుడు అదనపు ఫిర్యాదులపై కంపెనీకి ఎటువంటి సమాచారం లేదు. దావాలు వేసే ముందు న్యాయవాదులు మీడియాకు సమాచారం ఇవ్వడం సహజం. దావాలో మరికొందరిని భాగస్వాములను చేసుకొనేందుకు ఇలా చేస్తారు. దీనిలో భాగంగానే షాల్‌ లా ఫిమ్‌ ప్రకటన చేసినట్లు భావిస్తున్నాం’’ అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

* దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ జిగేల్‌మంది. కొనుగోళ్ల అండతో బుల్‌ రంకెలేసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేలా మరిన్ని ఉద్దీపనలు ప్రకటించొచ్చన్న అంచనాలతో దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో పరుగులు తీశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 400 పాయింట్లకు పైగా లాభపడగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ మళ్లీ 12వేల మార్క్‌ పైన స్థిరపడింది.

* ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన తొలి 100 మహిళల జాబితాలో స్థానం దక్కించుకొన్నారు. ఇటీవల ఫోర్బ్స్‌ ఈ జాబితాను విడుదల చేసింది. దీనిలో సీతారామన్‌తోపాటు హెచ్‌సీఎల్‌ సీఈవో రోష్ని నాడార్‌ మల్హోత్రా, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందార్‌ షా కూడా స్థానం దక్కించుకొన్నారు. ఈ జాబితా తొలిస్థానంలో జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌ ఉండగా.. ఆమె తర్వాత యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతి క్రిస్టియానో లగార్డో ఉన్నారు. మూడో స్థానాన్ని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ దక్కించుకొన్నారు. ఇక మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 29వ స్థానంలో ఉండటం విశేషం.

* డీజిల్‌ ఇంజిన్ల తయారీని నిలిపివేయాలనే నిర్ణయాన్ని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ పునఃపరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆంగ్ల పత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌ కథనం వెలువరించింది. కంపెనీ ప్రధాన ప్రత్యర్థులు డీజిల్‌ ఇంజిన్లను కొనసాగించాలని నిర్ణయించడంతో మారుతీ కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌ ఇంజిన్లు లాభాదాయకం కాదని మారుతీ భావించింది. కానీ, చాలా కంపెనీలు వీటిని కొనసాగిస్తుండటంతో మార్కెట్‌ షేర్‌ భారీగా కోల్పోవాల్సి వస్తోందని ఇప్పుడు మథన పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి మారుతీ ఏప్రిల్‌ నుంచి డీజిల్‌ కార్ల అమ్మకాలను నిలిపివేసి వచ్చే 2021 నుంచి మళ్లీ ఈ మార్కెట్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే బీఎస్‌6కు అనుకూలంగా 1.5లీటర్‌ ఇంజిన్‌ అభివృద్ధి చేసే పని మొదలు పెట్టింది. మరోవైపు టాటా మోటార్స్‌, హ్యూందాయ్‌, ఎంఅండ్‌ఎంలు కూడా వాటి డీజిల్‌ ఇంజిన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఆయా కంపెనీలు 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్లపైనే దృష్టిపెట్టడంతో మారుతీ కూడా ఆ దిశగానే పయనిస్తోంది. డీజిల్‌ ఇంజిన్‌ వాణిజ్యపరంగా ఎంత వరకు లాభదాయకంగా ఉంటుందో అన్న విషయాన్ని అంచనా వేయాల్సి ఉంది. అభివృద్ధి చేసే ఇంజిన్లు మారుతీతోపాటు టయోటా తయారు చేసే మారుతీ మోడళ్లకు కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. అప్పుడు భారీగా ఉత్పత్తి జరిగి ధర తగ్గే అవకాశం ఉంది. తొలుత ఫియట్‌ ఇంజిన్లను అనుకున్నా.. అవి కొత్త నిబంధనలను అందుకోక పోవడంతో సొంతగానే అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. దీనిపై కంపెనీ ప్రతినిధులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను తీసుకొస్తోంది. ఈ నెల 17న వీటిని భారత్‌లో విడుదల చేయనుంది. యాపిల్‌ కంపెనీ తీసుకొచ్చిన ఎయిర్‌పాడ్స్‌కు పోటీగా ఇంచుమించు అదే డిజైన్‌తో రియల్‌మీ వీటిని తీసుకొస్తుండడం గమనార్హం. వీటికి రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌గా నామకరణం చేసింది. అయితే, విడుదలకు ముందే వీటి ధర, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఇయర్‌ బడ్స్‌ ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది. డ్యూయల్‌ మైక్రోఫోన్‌, ఎలక్ట్రానిక్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీతో వస్తున్నాయి. వేర్‌ డిటెక్షన్‌, టచ్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో దీన్ని ఛార్జింగ్‌ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 17 గంటల పాటు వీటిని వినియోగించొచ్చు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇందులో అందిస్తున్నట్లు ఇది వరకే కంపెనీ ప్రకటించింది. దిల్లీలో 17న నిర్వహించే కార్యక్రమంలో దీన్ని విడుదల చేయనున్నారు. అదే రోజు రియల్‌మీ ఎక్స్‌2 మొబైల్‌ను కూడా రియల్‌మీ విడుదల చేయనుంది.

* ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతుండటంతో నవంబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరులో 5.54శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 4.62గా ఉండగా గత ఏడాది ఇదే నెలలో 2.33శాతంగా ఉంది. మరోవైపు అక్టోబరులో పారిశ్రామిక ఉత్పత్తి 3.8శాతం పడిపోయింది. మైనింగ్‌, తయారీరంగాల్లో ఆశించిన మేర వృద్ధి లేకపోవడంతో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 10.01శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 7.89శాతంగా ఉండగా గత ఏడాది ఇదే నెలలో (-)2.61శాతంగా ఉంది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4శాతం ద్రవ్యోల్బణ లక్ష్యం స్థాయిని ఇది అధిగమించింది.