DailyDose

జొమాటో-ఊబర్ ఈట్స్ కలిసిపోతున్నాయి-వాణిజ్యం-12/16

Zomato-Uber Eats In Final Talks Of Merger-Telugu Business News Roundup-12/16

* ఆన్‌లైన్‌ ఆహార పంపిణీ సంస్థ జొమాటో.. క్యాబ్‌ సేవల దిగ్గజం ఉబర్‌కు చెందిన ఆహార పంపిణీ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ‘ఉబర్‌ ఈట్స్‌ ఇండియా’ పేరుతో ఆహారం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి ఈ డీల్‌ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టెక్‌ క్రంచ్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఉబర్‌ ఈట్స్‌ ఇండియా వ్యాపారం విలువ 400 మిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఈ డీల్‌లో భాగంగా ఉబర్‌ తిరిగి 150 నుంచి 200 మిలియన్‌ డాలర్లను జొమాటోలో పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది.

* ఆహార పదార్థాల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. నవంబరు నెలలో 0.58శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. అంతక ముందు నెలలో డబ్ల్యూపీఐ 0.16శాతంగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 4.47శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆహార పదార్థాల ధరలు అక్టోబరులో 9.80శాతం ఉండగా.. నవంబరు నెలలో 11శాతానికి చేరాయి. గత వారం విడుదల చేసిన రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరగా పారిశ్రామికోత్పత్తి క్షీణించింది. కూరగాయలు, పప్పులు, మాంసం వంటి ఆహార వస్తువుల ధరలు పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.54శాతం పెరిగి మూడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. ఇటు విద్యుత్‌, మైనింగ్‌, తయారీ రంగాల వృద్ధి మందగించడంతో పారిశ్రామికోత్పత్తి తగ్గిపోయింది.

* డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా నగదు బదిలీలు 24 గంటలు కొనసాగించేందుకు ఆర్బీఐ (రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా) నిర్ణయం తీసుకొంది. ఈ రోజు నుంచి నెఫ్ట్‌ ద్వారా ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీని రోజులో ఎప్పుడైనా చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. బ్యాంక్‌ సెలవు రోజుల్లో కూడా నెఫ్ట్‌ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. గతంలో నెఫ్ట్ ద్వారా లావాదేవీలు కేవలం ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య మాత్రమే జరుపుకొనేందుకు అవకాశం ఉండేది. తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. ఏడాది మొత్తంలో రోజు, వారం, సెలవులతో సంబంధం లేకుండా 24/7 నెఫ్ట్‌ లావాదేవీలు జరపవచ్చని తెలిపింది.

* దేశంలోని దాదాపు 15 లక్షల మంది ప్రభుత్వ విద్యుత్తు రంగానికి చెందిన ఉద్యోగులు జనవరి 8న సమ్మె చేపట్టనున్నారు. ప్రభుత్వం 2003 నాటి విద్యుత్తు చట్టానికి చేసిన సవరణలకు నిరసనగా ఒక్క రోజు సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. ‘‘విద్యుత్తు చట్టం 2003ను సవరించాలనే నిర్ణయంతో రైతులు, బలహీన వర్గాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అందుకే కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ శైలేంద్ర దుబే కోరారు. దీంతోపాటు రాష్ట్రాల పరిధిలోని విద్యుత్తు బోర్డుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా 8వ తేదీన విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రైవేటు పంపిణీ సంస్థలకు లైసెన్స్‌లు జారీ చేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ ఆందోళన మొత్తం జాతీయ విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

* దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 40,938 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 12,053 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.99 వద్ద కొనసాగుతోంది.