Politics

భాజపా నుండి దేశాన్ని కాపాడుకుందాం

Priyanka Vadra Calls For Anti BJP Protest

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదని, వారి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దిల్లీలోని రాంలీలా మైదానంలో భారత్‌ బచావ్‌ పేరుతో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, రైతు సమస్యలపై నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకులు రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, చిదంబరం, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. దేశంలో నానాటికీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థ పతనమైందని, వృద్ధి కోల్పోయి, ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోందన్నారు. వీటన్నింటి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. దేశ పౌరులుగా వీటిపై స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. లేదంటే ఈ ప్రభుత్వం చేతుల్లో మన రాజ్యాంగం నాశనమవుతుందన్నారు.  

‘మోదీ ఉంటే అన్నీ సాధ్యమే’ అని భాజపా నినాదాన్ని విమర్శిస్తూ.. ‘ఆరేళ్ల భాజపా ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు కాదు కదా ఉన్న ఉద్యోగాలు పోయాయి. జీఎస్‌టీ వల్ల వ్యాపారులు నష్టపోతున్నారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాపార సంస్థలు మూతబడుతున్నాయి. ఇవన్నీ భాజపాతోనే సాధ్యమయ్యాయి’ అని ఎద్దేవా చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడకపోతే వారిని పిరికి వారిగా చూస్తారని అన్నారు. 

అంతకుముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని ఆరోపించారు. అయితే ఆయన మంత్రులు మాత్రం ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నామని నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారని, అయితే మంచి రోజులు వస్తున్నాయని మాత్రం ఆమె చెప్పలేకపోయారని విమర్శించారు