DailyDose

ట్రైనీ IPS మహేశ్వరరెడ్డి సస్పెన్షన్-తాజావార్తలు-12/14

Trainee IPS Who Abused Wife Suspended-Breaking News Roundup-12/14

* ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వరరెడ్డిని కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జవహర్‌నగర్‌ పోలీసులు… గృహహింస, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్‌గా అవకాశం కల్పిస్తామని హోంశాఖ తెలిపింది. కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌ రెడ్డి సివిల్స్‌లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ముస్సోరీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మిగతా శిక్షణా పూర్తి చేసుకోవాల్సి ఉంది. మహేశ్వరరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివే సమయంలో కీసరకు చెందిన భావనతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి 8 ఏళ్ల తర్వాత ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత తనకు విడాకులు ఇచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని భావన ఫిర్యాదులో పేర్కొంది.

* రాజధానిని అమరావతిలోనే కొనసాగించడంపై ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సందిగ్ధంలో పడేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని, కమిటీ నిర్ణయం వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శాసనమండలిలో కేవలం సభ్యుల ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పానని బొత్స వివరణ ఇచ్చారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

* పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరుతూ శనివారం ఓ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది నిజాం పాషా తెలిపారు.

* ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని యువత, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గత ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒక్కటే చేశారని ఎద్దేవా చేశారు. ‘భారత్‌ బచావో’ ర్యాలీలో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని మెరుగుపరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవేవీ నెరవేర్చలేదు’’ అని అన్నారు.

* దేశంలోనే అత్యంత యువ ఐపీఎస్‌ అధికారిగా ఓ యువకుడు రికార్డు సృష్టించబోతున్నారు. గుజరాత్‌కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్‌లోని పాలంపూర్‌ పట్టణం కనోదర్‌ గ్రామానికి చెందిన హసన్ సఫిన్‌.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 570 ర్యాంకు సాధించారు. అనంతరం అతడు ఐపీఎస్‌ అధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్‌ డిసెంబర్‌ 23న జామ్‌నగర్‌ అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

* బంగాల్‌లోని లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పౌరసత్వ సవరణచట్టాన్ని వ్యతిరేకిస్తూ బంగాల్‌లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హౌరా లోని సంక్రాలి రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టగా అక్కడ ఉన్న పలు దుకాణాలు తగలబడ్డాయి. అనంతరం టికెట్‌ కౌంటర్‌ను తగులబెట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆర్పీఎఫ్‌, రైల్వే సిబ్బందిపై దాడి చేసి గాయపరిచినట్లు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు.

* ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్‌ లీలా శాంసన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చెందిన కూతుంబలం ఆడిటోరియం పునరుద్ధరణ పనుల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లీలా శాంసన్‌తో పాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శనివారం వెల్లడించారు. లీలా శాంసన్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతేకాకుండా ఆమె సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఛైర్‌పర్సన్‌గానూ పనిచేశారు.

* ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వరరెడ్డిని కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జవహర్‌నగర్‌ పోలీసులు… గృహహింస, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్‌గా అవకాశం కల్పిస్తామని హోంశాఖ తెలిపింది.

* ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 శాతం ఫాస్టాగ్‌ లేన్స్‌ను తాత్కాలికంగా హైబ్రిడ్‌ లేన్స్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేన్లలో అటు ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులనూ అనుమతిస్తారు. అయితే నెలరోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.

* విద్యుత్‌ ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల యాజమాన్య ప్రతినిధుల సమావేశం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరిగింది. టీఎస్‌పీఈఏ అద్యక్షులు పి.రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పి.సదానందంలతో పాటు ఇతర ఇంజినీర్లు ధర్మాధికారిని కలిసి స్థానికత ఆధారంగా విద్యుత్‌ ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

* ‘దేశంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలే. మహిళలపై దాడులు అధికమయ్యాయి. మోదీ చెప్పిన సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ ఎక్కడ’? అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశ్నించారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన భారత్‌ బచావ్‌ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మోదీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ఆమె ప్రశ్నించారు.

* అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో నాలుగు గంటల పాటు రీపోస్టుమార్టం జరిగింది. ఫోరెన్సిక్‌ బృందం అయేషా పుర్రె,, ఆస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించి వాటిని పరిశీలించింది. అయేషా ఎముకల నుంచి కూడా పలు అవశేషాలను సేకరించింది. మృతదేహాన్ని వెలికితీయగా లభించిన అవశేషాలను ఓ బాక్స్‌లో ఉంచి సీలు చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. రీపోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ బృందం పూర్తి నివేదికను సీబీఐకి అప్పగించనుంది.

* దేశంలో అత్యధికంగా ఉపయోగించే 21 రకాల ముఖ్యమైన ఔషధాల ధరలు త్వరలో పెరగనున్నాయి. మందుల ధరలను నియంత్రించే నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అధారిటీ (ఎన్‌పీపీఏ), ఈ మందుల ధరలను 50 శాతం వరకు పెంచటానికి అనుమతినిచ్చింది. ధరలు పెరగనున్న ఔషధాలలో యాంటీబయోటిక్స్, ఎలర్జీ నివారణ మందులు, మలేరియా నివారణమందులు, బిసీజీ వాక్సిన్‌, విటమిన్‌ సి వంటివి ఉన్నాయి.

* ప్రజాస్వామ్య దేశంలో కార్మిక సంఘాలుండాలని, కచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వాత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్‌ పెట్టాలన్నారు. ఎక్కువమంది అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

* అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి రూ.11, ఓ ఇటుక విరాళంగా ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కోరారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తాం. ప్రతీ కుటుంబం తమ వంతుగా రూ.11, రామ మందిరం కోసం ఓ ఇటుక విరాళంగా ఇవ్వండి’ అని సీఎం యోగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

* ‘నమామీ మూసీ’ పేరుతో మూసీనది ప్రక్షాళన ఉద్యమాన్ని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రారంభించారు. అనంతగిరి మూసీ నది వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ నదికి గొప్ప చరిత్ర ఉందన్నారు. అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ నది.. హైదరాబాద్ గుండా ప్రయాణించి సూర్యాపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో పరిశ్రమల వ్యర్థాలు కలిసిపోవడంతో మూసీనది కలుషితమవుతోందని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

* గుంటూరు జిల్లా నగరపాలెంలో అత్యాచారానికి గురైన యువతిని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చట్టప్రకారం చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామని, మహిళ కమిషన్ ద్వారా దిశ చట్టంపై విస్తృత ప్రచారం చేస్తామని పద్మ చెప్పారు.

* ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు మోదీ నేడు కాన్పూర్‌ వచ్చారు. ఈ సందర్భంగా గంగా నదిలో కాసేపు సరదాగా బోటు షికారు చేశారు. గంగానది పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను ప్రధాని అధికారులతో చర్చించారు. స్వచ్ఛ గంగ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌కు మోదీ నివాళులర్పించారు.

* దేశం కోసం ఎంతో చేస్తున్న తనపై అభిశంసన తీసుకురావడం సరైంది కాదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని ట్వీట్ చేసిన ఆయన.. రాజకీయ ప్రేరేపితంగానే తనపై ఈ అభిశంసన తీసుకొచ్చారంటూ డెమోక్రాట్‌ పార్టీపై మండిపడ్డారు.

* దేశవ్యాప్తంగా చేపట్టిన ఏడో ఆర్థిక గణన మార్చి 2020 కల్లా పూర్తి కావొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం డైరక్టర్‌ జనరల్‌ ఏకే సాధు ప్రకటించారు. ఈ లెక్కింపును సాధారణ సేవా కేంద్రాల (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌- సీఎస్‌సీ) ద్వారా నిర్వహిస్తారు. ఈ మేరకు గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఇ-గవర్నెన్స్‌ సీఎస్‌సీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.