NRI-NRT

గొల్లపూడికి పద్మ పురస్కారం ఇవ్వాలి

TANTEX-Dallas Telugu NRIs Request Indian Govt To Consider Gollapudi Marutirao For Padma Award-గొల్లపూడికి పద్మ పురస్కారం ఇవ్వాలి

తెలుగు కథలు, నాటకాలు, నాటికలు, పద్యాలు, గద్యాలు, సంపాదకీయాలు, సంభాషణలు, స్క్రీన్‌ప్లేలతో పాటు రష్యన్, జర్మన్, ఫ్రెంచ్ సాహిత్యం లోతుపాతులపై పరిపూర్ణ అవగాహన కలిగిన ప్రముఖ చలనచిత్ర నటులు డా.గొల్లపూడి మారుతీరావును భారత కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారానికి పరిశీలించాలని డాలస్ సాహితీవేత్తలు కోరారు. ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో డాలస్‌లోని అమరావతి సమావేశ మందిరంలో ఆయన సంస్మరణ సభను నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు, సాహితీవేత్తలు, గొల్లపూడి ఆత్మీయ మిత్రులు పాల్గొని ప్రసంగించారు. వైవిధ్యభరితమైన ప్రతిభా పాటవాలు కలిగిన గొల్లపూడి మారుతీరావును మరణానంతర పద్మ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలించవల్సిందిగా వారు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. MVL ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపూడి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని అన్నారు. డా.పుదూర్ జగదీశ్వరన్ మాట్లాడుతూ ఒక్లహోమాలోని కేసినోలో ఆయన $2 గెలుచుకున్నప్పుడు పసిపిల్లాడిలా ఆనందపడ్డారని, ఆయనది పసిపిల్లల వంటి స్వచ్ఛమైన మనస్తత్వమని కొనియాడి ఆయనపై ప్రత్యేకంగా పద్యాన్ని పాడి వినిపించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తానా సభలకు ఆయన డాలస్ విచ్చేసినప్పుడు ఆయనతో దగ్గరగా మెలిగే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. అనంత్ మల్లవరపు మాట్లాడుతూ 2007లో టాంటెక్స్ సాహిత్యవేదిక ప్రారంభోత్సవానికి ఆయనే ముఖ్య అతిథి అని, 2008లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆత్మకథ “అమ్మకడుపు చల్లగా” తనకు బహుమతిగా ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. మద్దుకూరి చంద్రహాస్ ఆయన సినీప్రస్థానంపై ప్రసంగించారు. డా.జువ్వాడి రమణ ఆటా సభల్లో ఆయనతో కలిసి చేసిన అవధానంపై ప్రసంగించారు. డా.పులిగండ్ల విశ్వనాథం-శాంతా దంపతులు గొల్లపూడి ఎప్పుడు డాలస్ వచ్చినా తమ ఇంటికి ప్రత్యేకంగా భోజనానికి వచ్చేవారని, ఎన్నో వ్యవహారాలపై ఆయనకున్న పట్టు అమోఘమని అన్నారు. లలితామూర్తి గొల్లపూడితో ఆమెకున్న 30ఏళ్ల కిందటి అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. డా.యు.నరసింహారెడ్డి గొల్లపూడి సంభాషణలు వినిపించారు. వేముల కిరణ్మయి గొల్లపూడిని పెన్సిల్వేనియాలో మొదటిసారి కలిసినప్పటి అనుభవాలు పంచుకున్నారు. వెన్నం మురళీ 2013 తానా సభల సందర్భంగా గొల్లపూడి చేసిన సాహితీ సేవలను శ్లాఘించారు. చివరగా డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ రంగస్థలం, సాహిత్యం, సినిమా, నాటకరంగం, రేడియో వంటి ఎన్నో విభిన్న రంగాల్లో బహుముఖి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశీలి అనే పదానికి నిర్వచనమని ప్రశంసించారు. గొల్లపూడితో తనకున్న ఆంతరంగిక అనుభవాలను ఆయన సభికులతో విశేషంగా పంచుకున్నారు. ఛార్లీ చాప్లిన్ సమాధి వెదుక్కుని వెళ్లి నివాళి అర్పించినా, న్యూయార్క్ బ్రాడ్‌వేను విపులంగా విశ్లేషించినా అది మారుతీరావుకే చెల్లుతుందని ఆయనతో తన సాన్నిహిత్యం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం గొల్లపూడికి సభికులు పూలతో నివాళి అర్పించారు. టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.