Devotional

ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి?

Dhanurmasam 2019-20. What is so special about it?

ఇళ్లు దీపకాంతులతో వెలుగొందుతూ పండగ వాతావరణం సంతరించుకునేదీ హరివిల్లు సాక్షాత్కరించేలా లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో కళకళలాడేదీ ధనుర్మాసంలోనే. ఈ మాసంలో గోదాదేవి చేపట్టిన వ్రతానికి సాక్షాత్తూ రంగనాథుడే దిగివచ్చాడని చెబుతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై సంకీర్తనలు వినిపిస్తాయి. ధనుర్మాసంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
****భక్తులు కార్తిక మాసం, మాఘ మాసం, శ్రావణ మాసంతోపాటూ ధనుర్మాసంలోనూ అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలూ నోములూ నిర్వహిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుంచీ ధనుర్మాసం మొదలవుతుంది. అప్పటి నుంచీ భోగి పండుగ వరకూ నెల రోజుల కాలాన్ని తెలుగువారు నెలగంటగా పరిగణిస్తూ పూజలు చేపడతారు. ‘ధను’ అంటే ప్రార్థించేది సిద్ధిస్తుందని అర్థమని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై కీర్తనల్ని వినిపిస్తారు. తులసికి బదులు బిల్వపత్రాలతో అర్చనలు నిర్వహిస్తారు. ఆండాళ్‌ రచించిన దివ్యప్రబంధమే ‘తిరుప్పావై’గా చెబుతారు. ద్రావిడ భాషలో ‘తిరు’ అంటే పవిత్రమనీ, ‘పావై’ అంటే వ్రతమనీ అర్థం. అందుకోసమే ధనుర్మాసం దివ్య ప్రార్థనలకు నిలయమనీ ఈ నెలలో నిర్వహించే వ్రతాలు పరమ పవిత్రమైనవనీ ప్రతిఫలంగా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల నమ్మకం. బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై సంకీర్తనలు ఆలపించిన వారికి ముక్తిమార్గం లభిస్తుందని గోదాదేవి చరిత్ర చెబుతోంది.
**పురాణాల ప్రకారం…
తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతంలోని తులసి వనంలో గోదాదేవి అయోనిజగా దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే భక్తుడు ఆమెను ప్రేమతో పెంచి పెద్దచేస్తాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుడినే పవిత్రంగా కొలుస్తుండేది. క్రమేణా… ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించుకుంటూ ఆ పరమాత్ముడిని పొందడం కోసం ఇంటిని శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులూ పూలతో వాకిలిని అందంగా అలంకరించి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. నెలరోజులపాటు పాశురాలు(భక్తిగీతాలు) ఆలపిస్తూ శ్రీరంగనాథుడికి తానే సరిజోడని మురిసిపోతూ పూలమాలల్ని అల్లి ఆ దేవాధిదేవుడికి అర్పిస్తుండేది. ఓ రోజు విష్ణుచిత్తుడు… శ్రీరంగనాథుడికి అర్పించిన పూలదండల్లో ఓ వెంట్రుకని గమనిస్తాడు. స్వామికి అర్పించేముందు ఆ దండల్ని గోదా ధరిస్తోందని తెలుసుకుని, ‘స్వామీ మహాపరాధం జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండ’ంటూ వేడుకుంటాడు. ‘స్వామి ఆశీర్వాదం స్వీకరించడం వరకే మనకు అర్హత. అంతేగానీ మనం ధరించిన వాటిని రంగనాథునికి అర్పించడం, ఆయనను వరించాలని వ్రతం చేయడం మహాపరాధం’ అంటూ గోదాదేవిని మందలిస్తాడు. అయినా పట్టువిడవకుండా వ్రతాన్ని కొనసాగిస్తూ పరమాత్మునికి పట్టపురాణిని అవుతానంటూ ప్రతినబూనింది గోదా. ఒక రోజు శ్రీరంగనాథుడే కలలోకి వచ్చి గోదాదేవితో తన కల్యాణానికి అనుమతి ఇవ్వమని కోరడంతో విష్ణుచిత్తుడు సమ్మతిస్తాడు. తరవాత గోదాదేవి రంగనాథస్వామితో ఐక్యమైపోతుంది. అందుకే కోరిన కోరికలు నెరవేరాలనీ మంచి వరుడు రావాలనీ పెళ్లికాని యువతులు ధనుర్మాసంలో పవిత్రంగా పూజలు చేస్తారని చెబుతారు. గోపికలు రేపల్లెలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందినట్లే… గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుడిని కొలిచి ఆయన్నే పెళ్లి చేసుకున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి మహిమగల కాత్యాయనీ వ్రతాన్ని పెళ్లీడుకొచ్చిన యువతులు ఇప్పటికీ నిష్ఠతో ఆచరిస్తారు.
**ముగ్గులతో అలంకరణ
భక్తులు ధనుర్మాసంలో వేకువజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని దీపాలు వెలిగిస్తారు. ధనుర్మాసం ప్రారంభం నుంచీ భోగి పండుగ వరకూ పెళ్లీడుకొచ్చిన ఆడపడుచులు ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. గోదాదేవి నెలరోజులు గానం చేసిన ముప్ఫై భక్తిగీతాల్నే రోజుకొక్కటి చొప్పున పాడుతుంటారు. ఇలా లోగిళ్లను అందంగా తీర్చిదిద్ది పూజలు చేయడం వల్ల కోరిన వరుడు వస్తాడని పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల విశ్వాసం.
**ఆలయాల్లో పూజలు
ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడిగా కొలుస్తారు. గోధుమపిండి, బియ్యంపిండి, మట్టితో విష్ణు ప్రతిమలను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. వైష్ణవ ఆలయాల్లో అర్చనలు నిర్వహించి చక్కెర పొంగలితో తయారు చేసిన ప్రసాదాన్ని నివేదిస్తారు. అనంతరం దాన్ని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగంగా పిలుస్తారు. ఈ మాసమంతా ఆలయాలు గీతా ప్రవచనాలూ విష్ణుసహస్రనామ పారాయణాలూ తిరుప్పావై సంకీర్తనలతో మార్మోగుతాయి.