DailyDose

ఉన్నావ్ దోషిగా ఎమ్మెల్యేపై తీర్పు-తాజావార్తలు-12/16

BJP MLA Proved Culprit In Unnao Rape Case-Telugu Breaking News Roundup-12/16

* పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగ్గకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు పంపింది. ముఖ్యంగా హింసను ప్రేరేపించే విధంగా అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపైనా, సోషల్‌మీడియా పోస్టులు చేసేవారిపైనా చర్యలు తీసుకోవాలంది.

* తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాటిల్‌ సామర్థ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.80, బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు పెరిగిన ధరల పట్టికను ఆయన విడుదల చేశారు. పెరిగిన ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. పాత నిల్వలకు ధరల పెంపు వర్తించదని సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

* గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలికతో పాటు ఆమె కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన బాధాకరమని..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చట్టాలు తేవడం ఎంతముఖ్యమో..ఆ చట్టాలు అమలు చేయడంలోనూ ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలన్నారు. ‘దిశ’ చట్టం తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. ఆ చొరవ ఇప్పుడేమైందని సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.

* రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ పరిహారం ఎట్టకేలకు విడుదలైంది. రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి రూ.35,298 కోట్లు మేర నిధులను కేంద్రం సోమవారం విడుదల చేసింది. ఆగస్టు నుంచి పరిహారం చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాలు అసహనం వ్యక్తంచేయడం, మరోవైపు బుధవారం జరిగే జీఎస్‌టీ మండలి భేటీలో ఇదే అంశంపై రాష్ట్రాలు నిలదీసే అవకాశం ఉన్న వేళ ఈ పరిహారం విడుదల కావడం గమనార్హం.

* అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మందిర నిర్మాణ పనులు నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఝార్ఖండ్‌లో ఐదో దశ ఎన్నికల సందర్భంగా పాకుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘‘అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు కేవలం నాలుగు నెలల్లో అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా అతి పెద్ద రామమందిరం నిర్మిస్తాం’’ అని తెలిపారు.

* పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీపై ఆ రాష్ట్ర గవర్నర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజులుగా అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని అదుపులోకి తేవాల్సిన ముఖ్యమంత్రే ఇలాంటి ర్యాలీలకు పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. మరోవైపు బంగాల్‌లో వరుసగా నాలుగో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

* సూర్య గ్రహణం కారణంగా ఈనెల 26న తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 25న రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో పాటు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా మూతపడనుంది. ఈ నేపథ్యంలో 26న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

* భారత్‌కు చెందిన ది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)కు చెందిన యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చాలా దేశాలు ఇటువంటి నిధుల బదిలీ నెటవర్క్‌పై ఆసక్తి కనబర్చాయి. ఈ నేపథ్యంలో దీనిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. యూపీఐను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

* టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తిచేయని వెస్టిండీస్‌పై ఐసీసీ జరిమానా విధించింది. ఆటగాళ్లందరి మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధించింది. ఈ పోరులో టాస్‌ గెలిచిన విండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. నిర్దేశిత సమయం ముగిసేలోపు 46 ఓవర్లే విసిరింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున 4 ఓవర్లకు 80 శాతం మ్యాచు ఫీజును రెఫరీ డేవిడ్‌ బూన్‌ కోత విధించారు.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో దిల్లీలోని తీస్‌హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాజపా మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈనెల 19న శిక్ష ఖరారుపై కోర్టు వాదనలు విననుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు శశి సింగ్‌ను నిర్దోషిగా తేల్చింది.

* జామియా వర్సిటీలోకి వెళ్లేందుకు పోలీసులకు అనుమతి ఎవరిచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రశ్నించారు. జామియా వర్సిటీలో ఆదివారం పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయంగా ఉందని మండిపడ్డారు. విపక్షనేతలు సీతారాం ఏచూరి, డి. రాజా, శరద్‌ యాదవ్‌తో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు వర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల వెంటబడ్డారని ఆజాద్‌ ఆరోపించారు.

* పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడంపై బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం లభించింది. దేశంలోని మెజారిటీ పార్టీలు సైతం దీనికి మద్దతు పలికాయి. ఎలాంటి అసత్యాలను నమ్మకుండా ప్రతిఒక్కరు హింసకు దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని మోదీ అన్నారు.

* కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాపై జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఏపీ ప్రభుత్వం త్వరలో ఒప్పందం చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుము ఖనిజం కోసం ఈనెల 18న ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(ఎంఏఎన్‌యూయూ)లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వర్సిటీ గేటుకు తాళాలు వేసి నిరసన చేపట్టారు. జేఎంఐ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జిని వారంతా ఖండించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్‌ఆర్సీ ఫాసిస్టులకు ఆయుధాలుగా మారాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సీఏఏకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘భారత్‌లోని ఫాసిస్టులకు సీఏఏ, ఎన్‌ఆర్సీలు ఆయుధాలుగా మారాయి. దాన్ని ఎదుర్కొనేందుకు అహింసాత్మక సత్యాగ్రహమే సరైన విధానం. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారికి నేను సంఘీభావం తెలుపుతున్నా’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

* తన సినిమాకు నష్టం కలిగించిన సెన్సార్ సభ్యులపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడించారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోగా రెండు వారాలు ఆలస్యంగా విడుదలైందని దీనివల్ల నిర్మాతలకు రూ.కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

* ఆన్‌లైన్‌ ఆహార పంపిణీ సంస్థ జొమాటో.. క్యాబ్‌ సేవల దిగ్గజం ఉబర్‌కు చెందిన ఆహార పంపిణీ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ‘ఉబర్‌ ఈట్స్‌ ఇండియా’ పేరుతో ఆహారం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి ఈ డీల్‌ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టెక్‌ క్రంచ్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఉబర్‌ ఈట్స్‌ ఇండియా వ్యాపారం విలువ 400 మిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా.

* పౌరసత్వ సవరణ చట్టం భారత ముస్లింలకు వ్యతిరేకంగా లేదని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదని జాతీయ మైనారిటీ కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకవేళ నిరసన ప్రదర్శనలు చేసినా శాంతియుతంగా జరపాలని.. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని కమిషన్‌ ఛైర్మన్‌ సయ్యద్‌ ఘయోరుల్‌ హసన్‌ రిజ్వీ కోరారు. అలాగే పోలీసులు కూడా ఆందోళనల్ని అదుపు చేసే క్రమంలో సంయమనం పాటించాలని విన్నవించారు.

* దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 40,938 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 12,053 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.99 వద్ద కొనసాగుతోంది.